భూయో వినయమాస్థాయ భవనిత్యం జితేంద్రియః
కామక్రోధ సముత్థాని త్యజేథా వ్యసనానిచ
శ్రీరామ చంద్రమూర్తిని రాజ్యాభిషిక్తుణ్ణి చెయ్యాలన్న సంకల్పంతో దశరథమహారాజు శ్రీరామునికి పలు ధర్మాలను బోధిస్తూ చెప్పిన మాటలివి. ‘‘నాయనా! ఇంకనూ వినయవంతునివి కమ్ము, ఎల్లప్పుడూ జితేంద్రియుడవై మెలగుము, కామం వల్లగాని, క్రోధం వల్లగానీ కలుగు వ్యసనాలను త్యజించాలి’’ అని దీని అర్థం. ఏ మనిషీ వ్యసనాలకు లోను కాకూడదు. ముఖ్యంగా ప్రజాపాలన చేపట్టేవారు వ్యసనపరులైతే.. వ్యక్తిగతంగా వారు మాత్రమేగాక, వారి ఏలుబడిలో ఉన్న సమస్థ ప్రజానీకమూ తీవ్రమైన కష్టనష్టాలకు లోనవుతారన్నది దృష్టిలో పెట్టుకునే వాల్మీకి మహర్షి ఈ మాటలను దశరథ మహారాజు ముఖతః వెలిబుచ్చారు. ఇవి కేవలం పరిపాలకుని మాత్రమే దృష్టిలో పెట్టుకొని చెప్పిన మాటలు కాదు. అందరికీ వర్తిస్తాయి. ఏ మనిషైనా వ్యసనాలకు దూరంగా ఉంటేనే తనకు క్షేమం సిద్ధిస్తుంది. తాను జీవిస్తున్న సమాజానికి క్షేమం కలుగుతుంది. వ్యసనాలకు బానిస కావడం చాలా సులువే, కానీ వాటి నుండి బయటపడటం, తనను తాను రక్షించుకోవడం మాత్రం అంత తేలిక కాదు. రాజుల విషయంలో ‘‘స్ర్తీ, ద్యూత, మృగయా, మద్య, వాక్పారుష్య, ఉగ్రదండత, అర్థసందూషణ’’ మనే సప్తవ్యసనాలని గురించి చెప్పి ప్రతి పరిపాలకుడూ వాటి నుండి దూరంగా ఉండాలన్నారు. దశరథ మహారాజు రామునికి చెప్పిన మాటలలో కామక్రోధాలవల్ల కలిగే వ్యసనాలకు దూరంగా ఉండమని చెప్పడంలో చాలా అర్థముంది. ఎందుకంటే.. కామం కారణంగా పది వ్యసనాలు కలుగుతాయని శాస్త్రాలు చెప్పాయి. అవేంటంటే..
‘‘మృగయాక్షో దివాస్వాపః పరివాదః స్ర్తియోమదః
తౌర్యత్రికం వృథాట్యాచ కామజో దశకోగుణః’’
వేట, జూదము, పగటినిద్ర, ఇతరులపై నిందలువేయడం, స్త్రీ లౌల్యం, గర్వించడం నృత్య, గీత, వాద్యాల్లో శ్రుతిమించిన ఆసక్తి, వ్యర్థంగా తిరగడం అనే ఈ పదివ్యసనాలూ మానవ పతనానికి మార్గాలు. ఇవి కామం వల్ల కలిగే వ్యసనాలు. ఇటువంటి వ్యసనాలకు దూరంగా ఉండాలన్నదే మహర్షి మాట. ఇక క్రోధం వల్ల కలిగే వ్యసనాలు ఏంటంటే..
పైశున్యం సాహసం ద్రోహః ఈక్ష్యాసూయార్థ దూషణమ్
వాగ్దండ యోశ్చ పారుష్యం క్రోధజోపి గుణోష్టకమ్
చాడీలు చెప్పడం, నిష్కారణంగా సజ్జనులను బాధించడం, ఎదుటివారిలోని గుణాలను కూడా దోషాలుగా చెప్పడం, సంపదను వృథా చెయ్యడం, పరుషంగా మాట్లాడటం, దండించడం. కేవలం కామంవల్ల, క్రోధం వల్ల కలిగే వ్యసనాలను వదలిపెట్టాలన్న దశరథుని పలుకుల వెనుక ఈ పద్దెనిమిది వ్యసనాలకూ దూరంగా ఉండాలన్న సూచన ఉంది. మానవ జీవితం ఆదర్శవంతంగా ఉండాలన్నా, సుఖవంతంగా ఉండాలన్నా మనిషి తప్పనిసరిగా ఇటువంటి వ్యసనాలకు దూరంగా ఉంటేనే సాధ్యమన్నది సత్యం.