పారామిలిటరీ, పోలీసు బలగాల్లో విధులు నిర్వర్తించే మహిళలకు త్వరలో ప్రత్యేక రక్షణ కవచాలు అందించనున్నట్లు రక్షణ శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు పురుషుల కోసం రూపొందించిన వాటినే వీరు ఉపయోగిస్తున్నారు. ‘మహిళా సిబ్బందికి అన్ని రకాలుగా సౌకర్యంగా ఉండే రక్షణ కవచం ప్రభుత్వం రూపొందిస్తోంది. దీనిపై డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్( డీఆర్డీవో) పరిశోధనలు చేస్తోందని’ జనవరిలో జరిగిన ఇండియన్ సైన్సు కాంగ్రెస్ సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ఈ పరిశోధనలను డిఫెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అల్లీడ్ సైన్స్(డిపాస్) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆ తరువాత వీటి నాణ్యతను పరీక్షిస్తూ జరిపిన ప్రయోగాలు కూడా విజయవంతం కావడంతో వీటి తయారీ విధానాన్ని పలు పరిశ్రమలకు అందించారు. దేశవ్యాప్తంగా పనిచేస్తోన్న మహిళా సిబ్బందికి త్వరలోనే వీటిని అందించనున్నారు. సిబ్బందికి సౌకర్యంగా ఉండి, శరీరానికి రక్షణ కల్పించేలా వీటిని రూపొందించారు. వీటిని ‘ఫుల్ బాడీ ప్రొటెక్టర్(ఎఫ్‌బీపీ)’ పేరుతో పిలవనున్నారు. ర్యాలీలు, ధర్నాల సమయంలో ఘర్షణలు చోటుచేసుకున్నప్పుడు ఇవి సిబ్బందికి పూర్తి రక్షణ కల్పిస్తాయి. మహిళా సైనికులు, పోలీసులు చట్టవ్యతిరేక కార్యకలాపాలు చోటు చేసుకున్నప్పుడు శాంతిభద్రతలు పరిరక్షించడానికి ఎటువంటి బెరుకు లేకుండా ముందుకు సాగి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించవచ్చు. ఆమ్లదాడులు, మారణాయుధాలతో దాడి చేసినా ఎఫ్‌బీపీలు తట్టుకుని రక్షణ కల్పిస్తాయి. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని దీనిని రూపొందించారు. దీని ముందు, వెనుక భాగాల్లో షీల్డ్స్, భుజాల వద్ద ప్యాడ్లు, నడుము పైభాగం, కింది భాగంలో ఆర్మ్‌గార్డులు అమర్చారు. మోచిప్పలు, కాళ్ల భాగాలను కాపాడటానికి ప్యాడ్లు ఉంటాయి. దీనిపై ఆయుధాలు కూడా ధరించొచ్చు. ఈ కవచానికి మంటలను తట్టుకునే సామర్థ్యం కూడా ఉంది. కత్తిపోట్ల నుంచి కూడా రక్షణ అందిస్తుందీ కవచం.
సైన్యానికి కూడా ఫ్యాషన్ ఉంది
Related tags :