***కావల్సినవి:
వండిన మటన్ – కప్పు, ఉల్లిపాయలు – రెండు (ముక్కల్లా కోయాలి), పచ్చిమిర్చి – మూడు (తరగాలి), సన్నగా తరిగిన అల్లం,వెల్లుల్లి ముక్కలు – అరటేబుల్‌స్పూను చొప్పున, కారం – అరచెంచా, పసుపు – పావుచెంచా, కొత్తిమీర తరుగు – టేబుల్‌స్పూను, గుడ్లు – మూడు, పాలు – అరకప్పు, మైదా – అరకప్పు, మిరియాలపొడి – పావుచెంచా, ఉప్పు – తగినంత, నూనె – పావుకప్పు, నెయ్యి – టేబుల్‌స్పూను.
*** తయారీ:
ఉడికించిపెట్టుకున్న మటన్‌ని మెత్తని ముద్దలా చేసుకుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి అందులో ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అవి కాస్త వేగాక పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ముక్కలు వేయాలి. రెండుమూడు నిమిషాలయ్యాక కారం, కొద్దిగా ఉప్పూ, పసుపూ ముందుగా ఉడికించిపెట్టుకున్న మటన్, కొత్తిమీరనూ వేసి బాగా కలపాలి. ఇది కూరలా తయారయ్యాక దింపేయాలి. ఇప్పుడు గుడ్లసొనా, పాలూ, మైదా, తగినంత ఉప్పూ, మిరియాలపొడీ మిక్సీ జారులోకి తీసుకుని మిక్సీ పట్టాలి. అన్నీ కలిశాయానుకున్నాక విడిగా తీసుకోవాలి. కుక్కర్‌లో పెట్టాలనుకున్న గిన్నెకు నెయ్యి రాయాలి. ఇందులో ముందుగా గుడ్డు మిశ్రమం, దానిపై మటన్ కూరను పరిచినట్లు వేసి మూత పెట్టేయాలి. మంట తగ్గించి వెయిట్ పెట్టి ఐదు నుంచి ఏడు నిమిషాలు ఉంచి తరవాత దింపేయాలి. ఈ మిశ్రమం మధ్యలో టూత్‌పిక్ గుచ్చి ఇవతలకు తీయాలి. టూత్‌పిక్‌కు మిశ్రమం అంటుకోకపోతే అయిపోయినట్లే. ఆ గిన్నెను ఓ పళ్లెంలో బోర్లా ఉంచితే.. కేక్ ఇవతలకు వచ్చేస్తుంది. కావల్సిన ఆకృతిలో ముక్కల్లా కోసుకుంటే చాలు.