DailyDose

జగన్ ముందు ఏడ్చిన ఎంపీ-రాజకీయ-05/25

May 25 2019 - Daily Political News - Bapatla MP Cries In Front Of YS Jagan - TNILIVE

*క‌న్నీరు పెట్టుకున్న బాపట్ల ఎంపీ..వైసీపీ ఎంపీగా బాప‌ట్ల నుండి గెలిచిన నందిగం సురేష్ వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశంలో క‌న్నీరు పెట్టుకున్నారు.పార్టీ అధినేత జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం జ‌రిగింది. ఆ స‌మ‌యంలో సురేష్ స్పందిస్తూ తాను ఇదే రాజ‌ధాని ప్రాంతంలో పొలం ప‌నులు చేసుకొనే వాడిన‌ని, ఏ మాత్రం ఆర్థిక నేపథ్యం లేని త‌న‌ను ఎంపీగా ప్ర‌కిటించి..గెలిపించి, పార్‌శమెంట్ కు పంపిన ఘ‌న‌త జ‌గ‌న్‌కే ద‌క్కుతుంద‌న్నారు. త‌న‌తో వైయ‌స్సార్ స‌మాధి వ‌ద్ద లోక్‌స‌భ అభ్య‌ర్దుల జాబితా విడుద‌ల చేయించిన రోజును తాను మ‌ర్చిపోలేన‌ని చెప్పుకొచ్చారు. కూలీ ప‌నుల‌కు వెళ్లే త‌మ లాంటి వారికి ఎంపీలుగా అవ‌కాశం ఇచ్చారంటూ భావోద్వేగం నియంత్రించుకోలేక క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు. ఆ స‌మ‌యంలో అక్క‌డే ఉన్న మిగిలిన ఎంపీలు భావోద్వేగానికి గుర‌య్యారు. వారికి జ‌గ‌న్ ఓదార్పు ఇస్తూ మీరు ఎంపీలుగా గెలిచిన క్ష‌ణం నుండి మీ మీద బాధ్య‌త పెరిగిందంటూ వారికి కార్యాచ‌ర‌ణ నిర్ధేశించారు.
*జగన్‌ ప్రమాణస్వీకారానికి వేదిక ఖరారు
ఈ నెల 30న ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రమాణస్వీకారోత్సవానికి అధికారులు వేదికను ఖరారు చేశారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా ఈ స్టేడియంలో 35వేల మంది గ్యాలరీల్లో కూర్చొనే అవకాశం ఉండడం, దిగువన మరో 20వేల మంది కూర్చొనే వెసులుబాటు ఉండటంతో అధికారులు ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మొత్తంగా 50వేల మందికి పైగా కూర్చొనే వెసులుబాటు ఉండటంతో ఈ మేరకు అక్కడే ప్రమాణస్వీకారోత్సవం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఎల్వీ సుబ్రమణ్యం నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయించింది. తొలుత చినఅవుటపల్లి జాతీయ రహదారికి ఆనుకొని వున్న ఓ ప్రాంతంలో ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేయాలని అధికారులు భావించినప్పటికీ.. వైఎస్‌ జగన్‌ మాత్రం విజయవాడలోనే ప్రమాణస్వీకారం చేస్తానని చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా మున్సిపల్‌ మైదానంలోకి వచ్చిన రహదారులు, ట్రాఫిక్‌ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్‌ అధికారుల్ని ఆదేశించారు. ఈ ప్రమాణస్వీకారోత్సవానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌తో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఇతర వీవీఐపీలంతా హాజరయ్యే అవకాశం ఉండటంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
* వైకాపా శాసనసభా పక్ష నేతగా జగన్‌
వైకాపా శాసనసభాపక్ష నేతగా జగన్‌ ఎన్నికయ్యారు. ఈ ఉదయం 10:31 గంటలకు ఆ పార్టీ శాసనసభా పక్ష సమావేశం తాడేపల్లిలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి వైకాపా ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. శాసనసభాపక్ష నేతగా జగన్‌మోహన్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముందుగా జగన్‌ పేరును పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ప్రతిపాదించగా..ధర్మాన ప్రసాద్‌రావు, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పార్థసారథి, రోజా, ఆళ్ల నాని తదితరులు బలపరిచారు. అనంతరం జగన్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ తీర్మాన ప్రతిని సాయంత్రం నాలుగున్నరకు హైదరాబాద్‌లో రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌కు సమర్పించనున్నారు. ఎమ్మెల్యేల బృందంతో కలిసి వెళ్లి జగన్‌ గవర్నర్‌కు ఈ ప్రతిని అందజేయనున్నారు.
*సమాజంలో ప్రశ్నించే వారు ఉండాలి: ఈటల
సమాజంలో ప్రశ్నించేవారుండాలని అప్పుడే ప్రజలు చైతన్యవంతులవుతారని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. సమాజంలో ప్రశ్నించే గొంతు ఉండకూడదనేది మంచి పద్ధతి కాదన్నారు. అందరు ఐక్యంగా ఉండి పోరాడినప్పుడే మనం అనుకున్న లక్ష్యాలను సాధించుకోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో లక్ష్యసాధన ఫౌండేషన్‌, పూలే ఫౌండేషన్‌, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావుపూలే పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
*పదవుల కోసం అర్రులు చాచలేదు- జానారెడ్డి
తెలంగాణలోని తెరాస ప్రభుత్వం ప్రజా సంక్షేమంపై దృష్టి సారించకుండా ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి ఆక్షేపించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్‌కు పోటీ చేస్తానంటే కాంగ్రెస్‌ అధిష్ఠానం టికెట్‌ ఇచ్చేదని.. కానీ, తానెప్పుడూ టికెట్ల కోసం పాకులాడలేదని తేల్చిచెప్పారు. పదవుల కోసం అర్రులు చాచలేదని స్పష్టం చేశారు. 88 అసెంబ్లీ స్థానాలు గెలిచిన తెరాస ఫిరాయింపులను ప్రోత్సహించడం సరికాదన్నారు. రాబోయే ఎన్నికల్లో తాను హుజూర్‌నగర్‌ శాసనసభ స్థానం నుంచి పోటీ చేయబోనని తెలిపారు. తాజా లోక్‌సభల్లో ప్రజలు తెరాసకు బుద్ధి చెప్పారని, ఈ ఫలితాలతోనైనా సర్కార్‌ కళ్లు తెరిచి, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు.
* జగన్‌కు జేపీ సూచనలు – వైసీపీ అధినేత జగన్‌కు లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ పలు సూచనలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జగన్‌, మోదీలకు శుభాకాంక్షలు తెలిపారు. కులాలతో సమాజ విభజన ఏపీలో స్పష్టంగా కనిపించిందని, కులాల వల్ల ఒక స్థాయి ప్రజలకు మేలు తప్ప..సామాన్యులకు తీవ్ర నష్టమేనని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో అభివృద్ధి, మౌలిక వసతుల అంశం ప్రస్తావనే లేదన్నారు. అధికార, ప్రతిపక్షపార్టీలు పంతాలు వీడి ఏపీకి న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేని పక్షంలో మనం కట్టే పన్నులనే వినియోగించుకునేలా కేంద్రాన్ని ఒప్పించాలని చెప్పారు. ఏపీకి రూ.80 వేల కోట్లు రావాల్సి ఉందని వాటిపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. విద్య, వైద్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని జగన్‌కు జయప్రకాష్ నారాయణ పలు సూచనలు చేశారు.
*16వ లోక్‌సభను రద్దు చేసిన రాష్ట్రపతి
కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే రెండోసారి ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ 16వ లోక్‌సభను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారంనాడు రద్దు చేశారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలియజేసింది.ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని మంత్రివర్గం శుక్రవారం సమావేశమై 16వ లోక్‌సభ రద్దు చేయాలంటూ చేసిన సిఫార్సుకు రాష్ట్రపతి ఇవాళ ఆమోదం తెలిపినట్టు ఆ ప్రకటన తెలిపింది. కాగా, ఇవాళ ఉదయం ప్రధాన ఎన్నికల అధికారి సునీల్ అరోరా.. తన సహచర ఎన్నికల కమిషనర్లు అశోక్ లవాసా, సుశీల్ చంద్రతో కలిసి రాష్ట్రపతిని కలుసుకున్నారు. 17వ లోక్‌సభకు ఎన్నికైన పార్లమెంటు సభ్యుల జాబితాను రామ్‌నాథ్ కోవింద్‌కు వారు అందజేశారు.
*28న గుంటూరు కార్యాలయానికి చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఈనెల 28న గుంటూరు రానున్నారు. గుంటూరులోని తెదేపా కార్యాలయంలో జరిగే ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొంటారు. కార్యాలయం ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళి అర్పించిన తర్వాత పార్టీ నేతలతో సమావేశమవుతారు.
సాధారణంగా ప్రతి ఏటా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సారి ఎన్నికల ఫలితాలకు ముందే మహానాడు నిర్వహణపై తెదేపా చర్చించింది. ఎన్నికల ఫలితాల విడుదల హడావుడి ఉంటుంది కాబట్టి జులైలో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే మహానాడుతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ జయంతిని మాత్రం ఈ నెల 28న యథావిధిగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఆ మేరకు ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాన్ని గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. దీనికి చంద్రబాబు నాయుడు హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
*జగన్ కు స్థాలిన్ శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించిన వైకాపా అధినేత జగన్ కు డీఎంకే అద్యక్షుడు స్థాలిన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్విట్ చేశారు. లోక్ సభ, శాసన సభ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించిన మిత్రుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టనున్న వై.ఎస్.జగన్ కు శుభాకాంక్షలు అని అందులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ను దక్షిణ భారత దేశంలోనే ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూన్నట్లు తెలిపారు. అలాగే ఓడిశా ముఖ్యమంత్రిగా ఐదోసారి ఎన్నికైన నవీన్ పట్నాయక్ కు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు మరి ట్విట్ చేశారు.
* ఆమె గెలుపు
ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఎన్నికలు… ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తూ మనకు ప్రపంచవ్యాప్తంగా ప్రతిసారీ గుర్తింపును తెస్తూనే ఉన్నాయి. తరచి చూస్తే అంతంత మాత్రంగా కనిపించే మహిళా ప్రాతినిధ్యం మాత్రం ఉసూరుమనిపిస్తుంది. ప్రధాన పక్షాలు సహా అందరూ అభ్యర్థుల ఎంపిక నుంచే మహిళలకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఈసారీ అదే తీరు. 175 అసెంబ్లీ స్థానాలకు రాజకీయ పక్షాల అభ్యర్థులు, స్వతంత్రులు కలుపుకొని 194 మంది బరిలో నిలిచారు. వైకాపా తరఫున 13 మంది, తెదేపా తరఫున ఒకరు విజయం సాధించారు. 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో నలుగురు మహిళలు జయకేతనం ఎగురవేయగా, వీరంతా వైకాపా అభ్యర్థులు కావడం విశేషం.
*కాపులకు మంత్రి వర్గంలో స్థానం కల్పించాలి
దివంగత వై.ఎస్.రాజసేఖరరెడ్డి కాపులకు ప్రాధాన్యమిచ్చిన విధంగా త్వరలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న జగన్ కూడా మంత్రివర్గంలో కాపులకు స్థానం కల్పించాలని ఐక్య కాపునాడు రాష్ట్ర అద్యక్షుడు బేతు రామమోహనరావు కోరారు. మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందిన వల్లభనేని బాలశౌరిని శుక్రవారం వైకాపా కార్యాలయంలో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపు కార్పోరేషన్ కు ఎక్కువ నిధులు కేటాయించి కాపుల సంక్షెమానికి ప్రభుత్వం కృషి చేయాలనీ కోరారు. మచిలీపట్నం ఎమ్మెల్యే పెర్నీ వెంకట్రామయ్య, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రీ రమేష్, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, జగ్గయపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తదితర కాపు ప్రజాప్రతినిధులుకు ఐక్య కాపునాడు తరపున అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులూ దాసరి కిరణ్ కుమార్ హనుమకొండ కృష్ణ విన్నకోట సురేష్ తదితరులు పాల్గొన్నారు.
* కుమార’ పాలనకు కుదుపు
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా కాంగ్రెస్‌-జనతాదళ్‌ ఈ ఎన్నికల్లో ఓటమిని చవిచూశాయి. కలిసి పోటీ చేసినా కేవలం ఒక్కొక్క స్థానానికే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరుపక్షాల నాయకులు శుక్రవారం సుదీర్ఘ సమావేశాలతో తలమునకలయ్యారు. ఓటమికి కారణాలపై విశ్లేషించుకున్నారు. ముఖ్యమంత్రి కుమారస్వామి, సమన్వయ సమితి అధ్యక్షుడు సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు దినేశ్‌ గుండూరావుతో పాటు మంత్రులతోనూ ముఖ్యమంత్రి వేర్వేరుగా సమావేశమయ్యారు.
*నన్ను క్షమించండమ్మా: మాజీ ఎమ్మెల్యే
కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడి పోయిన బోడె ప్రసాద్‌ తనకు ఓటు వేసిన వారికీ, వేయని వారికి కృతజ్ఞతలు తెలిపారు. శనివారం పెనమలూరు, కంకిపాడు కాలువ కట్టలపై ఒంటరిగా బులెట్‌ను నడుపుకొంటూ పర్యటించారు. ఈ సందర్భంగా మార్గం మధ్యంలో ప్రతి ఇంటికీ వద్ద ఆగుతూ, కనపడిన వారిని పలకరిస్తూ ముందుకు సాగారు. ‘ఓటు వేసినందుకు కృతజ్ఞతలు. నేను ఏ తప్పూ చేయలేదమ్మా.. ఏదైనా తప్పు చేసుంటే క్షమించండి’ అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేసుకుంటూ వెళ్లారు.
*రేపు అమ్మ దగ్గరకు.. ఎల్లుండి వారణాసికి
దేశ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టే ముందు నరేంద్రమోదీ తన తల్లి హీరాబెన్‌ ఆశీర్వాదం తీసుకోనున్నారు. ఈ విషయాన్ని మోదీ స్వయంగా తెలిపారు. అంతేగాక.. తనను రెండోసారి గెలిపించిన వారణాసి ప్రజలను కలిసేందుకు సోమవారం అక్కడకు వెళ్తున్నానని ఆయన ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ‘మా అమ్మ ఆశీర్వాదం తీసుకునేందుకు రేపు(ఆదివారం) సాయంత్రం గుజరాత్‌ వెళ్తున్నాను. నాపై నమ్మకం ఉంచిన కాశీ పుణ్యభూమి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు సోమవారం ఉదయం వారణాసి వెళ్తాను’ అని మోదీ ట్వీట్‌ చేశారు. తాజా సార్వత్రిక ఎన్నికల్లో మోదీ మరోసారి వారణాసి నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తన సమీప ఎస్పీ అభ్యర్థి షాలినీ యాదవ్‌పై 4.7లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో మోదీ గెలుపొందారు. ఇక ఈ ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 353 సీట్లతో అఖండ విజయం సాధించింది. దీంతో మోదీ మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
*దీటైన దళపతి
సార్వత్రిక ఎన్నికల్లో ఆరోదశ ముగుస్తోందనగా భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా విలేకరులతో మాట్లాడారు. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి కావల్సిన ఆధిక్యత తమకు ఇప్పటికే వచ్చేసిందని, కేవలం భాజపాను 300 మార్కు దాటించడానికే ఏడోదశ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నామని చెప్పారు. అది చూసి అంతా నవ్వుకున్నారు. మరీ అతిశయానికి పోతున్నారని విమర్శించారు కూడా. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వాళ్లంతా ఆ రోజును గుర్తుచేసుకుని ముక్కున వేలేసుకున్నారు.
*ఆ రెండూ దక్కాల్సినవే
లోక్‌సభ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా, ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లిఉంటే మరింత మెరుగైన ఫలితాలు సాధ్యమయ్యేవని కాంగ్రెస్‌లో అంతర్మథనం ప్రారంభమైంది. గెలవగలిగిన చేవెళ్ల, జహీరాబాద్‌లను కోల్పోయామని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో భవిష్యత్‌ కార్యాచరణపై పార్టీ కసరత్తు మొదలు పెట్టింది. మూడు లోక్‌సభ స్థానాల్లో నెగ్గినా కీలక స్థానాల్లో పట్టుకోల్పోవడం తెరాస, భాజపాలు ఆధిక్యాన్ని సాధించడం వంటి పరిణామాలపై కలత చెందుతోంది. కొన్ని స్థానాల్లో ప్రత్యర్థులు సాధించిన ఓట్లకు, తమకు వచ్చిన వాటికి మధ్య తీవ్ర అంతరం ఉన్నా చాలా చోట్ల గట్టిగా ప్రయత్నించి ఉంటే మరో ఒకటి రెండు స్థానాలు నెగ్గే అవకాశం ఉండేదని నేతలు పేర్కొంటున్నారు.
*రాహుల్‌ రాజీనామా?
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ పలువురు నేతలు తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది. శనివారం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ రాజీనామాలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సమావేశంలోనే అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ రాహుల్‌ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఆయన కేరళలోని వయనాడ్‌లో గెలిచినా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీలో ఓటమిపాలయ్యారు.
*ప్రధాని రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ఆయన నేతృత్వంలోని కేంద్ర మంత్రి మండలి సభ్యులు శుక్రవారం తమ పదవులకు రాజీనామా చేశారు. వీటిని ప్రధాని మోదీ, మంత్రులు స్వయంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ని కలిసి అందజేయగా ఆయన ఆమోదం తెలిపారు. నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకూ ప్రధాన మంత్రిగా కొనసాగాలని రాష్ట్రపతి సూచించగా మోదీ అంగీకరించారని రాష్ట్రపతి భవన్‌ వర్గాలు వెల్లడించాయి.
*తొలుత జగన్‌ ఒక్కరే ప్రమాణ స్వీకారం?
రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైకాపా అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు ఆ రోజు మంత్రులెవరూ ఉండకపోవచ్చని, జూన్‌ మొదటి వారంలో 18-20మంది సభ్యులను మంత్రివర్గంలో చేర్చుకుంటారని పార్టీలోని ఉన్నతస్థాయి వర్గాల సమాచారం. కొద్ది నెలల తరువాత జరిగే విస్తరణతోనే పూర్తి స్థాయి మంత్రివర్గం ఏర్పాటవుతుందని అంటున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న వైకాపా శాసనసభ్యుల సంఖ్య భారీగా పెరుగుతోంది.
*జులై నుంచి కాళేశ్వరం నీరు
‘‘కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జులై నుంచి నీటిని ఎత్తిపోయడం ప్రారంభం అవుతుంది. రాష్ట్రంలో వర్షాలు పడకున్నా ప్రాణహిత ద్వారా గోదావరిలోకి పుష్కలంగా నీళ్లు వస్తాయి. ఈ నీటిని మేడిగడ్డ నుంచి సుందిళ్ల, అన్నారం ద్వారా మధ్య మానేరు, ఎల్లంపల్లికి అక్కడి నుంచి అటు శ్రీరాంసాగర్‌కు ఇటు మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌ వరకు నీరు పంపింగ్‌ అవుతుంది. ఇక్కడ వానలు కురవకున్నా చెరువుల ద్వారా ఆయకట్టుకు నీళ్లు అందుతాయి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు.
*కురువృద్ధులతో కృష్ణార్జునుల భేటీ
భారతీయ జనతా పార్టీ కురువృద్ధులు, పార్టీని తమ చేతులతో పెంచి పెద్ద చేసిన ఎల్‌కే ఆడ్వాణీ, మురళీమనోహర్‌ జోషీలను ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో వారిద్దరి వద్దకు వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు. శుక్రవారం ఉదయం ప్రధాని మోదీ.. అమిత్‌ షాతో కలిసి ఆడ్వాణీ నివాసానికి వెళ్లారు. ఆడ్వాణీకి పాదాభివందనం చేసిన మోదీ ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం వారిద్దరూ మురళీమనోహర్‌ జోషి ఇంటికి చేరుకున్నారు. పుష్పగుచ్ఛం అందజేసి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు పాదాభివందనం చేసిన మోదీని.. జోషి గుండెలకు హత్తుకున్నారు. ప్రధానికి మిఠాయిలు తినిపించి, ఓ స్టోల్‌ బహూకరించారు. అనంతరం జోషి మీడియాతో మాట్లాడుతూ అమిత్‌షా, మోదీ బ్రహ్మాండంగా పని చేసి పార్టీకి అత్యద్భుతమైన విజయాన్ని కట్టబెట్టారని ప్రశంసించారు.
*స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు వాయిదా
రాష్ట్రంలో ఈ నెల 27వ తేదీన నిర్వహించాల్సిన 5,817 ఎంపీటీసీ, 538 జడ్పీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు వాయిదా పడింది. స్థానిక సంస్థల ప్రత్యక్ష ఎన్నికల (ఎంపీటీసీ, జడ్పీటీసీ) ఓట్ల లెక్కింపు తేదీకి పరోక్ష ఎన్నికల (మండల, జిల్లా పరిషత్‌ ఛైర్మన్లు)కు మధ్య 40 రోజుల సమయం ఉందని, ఈ లోగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రమాదం ఉంటుందని రాజకీయ పార్టీలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి.
*తెరాసకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే
రాష్ట్రంలో తెరాసను గద్దెదించేది కాంగ్రెస్‌ మాత్రమేనని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. తెరాసకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మిగిలిన పార్టీలకంటే క్షేత్ర స్థాయిలో తమపార్టీనే బలంగా ఉందన్నారు.
*ఇకపై సర్వేలకు దూరం: లగడపాటి
ఎన్నికల ఫలితాల సర్వేలకు ఇక నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ తెలిపారు. ప్రజల నాడి పసిగట్టడంలో విఫలమైనందుకు చింతిస్తున్నానని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో తాను ప్రకటించిన ఫలితాలు విఫలమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. వాటివల్ల ఎవరైనా నొచ్చుకుని ఉంటే మన్నించాలని కోరుతున్నానన్నారు
*మూడు ఎమ్మెల్సీ స్థానాలూ మనవే కావాలి
ఈ నెలాఖరున (31న) జరగనున్న వరంగల్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలను తెరాస కచ్చితంగా గెలవాలని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు దీని కోసం పట్టుదలతో కృషి చేయాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పనిచేయాలన్నారు.
*విశాఖ ఉత్తరం నుంచి ‘గంటా’ విజయం
విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థి గంటా శ్రీనివాసరావు విజయం సాధించినట్లు శుక్రవారం మధ్యాహ్నం ఎన్నికల అధికారులు ప్రకటించారు. గురువారం రాత్రి ఓట్ల లెక్కింపులో ఆఖరి రౌండ్‌లో కొన్ని ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఫలితాన్ని ప్రకటించకుండా నిలిపివేసిన విషయం తెలిసిందే.
*శ్రీకాకుళం విజేత రామ్మోహన్‌నాయుడు
ఉత్కంఠ భరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో శ్రీకాకుళం లోక్‌సభ సభ్యుడిగా తెదేపా అభ్యర్థి, సిట్టింగ్‌ ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు గెలుపొందారు. సమీప ప్రత్యర్థి, వైకాపా అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌పై 6,658 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించినట్లు జిల్లా కలెక్టర్‌, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి జె.నివాస్‌ శుక్రవారం తెల్లవారుజామున 5.50 గంటలకు ప్రకటించారు. రామ్మోహన్‌నాయుడికి 5,34,537 ఓట్లు, దువ్వాడ శ్రీనివాస్‌కు 5,27,879ఓట్లు లభించాయి.
*యంత పోకడలను అడ్డుకున్న ప్రజలు- కుంతియా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంత పోకడలను రాష్ట్ర ప్రజలు అడ్డుకున్నారని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు రామచంద్ర కుంతియా పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సంతృప్తికరమైన పోటీ ఇచ్చిందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు కుంతియా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 16 ఎంపీ స్థానాలు గెలుస్తామన్న సీఎం కేసీఆర్‌ను సింగిల్‌ డిజిట్‌ దగ్గర ఆపి తెలంగాణ ప్రజలు తగిన సమాధానం చెప్పారన్నారు. ఇప్పటికైనా కేసీఆర్‌ ప్రజాస్వామ్య వాదిలా పని చేయాలని కుంతియా సూచించారు.
*కుల, మత, ధన రాజకీయాలతో పోటీ పడలేకున్నాం- నారాయణ
దేశంలో కుల, మత, ధన రాజకీయాలు ఎక్కువయ్యాయని, వాటితో పోటీపడలేక పోతున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. శుక్రవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకప్పుడు 60 స్థానాలున్న పార్టీ ఇప్పుడు నాలుగు స్థానాలకు పడిపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. వామపక్ష పార్టీలు కూడా కొన్ని తప్పులు చేసిందని తెలిపారు. ఆత్మపరిశీలన చేసుకుంటామని స్పష్టం చేశారు.
*197 మంది సిటింగ్‌లు మళ్లీ గెలిచారు
పదిహేడవ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో 197 మంది సిటింగ్‌ పార్లమెంటు సభ్యులు తిరిగి ఎంపీలుగా ఎన్నికయ్యారు. వీరిలో 27 మంది మహిళా ఎంపీలు కూడా ఉన్నారు. భాజపా నుంచి గెలిచిన 145 మంది సిటింగ్‌ ఎంపీల్లో కిరణ్‌ రిజిజు, జుయెల్‌ ఓరం, రాజా మోహన్‌సింగ్‌, నితిన్‌ గడ్కరీ, బాబుల్‌ సుప్రియో తదితరులున్నారు. బిహార్‌లో 12 మంది భాజపా సిటింగ్‌ ఎంపీలు మళ్లీ గెలవగా, కాంగ్రెస్‌ నుంచి సౌపాల్‌ ఎంపీ ఓటమి పాలయ్యారు. భాజపా నుంచి కాంగ్రెస్‌లో చేరిన సిటింగ్‌ ఎంపీ శతృఘ్నసిన్హా కూడా పట్నాసాహిబ్‌ స్థానంలో పరాజయం పాలయ్యారు. జేడీయూ నుంచి పోటీ చేసిన ఇద్దరు, ఎల్‌జేపీ నుంచి బరిలో దిగిన ముగ్గురు సిటింగ్‌లు గెలుపుబాట పట్టారు.
*భాజపా, కాంగ్రెస్‌లకు డిపాజిట్లు గల్లంతు
రాష్ట్ర శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీల అభ్యర్థులకు ఎక్కడా డిపాజిట్లు కూడా దక్కలేదు. అలాగే జనసేనతో కలిసి పోటీ చేసిన బీఎస్పీ, వామపక్షాలకూ ఇదే పరిస్థితి. తెదేపా మాత్రం ఒక్క అరకు శాసనసభ స్థానంలో డిపాజిట్‌ కోల్పోయింది. అరకులో తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌కి కేవలం 19,929 ఓట్లు మాత్రమే వచ్చాయి. వైకాపా ఓడిపోయిన 23 శాసనసభ, మూడు లోక్‌సభ స్థానాల్లో గణనీయ సంఖ్యలోనే ఓట్లు సాధించింది. జనసేన పోటీ చేసిన వాటిల్లో 15 శాసనసభ, మూడు లోక్‌సభ స్థానాల్లో డిపాజిట్లను దక్కించుకుంది.
*జూన్‌ మొదటివారంలో జనసేన సమీక్షలు
సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఓటమికి సంబంధించి జూన్‌ మొదటి వారంలో సమీక్షలు నిర్వహించనున్నట్లు పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ వెల్లడించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన కొందరు జనసేన నేతలు, ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులతో ఓటమిపై కొద్దిసేపు సమీక్షించారు. ప్రస్తుతం వచ్చిన ఫలితాలతో జనసేన శ్రేణులు నిరుత్సాహ పడకుండా చూడాలని పవన్‌ వారికి సూచించారు.