Devotional

గరుడ పురాణం ప్రాముఖ్యత

గరుడ పురాణం ప్రాముఖ్యత

1. గరుడ పురాణం ప్రాముఖ్యత ? – తదితర ఆద్యాత్మిక వార్తలు
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోకూడదని… చదవ కూడదని ప్రచారం లో ఉంది. ఇది కేవలం అపోహమాత్రమే. సంక్రాంతి, అమావాస్య, పౌర్ణమి, గరుడ పంచమి, పితృదేవతల పుణ్య తిథుల్లో ఈ పురాణాన్ని చదవాలని శాస్త్రవచనం. ఇది ఒక విజ్ఞాన సర్వస్వం అని గుర్తు పెట్టుకుని దాన్ని అధ్యయనం చేసి అందులోని తప్పులు చేయకుండా సక్రమమైన మార్గంలో జీవిస్తే జీవితం సుఖమయం అవుతుంది. సమాజం వర్ధిల్లుతుంది.
*అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణం ఒకటి. పురాణాలన్నీ రచించిన వ్యాసమహర్షే దీన్ని కూడా రచించారు. ధర్మ, కర్మ, పాపాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని తన వాహనమైన గరుత్మంతుడి కోరిక మేరకు శ్రీమహావిష్ణువు బోధించాడు కాబట్టి దీనికి గరుడ పురాణం అనే పేరు వచ్చింది. నైమిశారణ్యంలో శౌనకాది మునులకు సూత మహాముని దీనిని కూడా వివరించాడు. ఇందులో మొత్తం 18 వేల శ్లోకాలున్నాయి. పురాణాల్లో సాత్త్విక, రాజస, తామస అనే మూడురకాలు ఉంటాయి. గరుడ పురాణం సాత్విక పురాణం. ఇందులో పూర్వఖండం, ఉత్తరఖండం అనే రెండు భాగాలు ఉంటాయి. పూర్వఖండంలో విష్ణువును ఎలా ఆరాధించాలి, తులసీ మాహాత్మ్యం, ఏకాదశి వ్రతవిధానం, నామ మహిమ, సదాచార విధానం మొదలైన అంశాలు ఉంటాయి. ఉత్తరఖండాన్ని ప్రేతకల్పం అంటారు. ఇందులో మరణించిన తర్వాత మనిషి పొందే అవస్థలు, యమలోకంలో మనిషికి విధించే శిక్షలు మొదలైన వివరాలు ఉంటాయిగరుడ పురాణం ప్రకారం మరికొన్ని శిక్షలు ఉన్నాయి. ఇక్కడ ఏ పాపం చేసిన వారికి ఆ నరకంలో శిక్ష అమలవుతుంది. వీటన్నిటినీ సూక్ష్మశరీరంతో జీవుడు అనుభవించాల్సి ఉంటుందని ఈ పురాణం చెబుతుంది.
*కల్తీ వంటి తప్పులకు పాల్పడేవారికి కుంభీపాకం అనే శిక్ష విధిస్తారు. అందులో సలసల కాగే నూనెలో పడేస్తారు
* వేదాల్ని ధిక్కరించిన వారికి కాలసూత్ర నరకం ప్రాప్తిస్తుంది. ఇందులో జీవుడి సూక్ష్మశరీరాన్ని కత్తులతో కోస్తారు. కొరడాలతో బాదుతారు
* అతిథులకు భోజనం పెట్టనివారికి, వారిని సమాదరించని వారికి క్రిమి భోజనం అనే నరక శిక్ష ఉంటుంది. క్రిములతో నిండిన కుండల్లో పాపిని పడేస్తారు
* శుచి, ఆచారం పాటించనివారిని పూయోద అనేక నరకంలో శిక్ష విధిస్తారు. ఇందులో మలమూత్రాలు నిండిన సముద్రంలో పడేస్తారు
* అబద్ధపు సాక్ష్యాలు చెప్పేవారిని పర్వతశిఖరాల నుంచి కిందకు పడేస్తారు. దీన్ని అవీచిమీంత నరకం అంటారు.
* ఇతర ప్రాణులను హింసించే ఉగ్రస్వభావం కలిగినవారికి దండసూకర నరకంలో శిక్ష ఉంటుంది. ఇక్కడ పాములు ఎలుకల్ని హింసించినట్లు హింసిస్తారు
* గ్రామాలకు కీడు చేసేవారిని వజ్రాల వంటి కోరలు ఉన్న జాగిలాల చేత కరిపిస్తారు. దీన్ని సారమేయోదన నరకం అని అంటారు.
* జూద వ్యసనపరులకు రౌరవ నరకం తప్పదని గరుడ పురాణం చెబుతుంది. ఇక్కడ పాపిని జంతువులతో కరిపిస్తారు.
* గదుల్లో, నూతుల్లో ఇతరులను బంధించేవారిని విషపు పొగలు పెట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తారు. దీన్ని అవధ నిరోధక నరకం అంటారు.
2. సేవాభావంతోనే సార్థకత- శ్రీశ్రీ రవిశంకర్‌
మంచి పనులు, సేవాభావంతోనే మానవ జీవితానికి సార్థకత లభిస్తుందని ‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌ అన్నారు. జీఎమ్మార్‌ సంస్థ ఛైర్మన్‌ గ్రంథి మల్లికార్జునరావుతో కలిసి ప్రత్యేక హెలికాప్టర్‌లో వచ్చిన ఆయన బుధవారం ఉదయం భద్రాచలం సీతారామ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. వారిని కార్యనిర్వహణాధికారి తాళ్లూరి రమేశ్‌బాబు, ఏఈవో శ్రావణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో స్థానాచార్యుడు స్థలసాయి, ప్రధానార్చకుడు విజయరాఘవన్‌ స్వాగతం పలికారు. ఉభయులూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశాక, క్షేత్ర ప్రశస్తిని వివరించి ప్రధాన కోవెలలో వేదాలతో ఆశీర్వచనం అందించారు. మూలవిరాట్‌తో పాటు అనుబంధంగా ఉన్న లక్ష్మీతాయారు అమ్మవారిని, ఆంజనేయస్వామిని ఇద్దరూ దర్శించుకున్నారు. ఆలయంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల నివేదికను వారికి సమర్పించిన అధికారులు..సహకారం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
3. కుప్పంలో గంగమ్మకు ముఖ్యమంత్రి పూజలు
చిత్తూరు జిల్లా కుప్పంలోని శ్రీప్రసన్న తిరుపతి గంగమాంబకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక పూజలు చేశారు. బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బుధవారం ఉదయం ఆయన గణేష్‌పురంలోని న్యాక్‌ బిల్డింగ్‌ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు… అక్కడి నుంచి కుప్పం పీఈఎస్‌ వైద్యకళాశాల అతిథిగృహానికి చేరుకున్నారు. అనంతరం సతీమణి భువనేశ్వరితో కలిసి ఆలయం వద్దకు వచ్చారు. అర్చకులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. తొలుత విఘ్నేశ్వరునికి పూజలు చేశారు. శ్రీప్రసన్న తిరుపతి గంగమాంబ ఆలయానికి చేరుకుని అమ్మవారి విశ్వరూపదర్శనాన్ని చేసుకున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా అమ్మవారికి హారతి ఇచ్చారు.
4. 8న చేప ప్రసాదం పంపిణీ
ఆస్తమా నయం కోసం ఏటా మృగశిరకార్తె ప్రవేశం రోజున పంపిణీ చేసే చేప ప్రసాదాన్ని ఈ ఏడాది జూన్‌ 8న నాంపల్లి ఎగ్జిబిషన్‌గ్రౌండ్‌లో అందించనున్నామని బత్తిని సోదరులు తెలిపారు. చేపలు మింగనివారు బెల్లంలో సైతం ప్రసాదాన్ని తీసుకోవచ్చన్నారు. ఈ ఏడాది మృగశిరకార్తె జూన్‌ 8న సాయంత్రం 6 గంటలకు ప్రవేశించనుండటంతో ఆదే సమయంలో పంపిణీ మొదలవుతుంది. మర్నాడు సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని బత్తిని సోదరులు గౌరీశంకర్‌, హరినాథ్‌గౌడ్‌ వివరించారు.
5. గంగా దసరా
గంగానది దివి నుంచి భువికి తీసుకువచ్చిన భగీరథుడి కథ పురాణాల్లో సుప్రసిద్ధం. పవిత్రమైన గంగమ్మ నేలకు దిగిన రోజుగా… అంటే ‘గంగావతరణ దినం’గా జ్యేష్ఠ శుద్ధ దశమిని ఉత్తరాదిన పాటిస్తారు. ఆ రోజున బ్రహ్మదేవుడి కమండలంలోనుంచి గంగానది పుట్టిందని చెబుతారు. ఈ సందర్భంగా గంగానదిలో పవిత్ర స్నానాలు చేస్తారు. పూజలు నిర్వహించి, హారతులు ఇస్తారు. దీనితో అన్ని పాపాలూ తొలగిపోతాయన్నది భక్తుల విశ్వాసం. ఈ రోజున దానాలు చేయడం కూడా పుణ్యప్రదమని భావిస్తారు. అందుకే స్నానాలకు వచ్చే తోటి భక్తులకు స్వీట్లూ, షర్బత్‌ లాంటి పానీయాలను అనేకమంది పంచుతూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో పతంగుల పండుగలు నిర్వహిస్తారు.
ఎప్పుడు?: ఈ ఏడాది జూన్‌ 12న
ఎక్కడ?: ప్రధానంగా గంగానది పరివాహక ప్రాంతంలోని అలహాబాద్‌ (ప్రయాగ), హరిద్వార్‌, ఘర్‌ముక్తేశ్వర్‌, ఋషీకేశ్‌, వారణాసిలో ఈ వేడుకలు విశేషంగా జరుగుతాయి. వారణాసిలోని దశాశ్వమేథ ఘాట్‌లో, హరిద్వార్‌లోని హర్‌ కి పౌడీలో గంగమ్మకు ప్రత్యేక హారతులు ఇస్తారు.
6. చరిత్రలో ఈ రోజు/మే 23
1707 : ప్రముఖ స్వీడన్ జీవ శాస్త్రవేత్త మరియు వైద్యుడు, ఆధునిక వర్గీకరణ శాస్త్ర పితామహుడు కరోలస్ లిన్నేయస్ జననం (మ.1778).
1984: మొట్టమొదటి సారిగా ఒక భారత మహిళ బచేంద్రీ పాల్ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించింది.
1942: ప్రముఖ సినీ దర్శకుడు కె. రాఘవేంద్ర రావు జననం.
1945 : మలయాళ భాషా రచయిత, చిత్రానువాదకుడు, మరియు చిత్రనిర్మాత పద్మరాజన్ జననం.
1953 : భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించిన శ్యాంప్రసాద్ ముఖర్జీ మరణం (జ.1901)..
1965 : తెలుగు సినిమా దర్శకుడు వై.వి.యస్.చౌదరి జననం.
1995: జావా ప్రోగ్రామింగ్ భాష మొదటి వర్షన్ విడుదలైంది.
7. శ్రీరస్తు శుభమస్తు
తేది : 23, మే 2019

సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : వైశాఖమాసం
ఋతువు : వసంత ఋతువు
కాలము : వేసవికాలం
వారము : బృహస్పతివాసరే (గురువారం)
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
image.gif

తిథి : పంచమి
(ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 41 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 4 గం॥ 19 ని॥ వరకు పంచమి తిధి తదుపరి షష్ఠి తిధి)
నక్షత్రం : ఉత్తరాషాఢ
(ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 13 ని॥ నుంచి ఉత్తరాషాఢ నక్షత్రం ఈరోజు పూర్తిగా ఉన్నది)
యోగము : శుభము
కరణం : కౌలవ
వర్జ్యం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 59 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 44 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 5 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 48 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 9 గం॥ 50 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 42 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 3 గం॥ 0 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 52 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 0 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 0 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 30 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 6 గం॥ 0 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 30 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 31 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 27 ని॥ లకు
సూర్యరాశి : వృషభము
చంద్రరాశి : ధనుస్సు