Movies

తలుపు తట్టాకే

Puja Hegde on her first roles in tollywood

పాత్రల విషయంలో ప్రయోగాలు చేస్తామని చెప్పే కథానాయికలని చూస్తూనే ఉంటాం. ఆ విషయంలో పూజా హెగ్డే మరో అడుగు ముందుకేసి – ‘నా తెరంగేట్రమే ఒక ప్రయోగంలా జరిగింది తెలుసా?’ అంటోంది. అందాల పోటీల్లో మెరిసి, ఆ తర్వాత మోడల్‌గా మారి సినీ అవకాశాలు అందుకొంది పూజా. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో వరుసగా అవకాశాలు అందుకొంటోంది. ఇటీవల ‘మహర్షి’తో మరోసారి తెలుగు ప్రేక్షకుల్ని మురిపించిన ఈమె… తొలి అవకాశం తలుపు తట్టే వరకు కూడా సినీ రంగ ప్రవేశం గురించి ఆలోచించలేదని చెబుతోంది. ‘‘తొలి సినిమా కోసం దర్శకనిర్మాతలు నన్ను సంప్రదించినప్పుడు… నాకు ఏమాత్రం పరిచయం లేని రంగం కదా, రాణిస్తానో లేదో అని తెగ ఆలోచించా. ‘ఏదైనా చేస్తే కదా, అందులో లోతుపాతులు, ఇష్టాయిష్టాలు తెలిసేది’ అంటూ మా అమ్మ నన్ను ప్రోత్సహించింది. అలా ఒక ప్రయోగం చేస్తున్నట్టు భావిస్తూనే కెమెరా ముందుకొచ్చా. కానీ ఆ తర్వాత సినిమానే ఇష్టమైన రంగంగా మారింద’’ని చెప్పింది పూజా. కొత్తగా ప్రయత్నించడం చిన్నప్పట్నుంచీ అలవాటే అంటున్న ఆమె… ప్రస్తుతం ఫ్యాషన్‌తో పాటు ఫిట్‌నెస్‌ విషయంలోనూ ఎప్పటికప్పుడు కొత్తదారుల్ని కనుక్కుంటూ చాలా ప్రయోగాలే చేస్తున్నానని చెప్పింది.