చంద్రబాబు ప్రభుత్వ హయాంలో స్పీకర్‌గా వ్యవహరించిన డా.కోడెల శివప్రసాదరావు ప్రతిపక్షనేత జగన్‌తో పాటు ఆయన పార్టీకి అసెంబ్లీలో అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కోడెల శివప్రసాదరావు మాత్రం పక్కగా తెలుగుదేశం పార్టీ వ్యక్తిగానే వ్యవహరించారు. గతంలో ఉన్న స్పీకర్లు అసెంబ్లీ సంప్రదాయాలను ఖచ్చితంగా పాటిస్తూ ప్రజల్లో పేరు తెచ్చుకున్నారు. కోడెల మాత్రం అసెంబ్లీలో అడ్డగోలుగా వ్యవహరించారు. జగన్ మాట్లాడేటపుడు చాలా సార్లు మైక్ కట్ చేశారు. వైకాపా ఎమ్మెల్యేలు తాము చెప్పాలనుకునే విషయాలను చెప్పనిచ్చేవారు కాదు. వైకాపా ఎమ్మెల్యే రోజాను ముప్పతిప్పలు పెట్టారు. ఒక మహిళ అని కూడా చూడకుండా రోజాను సభ నుండి శాశ్వతంగా గెంటివేశారు. స్పీకర్ కోడెల వ్యవహార శైలి ఇటు ప్రజల్లోనూ అసంతృప్తి కలిగించింది. చంద్రబాబు ప్రభుత్వానికి చావుదెబ్బ కలగడానికి కోడెల వ్యవహారశైలి కూడా ఒక ప్రధాన కారణం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. 2014లో నరసరావుపేటలో గెలవలేక సత్తెనపల్లికి తరలివెళ్లిన కోడెల అప్పట్లో స్వల్ప మెజార్టీతో ఎన్నికయ్యారు. కోడెలతో పాటు ఆయన కుమారుడు శివరాం కూడా నరసరావుపేట, సత్తెనపల్లిలో బాగా దుర్మార్గాలకు, దందాలకు పాల్పడ్డారని అక్కడి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. నరసరావుపేటలో శివరాం తెలుగుదేశం అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేయించడానికి కోడెల పెద్ద ఎత్తున ప్రణాళికలు వేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అయితే సత్తెనపల్లిలోనే కోడెలకు తిరిగి సీటు ఇవ్వవద్దని పెద్ద ఎత్తున అక్కడి తెదేపా కార్యకర్తలే ఆందోళన చేపట్టారు. తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు స్పీకర్ కోడెలకు సత్తెనపల్లి టికెట్ తిరిగి కేటాయించారు. ఈసారి కోడెలకు ఘోర పరాభవాన్ని సత్తెనపల్లి ప్రజలు చూపించారు. వైకాపా అభ్యర్థి అంబటి రాంబాబు చేతుల్లో 21000 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మంచి అనుభవం ఉన్న కోడెల శివప్రసాదరావు గత అయిదేళ్లలో తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి. సహజంగా అసెంబ్లీలో డిప్యుటీ స్పీకర్లు కీలక పాత్ర పోషిస్తారు. కోడెల తన అయిదేళ్ల స్పీకర్ పదవీకాలంలో ఏనాడు పట్టుమని పది నిమిషాలు కూడా డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్‌కు అసెంబ్లీని నిర్వహించే అవకాశం కల్పించలేదు. అసెంబ్లీలో చాలా సార్లు చంద్రబాబుకు మద్దతుగా స్పీకర్ పక్షపాత వైఖరిని బాహాటంగానే ప్రదర్శించారు. దీంతో విసుగెత్తిన వైకాపా అద్యక్షుడు వై.ఎస్.జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కోడెల స్పీకర్‌గా ఉన్నంతకాలం తాను, తన ఎమ్మెల్యేలు అసెంబ్లీ ముఖం చూడమని ప్రకటించి బహిష్కరించారు. జగన్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. స్పీకర్ కోడెల అసెంబ్లీలో వైకాపా గొంతు నొక్కుతూ ఉన్నారని, మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ప్రజలు స్పష్టంగా గమనించారు. స్పీకర్ కోడెల తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు అసెంబ్లీలో వ్యవహరించిన తీరు చంద్రబాబు ప్రభుత్వ పతనానికి ప్రధాన కారణాల్లో మొదటిగా నిలిచింది అనడంలో సందేహం లేదు.
*** చంద్రబాబుకు గుణపాఠం నేర్పనున్న జగన్
“నీవు నేర్పిన విద్యే ..నీరజాక్ష” అన్న సామెతను వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో జగన్ కొనసాగించబోతున్నారు. గతంలో వైకాపా ఎమ్మెల్యేలను చంద్రబాబు అనేక ప్రలోభాలకు గురి చేసి తన వైపునకు తిప్పుకున్నారు. దాదాపు 30మంది వైకాపా ఎమ్మెల్యేలు చంద్రబాబు పక్కన చేరారు. వారంతా ఈ ఎన్నికల్లో చిత్తయిపోయారు. జగన్ పక్కనే ఉన్న వైకాపా ఎమ్మెల్యేలకు నిధులు, అధికారం లేకుండా చంద్రబాబు వారిని ఉత్సవ విగ్రహాలుగా మట్టి బొమ్మల్లా ఉంచారు. అయినప్పటికీ జగన్ వెన్నంటే ఉన్న ఎమ్మెల్యేలుకు ప్రజలు ఈ ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టారు.
*** కొత్త స్పీకర్ ఎవరబ్బా?
చంద్రబాబు చేతిలో దగాపడిన వారిలో ఆయన తోడల్లుడు డా. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒకరు. ఆయన విజయం సాధిస్తే ఆయనతోనే చంద్రబాబుకు గుణపాఠం చెప్పించాలని జగన్ తొలుత ప్రణాళికలు వేసినట్లు సమాచారం. కాని దగ్గుబాటి పర్చూరులో స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలవడం వైకాపా వర్గాల్లో నిరాశ కలిగించింది. దీంతో జగన్ క్యాబినెట్‌లో మంత్రులు కన్నా కాబోయే స్పీకర్‌పైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. చంద్రబాబు చేతిలో ఘోరంగా దగాపడిన లక్ష్మీపార్వతిని స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టాలని జగన్‌కు చాలా మంది సలహా ఇస్తున్నారు. కొందరు ఒత్తిడి కూడా తెస్తున్నారు. అయితే లక్ష్మీపార్వతిని ఎమ్మెల్యేగా గెలిపించడం జగన్‌కు కొంచెం కష్టమైన పని. దీంతో గత అసెంబ్లీలో స్పీకర్ చేతిలో దగాపడిన ఆర్కే రోజాకు స్పీకర్ పదవి కేటాయించాలని వైకాపాలో గట్టి అభిప్రాయం వ్యక్తమవుతోంది. రోజా అంగీకరిస్తే స్పీకర్ పదవి ఆమెకే దక్కవచ్చు. లేని పక్షంలో స్పీకర్ కోడెలపై విజయం సాధించిన అంబటి రాంబాబు పేరు పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది. ఏదీ ఏమైనప్పటికీ చంద్రబాబును గట్టిగా ఎదుర్కొనే అభ్యర్థినే జగన్ స్పీకర్ స్థానంలో కూర్చోబెడతారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. —కిలారు ముద్దుకృష్ణ , సీనియర్ జర్నలిస్టు.