Politics

తెదేపాను నిట్టనిలువునా చీల్చిన జనసేన

janasena rips tdp into two parts-tnilive political news in telugu

తెదేపా విజయంపై జనసేన పెను ప్రభావం చూపింది. ఆ పార్టీ అభ్యర్థులు సాధించిన ఓట్లను విశ్లేషిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. రాష్ట్రంలోని 8 లోక్‌సభ, 31 శాసనసభ నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఆయా నియోజకవర్గాల్లో వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు. వారికి వచ్చిన మెజారిటీ కన్నా కొన్ని చోట్ల జనసేన అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఎన్నో రెట్లు అధికంగా ఉన్నాయి. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, నరసాపురం, మచిలీపట్నం, బాపట్ల లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ ప్రభావం కనిపిస్తోంది. బాపట్ల నియోజకవర్గంలో జనసేన మద్దతుతో బీఎస్పీ అభ్యర్థి రంగంలో నిలిచారు. ఇక్కడ వైకాపా అభ్యర్థికి 15881 ఓట్ల మెజారిటీ రాగా… బీఎస్పీ అభ్యర్థికి 41,816 ఓట్లు లభించడం గమనార్హం. జనసేన అభ్యర్థుల్లో అత్యధిక ఓట్లు విశాఖ లోక్‌సభ అభ్యర్థి సీబీఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ సాధించారు. ఆ తర్వాత అమలాపురం అభ్యర్థి డీఎంఆర్‌ శేఖర్‌, సినీ నటుడు నాగబాబులకు వచ్చాయి. శ్రీకాకుళం, విజయనగరం, గాజువాక, అనకాపల్లి, యలమంచిలి, ప్రత్తిపాడు (తూ.గో), పిఠాపురం, కాకినాడ రూరల్‌, కాకినాడ నగరం, రామచంద్రపురం, ముమ్మిడివరం, అమలాపురం, గన్నవరం, కొత్తపేట, నిడదవోలు, ఆచంట, నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు, కైకలూరు, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, మంగళగిరి, పొన్నూరు, వేమూరు, తెనాలి, ప్రత్తిపాడు (గుంటూరు), గుంటూరు తూర్పు, నెల్లూరు నగరం నియోజకవర్గాల్లో జనసేన సాధించిన ఓట్లు తెదేపా విజయావకాశాలను దెబ్బతీశాయి.