ఏపీ, తెలంగాణ ఎన్నికల్లో తాను చెప్పిన ఎగ్జిట్ పోల్స్ సర్వేలు లెక్క తప్పాయని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ లేఖ విడుదల చేశారు. ప్రజల నాడి తెలుసుకోవడంలో విఫలమైందనందుకు చింతిస్తున్నట్టు చెప్పారు. భవిష్యత్తులో సర్వేలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. 2004 నుంచి అనేక రాష్ట్రాల్లో సర్వేలు చేస్తూ వచ్చానన్న ఆయన.. పక్షపాతం లేకుండా అనేక సందర్భాల్లో ప్రజలనాడి తెలిపామన్నారు. తన సర్వేల వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే మన్నించాలని కోరారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న వైకాపా అధ్యక్షుడు జగన్‌కు లగడపాటి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలని సూచించారు. తాజా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 100కి పది అటుఇటుగా అసెంబ్లీ స్థానాలు, 15 లోక్‌సభ సీట్లు (రెండు అటుఇటుగా), వైకాపాకు 72కు 7 సీట్లు అటుఇటుగా అసెంబ్లీ, 10కి (రెండు అటుఇటుగా) లోక్‌సభ స్థానాలు వస్తాయని లగడపాటి అంచనా వేసిన విషయం తెలిసిందే. అయితే, లగడపాటి అంచనాలను పూర్తిగా తారుమారు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా 151 అసెంబ్లీ స్థానాలు, 22 లోక్‌సభ స్థానాల్లో విజయంతో ప్రభంజనం సృష్టించింది. తెదేపా కేవలం 23 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాలకు పరిమితమైంది. అలాగే, తెలంగాణలోనూ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని లగడపాటి వేసిన అంచనాలు కూడా తారుమారైన నేపథ్యంలో ఈ నెల 19న తిరుపతిలో విలేకర్లు అడిగిన ప్రశ్నకు స్పందించిన లగడపాటి.. ఈసారి తాను చెప్పిన అంచనాలు నిజం కాకపోతే సర్వేలు ఇక చెప్పబోనంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం లేఖను విడుదల చేశారు.
నా సర్వేలకు సంతాపం ప్రకటిస్తున్నా
Related tags :