Politics

మల్కాజ్‌గిరిని నోయిడా చేస్తా

Congress MP Revanth Reddy Wants To Make Malkajgiri Into Noida

తెలంగాణను సీఎం కేసీఆర్‌ ఓ రాష్ట్రం కాకుండా రాజ్యమనుకున్నారని.. అందుకే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తెరాసకు తగిన బుద్ధి చెప్పారని మల్కాజ్‌గిరి ఎంపీగా గెలుపొందిన కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి అన్నారు. తండ్రీ కొడుకుల అహంకారం అణిచేందుకే ప్రజలు ఈ విధమైన ఫలితాలు ఇచ్చారని చెప్పారు. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పును బాధ్యతగా భావిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలు ఇచ్చిన అధికారంతో కుటుంబ పాలన చేస్తున్నారని రేవంత్‌ ధ్వజమెత్తారు. తన తొలి ప్రాధాన్యత నియోజకవర్గంలో సమస్యల్ని పరిష్కరించడమేనన్నారు. అలాగే, రాష్ట్ర విభజన హక్కులపై పార్లమెంట్‌లో గళమెత్తుతానని చెప్పారు. తనను ఆశీర్వదించి గెలిపించిన మల్కాజ్‌గిరి ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. తెలంగాణ సమస్యల్ని పార్లమెంట్‌లో గళమెత్తేందుకు తనను గెలిపించారని.. ఈ గెలుపులో తన ప్రమేయం కంటే తెలంగాణ సాధించుకున్న విద్యార్థుల పాత్రే ఎక్కువగా ఉందని చెప్పారు. విభజన హామీల అమలుతో పాటు తెలంగాణకు రావాల్సిన జాతీయ ప్రాజెక్టులు.. రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు, ఉక్కు కర్మాగారం, ఖమ్మంలో గిరిజన వర్సిటీ తదితర అంశాలపైనే తాను పార్లమెంట్‌లో లేవనెత్తుతానన్నారు. మల్కాజ్‌గిరిని మరో నోయిడాగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.