ఏదైనా చిన్న అనారోగ్య సమస్య వస్తే.. దగ్గర్లోని మందుల షాపుకు వెళ్లడం.. మందులను కొనుగోలు చేసి బిళ్లలను మింగడం.. ప్రస్తుతం అనేక మంది చేస్తున్న పని ఇదే. డాక్టర్ వద్దకు వెళ్లకుండా సొంత చికిత్స చేసుకునే వారే ప్రస్తుతం ఎక్కువైపోయారు. కానీ తమ తమ ఇంటి పెరళ్లు, పరిసరాల్లో ఉండే మొక్కలే తమకు వచ్చే అనారోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతాయని ఎవరూ తెలుసుకోవడం లేదు. సైంటిస్టులే ఆ విషయాన్ని చెప్పాల్సి వస్తున్నది. ఈ క్రమంలోనే మన ఇంటి పెరట్లో ఎక్కువగా పెరిగే మునగ చెట్టు మహత్మ్యం కూడా ఇంకా ఎవరికీ తెలియదు. కానీ సైంటిస్టులు మాత్రం ఈ చెట్టును మిరాక్యులస్ ట్రీ (మహత్తు ఉన్న చెట్టు) అని నిర్దారించారు. బెంగళూరులోని జాతీయ బయోలాజికల్ పరిశోధన సంస్థ సైంటిస్టులు కేంద్ర బయోటెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మునగ చెట్టుకు చెందిన 36 రకాల జన్యువులపై పరిశోధనలు చేశారు. వారు బెంగళూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయం గాంధీ కృషి విజ్ఞాన కేంద్రం ఆవరణలో ఉన్న ఒక మునగ చెట్టు నుంచి వివిధ భాగాలు సేకరించి పరిశోధనలు చేశారు. మునగ చెట్టుకు చెందిన ఆకులు, కాయలు, వేర్లు, పూలు.. ఇలా అన్ని భాగాలను పరిశీలించారు. వాటిపై ప్రయోగాలు చేశారు. ఈ క్రమంలో వారు చెబుతున్నదేమిటంటే.. మునగ చెట్టుకు చెందిన అన్ని భాగాలు మనకు కలిగే అనారోగ్య సమస్యలను నయం చేసేందుకు పనికొస్తాయని, ఆ మాటకొస్తే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను కూడా మునగ చెట్టు భాగాలతో నయం చేయవచ్చని తేల్చారు.
* మన ఇండ్లలో వండుకునే పాలకూరలో ఉండే ఐరన్ కన్నా మునగ ఆకులలో ఐరన్ 30 శాతం ఎక్కువగా ఉంటుందని సైంటిస్టులు తేల్చారు. అలాగే పాలకూరలో ఉండే కాల్షియం కన్నా మునగ ఆకులో ఉండే కాల్షియం 100 రెట్లు ఎక్కువగా ఉంటుందట.
* మునగ చెట్టు ఆకులు, పూలు, కాయల్లో ఐరన్, జింక్, మెగ్నిషియంలు పుష్కలంగా ఉంటాయని కూడా సైంటిస్టులు చెబుతున్నారు. ఇవి మనం ప్రస్తుతం తింటున్న తెల్ల అన్నంలో లోపిస్తున్నాయని, అందుకనే మనకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు.
* మనిషి ఎదుగుదలకు అవసరం అయ్యే ముఖ్యమైన పోషకాలు మునగ ఆకులు, పూలలో ఉన్నాయని సైంటిస్టులు గుర్తించారు. అలాగే విటమిన్ సి కూడా మునగ ఆకులు, పూల ద్వారా బాగా లభిస్తుందని వారు చెబుతున్నారు.
* మునగ పూలలో కేఎం ఫెరోల్ అనబడే క్యాన్సర్ నిరోధక ఏజెంట్ ఉంటుంది. ఇది క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. అలాగే మునగ చెట్టు వేర్లలో ఉర్సోలిక్, ఓడియానోలిక్ అనే ఆమ్లాలు ఉంటాయి. ఇవి సంతాన లేమి, క్యాన్సర్ కు మందులుగా పనిచేస్తాయి.
* మునగ ఆకులతో నీటిని శుద్ధి చేసుకోవచ్చని, అలాగే నూనెలను కూడా శుద్ధి చేసుకోవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు.