పెళ్లికూతురు మెడలో వరుడి బదులు అతడి చెల్లెలు తాళి కట్టి పెళ్లి చేసుకుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. గుజరాత్‌లోని కొన్ని గిరిజన గ్రామాల్లో ఇప్పటికీ ఇది ఓ సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ ఆచారం ప్రకారం.. వరుడు తన పెళ్లిలో కనిపించడు. అతడి బదులు అతడి చెల్లెలు లేదా ఆ కుటుంబం నుంచి మరెవరైనా మహిళ పెళ్లికుమారుడి మాదిరిగా ప్రాతినిధ్యం వహిస్తారు. వరుడు తన తల్లితో కలిసి ఇంటి వద్దే ఉండగా.. అతడి చెల్లెలు వధువు ఇంటి గుమ్మం వద్దకు వెళ్లి ఆమెను పెళ్లాడి తిరిగి ఇంటికి తీసుకొస్తుంది. ‘‘ఈ పెళ్లిలో వరుడు చేయాల్సిన అన్ని కార్యక్రమాలు అతడి చెల్లి చేస్తుంది. వరుడి బదులు పెళ్లి తంతు మొత్తం ఆమే చూసుకుంటుంది. ఇక్కడి మూడు గ్రామాల్లో ఈ ఆచారం కొనసాగుతోంది. ఇలా చేసుకోకుంటే కీడు జరుగుతుందని మా నమ్మకం. ఈ ఆచారాన్ని అతిక్రమించిన వాళ్లు కొన్నాళ్లకు విడిపోవడమో లేదా కుటుంబ కలహాలు రావడమో జరుగుతుంది. కొన్నిసార్లు ఇతర సమస్యలు కూడా రావొచ్చు…’’ అని సుర్కేడా గ్రామ పెద్ద కాంజిభాయ్ రత్వా వెల్లడించారు.
వరుడి బదులు సోదరి తాళి కట్టేసింది
Related tags :