*** ఉల్లాసంగా సాగిన రెండో రోజు సాయంకాల వేడుకలు
ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) 6వ అమెరికా తెలుగు సంబరాల్లో రెండో రోజు శనివారం సాయంకాల కార్యక్రమ ప్రముఖ సినీతార తమన్నా తళుకులతో మెరిసిపోయింది. సత్యం మాస్టారి నృత్య దర్శకత్వంలో ప్రవాస యువత నాట్యాలతో ప్రారంభమయిన ఈ సాయంకాలం మనో సంగీత విభావరితో ముగిసింది. అంధులకు చేయూతనందిస్తున్నందుకు డా.వాడ్రేవు కామరాజు, సామాజిక సేవాకు గానూ డా.పగిడిపల్లి దేవయ్యలకు జీవన సాఫల్య పురస్కారాలను అందజేశారు. డా.కొర్రపాటు మధు ఈ పురస్కారాలను ప్రకటించగా నాట్స్ సభల చైర్మన్ కంచర్ల కిషోర్, నాట్స్ BOD చైర్మన్ గుత్తికొండ శ్రీనివాస్, నాట్స్ చైర్మన్ మంచికలపూడి శ్రీనివాసబాబు, మాజీ BOD చైర్మన్ మద్దాలి శ్యాం్‌లు సంయుక్తంగా పురస్కారాలను గ్రహీతలకు అందించారు. ఆర్పీ పట్నాయిక్ చేతుల మీదుగా $25వేలు లేదా అంతకు మించి ఇచ్చిన దాతలను ప్రత్యేకంగా సత్కరించారు. సినీనటుడు సాయికుమార్ “దానవీరశూరకర్ణ” ఏకపాత్రాభినయం అలరించింది. అనంతరం ఈ వేడుకలకు 6నెలలు శ్రమించిన 500మంది స్వచ్ఛంద కార్యకర్తలను మాదాల రాజేంద్ర సభావేదిక పైకి ఆహ్వానించి గౌరవించారు. ఈ సందర్భంగా నాట్స్ అధ్యక్షుడు మంచికలపూడి శ్రీనివాసబాబు మాట్లాడుతూ భాషే రమ్యం-సేవే గమ్యం నినాదంతో నాట్స్ చేస్తున్న కార్యక్రమాలకు స్వచ్ఛంద కార్యకర్తలే బలమని, ఈ వేడుకల విజయవంతానికి కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అమెరికాలో మొట్టమొదటి సారి మిస్ ఇండియా టీన్ USA అందాల పోటీలో కిరీటాన్ని కైవసం చేసుకున్న తెలుగమ్మాయి కోడే ఈషాను సభ సత్కరించింది. సినీనటి తమన్నా మాట్లాడుతూ తాను పుట్టింది ముంబాయి అయినప్పటికీ తెలుగు తనకు రెండో ఇంటితో సమానమని పేర్కొన్నారు. నాట్స్ సభలకు రావడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం నూతి బాపు, అన్నే విజయశేఖర్‌లను ఆమె చేతుల మీదుగా సత్కరించారు. తమన్నాను, సినీ గాయకుడు మనోను నాట్స్ కార్యవర్గం ఘనంగా సన్మానించింది. మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి హస్యం పండింది. విందు భోజనంలో పచ్చిపులుసు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకల విజయవంతానికి కిషోర్ వీరగంధం, అప్పసాని శ్రీధర్, ఫణీంద్ర యలమంచిలి, సురేంద్ర, కలిదిండి ప్రేం తదితరులు విశేష కృషి చేశారు. 3500కుపైగా అతిథులు ఈ రెండో రోజు వేడుకల్లో పాలు పంచుకున్నారు.
తెలుగు సంబరంలో తమన్నా తళుకులు
Related tags :