Movies

బాలీవుడ్ బాంబ్ దెబ్బకు…

Raghava Lawrence gets to taste the bitterness of bollywood-tnilive

‘లక్ష్మీబాంబ్‌’ సినిమా నుంచి దర్శకుడు రాఘవా లారెన్స్‌ తప్పుకోవడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. తనతో చర్చించకుండా, తన అనుమతి తీసుకోకుండా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసేశారని రాఘవ వెల్లడించారు. అ కారణం వల్లే ఆయన సినిమా నుంచి తప్పుకొన్నారు. అయితే ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న అక్షయ్‌ కుమార్‌తో మాత్రం తనకు ఎలాంటి విభేదాలు లేవని తాజాగా రాఘవ ఓ మీడియా ద్వారా వెల్లడించారు. ‘నాతో చర్చించకుండా ఫస్ట్‌లుక్‌ ఎలా విడుదల చేస్తారు? ఓ దర్శకుడిగా అది నన్ను చాలా బాధించింది. ఇప్పటికీ నాకు చిత్రవర్గం నుంచి ఎలాంటి వివరణ రాలేదు. ఈ ఘటనతో నేనో మూర్ఖుడిలా ఫీలయ్యేలా చేశారు. నన్ను గౌరవించాల్సిన అవసరం లేదని అనుకున్నారేమో. నేనేం చెప్పదలచుకున్నానంటే.. సినిమాకు సంబంధించిన విషయాలు నాకు అప్‌డేట్‌ చేస్తే చాలు. నా వెనక చాటుగా చేసేయకూడదు. నిర్మాణ సంస్థతో ఏదన్నా సమస్యలు ఉంటే అవన్నీ నా తరఫు న్యాయవాది చూసుకుంటారు. కానీ నాకు అక్షయ్‌తో ఎలాంటి సమస్యలు లేవు. ఈ ఘటన వల్ల తప్పు చేశానన్న భావన ఆయనలో కలగకూడదు. ఎందుకంటే ఈ పాత్ర కోసం అక్షయ్‌ చాలా కాలంగా కష్టపడుతున్నారు. ఆయన కోసమే నా స్క్రిప్ట్‌ను వెనక్కి ఇచ్చేయాలని నేను అడగడం లేదు’ అని వెల్లడించారు. రాఘవ నటించిన ‘కాంచన’ సినిమాకు.. ‘లక్ష్మీబాంబ్‌’ రీమేక్‌గా రాబోతోంది. కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తున్నారు. 2020 జూన్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.