మనలో చాలా మంది భోజనం చేసిన వెంటనే అధికంగా నీరు తాగుతుంటారు. ఇక కొందరు స్మోకింగ్ చేస్తారు. మరికొందరు శీతల పానీయాలు, పండ్ల రసాలు తాగుతుంటారు. ఇలా అనేక మంది భోజనం చేశాక అనేక విధాలైన పనులు చేస్తుంటారు. అయితే నిజానికి మనం భోజనం చేశాక చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవేమిటో, వాటి వల్ల మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. భోజనం చేశాక ఎట్టి పరిస్థితిలోనూ స్మోకింగ్ చేయరాదు. చేస్తే పొగాకులో ఉండే నికోటిన్ మన శరీరంలో జరిగే జీర్ణ క్రియను అడ్డుకుంటుంది. అలాగే శరీరం క్యాన్సర్ కణాలను గ్రహించి క్యాన్సర్ వచ్చేలా చేస్తుంది. కనుక భోజనం చేశాక పొగ తాగరాదు.
2. భోజనం చేసిన వెంటనే స్నానం కూడా చేయరాదు. చేస్తే జీర్ణ ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీంతోపాటు గ్యాస్, అసిడిటీ వస్తాయి. అయితే భోజనం చేశాక స్నానం చేద్దామనుకుంటే కనీసం 40 నిమిషాల వరకు అయినా ఆగితే మంచిది. దీంతో ఆరోగ్యంపై అంత ప్రభావం పడకుండా ఉంటుంది.
3. చాలా మంది భోజనం చేసిన వెంటనే పలు రకాల పండ్లను తీసుకుంటుంటారు. కానీ అలా చేయరాదు. ఎందుకంటే మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా గ్రహించాలంటే పండ్లను తినరాదు. అయితే పండ్లను తినాలంటే భోజనం చేశాక కనీసం 60 నిమిషాల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. అలా పండ్లను తింటే ఏమీ కాదు.
4. భోజనం చేశాక గ్రీన్ టీ తాగరాదు. తాగితే శరీరం మనం తిన్న ఆహారంలో ఉండే ఐరన్‌ను సరిగ్గా గ్రహించలేదు. కనుక భోజనం చేశాక గ్రీన్ టీ కూడా తాగకూడదు.
5. భోజనం చేసిన వెంటనే వ్యాయామం చేయరాదు. టీ, కాఫీలు తాగరాదు. అలాగే ఎక్కువ సేపు కూడా కూర్చోరాదు. కొంత సేపు అటు, ఇటు నడవాలి. అలాగే తిన్న వెంటనే నిద్రించరాదు. గ్యాస్ వస్తుంది. అధికంగా బరువు పెరుగుతారు.