ఇస్రో ఖాతాలో మరో విజయం. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ46 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. 615 కిలోల బరువు గల రీశాట్-2బీఆర్1 ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ-సీ46 వాహక నౌక 557 కి.మీ ఎత్తులోని కక్షలో ప్రేవేశపెట్టింది. దీంతో పీఎస్‌ఎల్‌వీ-సీ46 ప్రయోగం దిగ్విజయమైంది. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ మంగళవారం ఉదయం 4.30 గంటలకు ప్రారంభమైంది. 25 గంటల కౌంట్‌డౌన్ ముగిసిన అనంతరం బుధవారం ఉదయం 5.30 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ46 నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ బయలుదేరిన తర్వాత 15.29 నిమిషాలకు ఉపగ్రహం విడిపోయింది. అత్యంత ఆధునిక రాడార్ ఇమేజింగ్ భూపరిశీలన ఉపగ్రహమైన రీశాట్-2బీఆర్1 కాలపరిమితి ఐదేళ్లు. ఈ ఉపగ్రహం రక్షణశాఖకు కీలకంగా మారనుంది. సరిహద్దుల్లో శత్రువుల కదలికలను ఈ ఉపగ్రహం సులువుగా గుర్తించేందుకు వీలుంది. అంతేకాక వ్యవసాయం, అటవీ రంగాల సమాచారంతో పాటు ప్రకృతి విపత్తుల్లో ఈ ఉపగ్రహం సాయపడనుంది. మొదటగా 2009లో రీశాట్‌ను ఇస్రో ప్రయోగించింది. 2012లో రీశాట్-1ను ప్రయోగించింది.
ఇస్రో మరో ఘనకార్యం
Related tags :