ఫోర్జరీ, డేటాచౌర్యంతోపాటు పలు కేసులు ఎదుర్కొంటున్న టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కోసం తెలంగాణ పోలీసులు గాలింపును తీవ్రతరం చేశారు. అతని ఆచూకీ కోసం ఇప్పటికే మూడు బృందాలు రంగంలోకి దిగినట్లు సమాచారం. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులతోపాటు టాస్క్‌ఫోర్స్ పోలీసుల బృందం రవిప్రకాశ్ జాడ కనిపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. రవిప్రకాశ్‌కు ఏపీలోని కొందరు రాజకీయ నాయకులు ఆశ్రయమిచ్చినట్లు సమాచారం. వారి వద్దే సినీనటుడు శొంఠినేని శివాజీ కూడా ఉన్నట్లు తెలిసింది. ప్రముఖుల అండతోనే శివాజీ తెలంగాణ పోలీసుల విచారణకు హాజరుకాకుండా కోర్టులో మాత్రం ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు వేస్తూ వస్తున్నారు. ఇందుకోసం లాయర్లు, అనుచరులతో మాట్లాడేందుకు పదేపదే సిమ్‌కార్డులు మారుస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు వాట్సాప్ కాల్స్‌ను కూడా వాడుతున్నారని సమాచారం. పోలీసులు అతని కాల్స్‌పై నిఘా పెట్టారు. అయితే, ఆయన నిత్యం ఫోన్లు మారుస్తున్నట్లు గుర్తించారు.
రవిప్రకాష్ కోసం పోలీసుల తీవ్ర గాలింపు

Related tags :