Politics

ప్రజలు కాదు సానుభూతి గెలిపించింది

AP TDLP Meeting Concludes Jagans Victory Was Due To Sympathy

తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన చంద్రబాబు నాయుడు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు సభలో అనుసరించాల్సిన వ్యూహం, భవిష్యత్‌ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..‘‘ ప్రజల కోపం వల్ల మనం ఓటమి చెందలేదు. జగన్‌ పట్ల ఉన్న సానుభూతే ఆ పార్టీని గెలిపించింది. రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు చిత్తశుద్ధితో పని చేశాం. కాలంతో పరిగెత్తాం, అనేక పనులు చేశాం. సమర్ధ నీటినిర్వహణతో నీటి కొరతను అధిగమించాం’’.‘‘ రాజధాని నిర్మాణ పనులు వేగంగా చేపట్టాం. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకున్నా చాలా చేశాం. కానీ, ప్రజల అంచనాలు వేరుగా ఉన్నాయి. అయినా 39.2శాతం ఓట్లు రాబట్టాం. ఏదేమైనా కొంతకాలం వేచి చూద్దాం. కొత్త ప్రభుత్వం ఏంచేస్తుందో చూద్దాం. అన్నింటినీ నిశితంగా గమనిద్దాం, ఆతర్వాతే స్పందిద్దాం. ఎన్నికైన ఎమ్మెల్యేల్లో ముగ్గురు మినహా అందరూ గతంలో పనిచేసినవారే. పాత, కొత్త కలబోతతో తెలుగుదేశం వాణిని బలంగా వినిపించాలి. ఆయా నియోజకవర్గాల సమస్యలను సభలో ప్రస్తావించాలి. సకాలంలో పరిష్కారమయ్యేలా శ్రద్ధ వహించాలి’’ అని చంద్రబాబు సూచించారు.టీడీఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత ఎమ్మెల్యే చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ… ఉప నేతలు, విప్‌ పదవులు ఎవరికివ్వాలనే నిర్ణయాన్ని చంద్రబాబుకే అప్పగించామన్నారు. తక్కువ మంది సభ్యులున్నా..తాము ప్రజల తరఫున పోరాడతామన్నారు. ఎన్నికల్లో ఓటమిపై విశ్లేషణ చేసుకుంటామని చినరాజప్ప తెలిపారు.