* 100మంది చిన్నారుల స్వాగత నృత్యం
* మొట్టమొదటి సారి 25మంది భారతీయ్ గురువులకు సత్కారం
ఇర్వింగ్ వేదికగా ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) 6వ అమెరికా తెలుగు సంబరాలు రెండో రోజు వినూత్నంగా, వైవిధ్యభరితంగా ప్రారంభం అయ్యాయి. నాట్స్ సభల నిర్వహణ కార్యవర్గం, నాట్స్ కార్యవర్గం పూర్ణకుంభంతో సభాస్థలి వద్దకు చేరుకుని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్థానికంగా ఉన్న 100మందికి పైగా చిన్నారులు సిరాశ్రీ రచనలో ఆర్పీ పట్నాయిక్ సంగీత దర్శకత్వంలో రూపొందించిన “మనంతా తెలుగు-మనసంతా వెలుగు” పాటకు స్వాగతనృత్యంతో వేడుకల ప్రారంభానికి మరింత వన్నె తెచ్చారు. విజయనగర ఇంజినీరింగ్ కాలేజీ (VEC) పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఈ వేడుకల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అమెరికా నలుమూలల నుండి 800మందికి పైగా పూర్వ విద్యార్థులు, తమకు విద్యాబుద్ధులు నేర్పిన 25మంది ఉపాధ్యాయులను ప్రత్యేకంగా భారతదేశం నుండి తీసుకుని వచ్చి ఈ వేదికపై ఘనంగా సత్కరించారు. సినీనటుడు సాయికుమార్ ఈ కాలేజీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని పూర్వ విద్యార్థుల చొరవను అభినందించి ఉపాధ్యాయులు, నాట్స్ కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
*** విందు బాగుందని అతిథుల ఆనందం
అమెరికాలో తెలుగు సంబరం అంటే తొలుత గుర్తుకు వచ్చేది విందు భోజనం. నాట్స్ సంబరాల్లో బ్యాంక్వెట్ విందులో వెరైటీలతో పాటు రుచి కూడా అద్భుతంగా కుదిరిందని అతిథులు ఆనందం వ్యక్తపరిచారు. శనివారం మధ్యాహ్నం విందు కూడా రుచిభరితంగా తయారు చేసిన బావర్చి వారిని అతిథులు ప్రత్యేక అభినందించారు. శనివారం మధ్యాహ్నం కార్యక్రమానికి సుమారు 3000కు పైగా అతిథులు హాజరయ్యారు. రాజ్యసభ మాజీ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మధ్యాన్నం మల్లవరపు అనంత్ సమన్వయంలో జరిగే సాహిత్య సమావేశంలో ఆయన కీలకోపన్యాసం చేయనున్నారు. సంబరాల ఏర్పాట్లను సభల చైర్మన్ కంచర్ల కిషోర్, నాట్స్ అధ్యక్షుడు మంచికలపూడి శ్రీనివాసబాబు, నాట్స్ BOD చైర్మన్ గుత్తికొండ శ్రీనివాస్, అప్పసాని శ్రీధర్ తదితరులు పర్యవేక్షిస్తున్నారు. ఈ వేడుకల్లో నాట్స్ సభ్యులు డా.మధు కొర్రపాటి, శ్యాం మద్దాలి, వెనిగళ్ల వంశీ, రమేష్ నూతలపాటి, సూర్యదేవర రామానాయుడు తదితరులు పాల్గొన్నారు.