టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తొలి ఎన్నికల్లోనే అదరగొట్టాడు. రాజకీయ మైదానంలో అరంగేట్రం చేసిన తొలిసారే అద్భుత శతకం బాదేశాడు. తూర్పు దిల్లీలో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌పై భారీ మెజారిటీతో విజయం సాధించాడు. గౌతీ 6,95,109 ఓట్లు సాధించాడు. అంటే 55.35 శాతం ఓట్లన్నమాట. ఇక కాంగ్రెస్ అభ్యర్థి అర్విందర్ సింగ్ లవ్లీకి 3,04,718 ఓట్లు లభించాయి. ఆమ్‌ఆద్మీ నేత ఆతిశీ మెర్లీన్ 2,19,156 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. గంభీర్ 3,90,391 ఓట్ల మెజారిటీతో విజయ దుందుభి మోగించాడు. విజయం సాధించిన వెంటనే గంభీర్ తన ప్రత్యర్థుల పేర్లను ఉదహరిస్తూ ఓ ట్వీట్‌చేశాడు. ‘ఇది ‘లవ్లీ’ కవర్ డ్రైవో లేదా ’ఆతిశీపై బల్లెబాజీనో కాదు. ఇది ప్రజలు ఆమోదించిన భాజపా గంభీర భావజాలం. భాజపా జాతీయ పార్టీకి, భాజపా దిల్లీకి, అద్భుత తీర్పునిచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. ప్రజల ఎంపికను విఫలం కానివ్వం’ అని గౌతీ ట్వీట్ చేశాడు. ఇక మరో ట్వీట్‌లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్‌ఆద్మీ ఎనిమిది నెలల్లో నేలమట్టం ఖాయమని రాశాడు. ముక్కుసూటిగా మాట్లాడే గౌతీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఎలా రాణిస్తాడో చూడాల్సి ఉంది.
తొలి రాజకీయ విజయంతో గంభీర్ ఇరగదీశాడు
Related tags :