అమెరికాలోని అట్లాంటాలో ప్రవాస భారతీయులు 36 ఎకరాల విస్తీర్ణంలో రామాలయం నిర్మిస్తున్నారు. అక్కడి కోవెల శిఖరంపై సుదర్శన చక్రాన్ని ప్రతిష్ఠించాలని భక్తులు భావించారు. సుమారు 75 కిలోల బరువుతో పంచలోహాలతో హైదరాబాద్‌లో నిపుణులు దీన్ని వైదిక పద్ధతి ప్రకారం తయారు చేశారు. ఇందుకు రూ.2.5 లక్షల వరకు ఖర్చు అయినట్లు అంచనా. ఈ సుదర్శన చక్రాన్ని భక్తులు గురువారం భద్రాచలం తీసుకుని వచ్చి పవిత్ర గోదావరిలో ప్రోక్షణ చేశారు. చప్టా దిగువున ఉన్న శ్రీయోగానంద లక్ష్మీనరసింహా స్వామి ఆలయంలో అర్చకుడు సౌమిత్రి శ్రీనివాస్ పూజలు చేశారు. అక్కడి నుంచి భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి ప్రధాన కోవెలలో ఉంచి పూజించారు. రామాలయం సుదర్శన చక్రాన్ని చూసి అదే నమూనాగా ఈ చక్రాన్ని తయారు చేయడంతో ఆధ్యాత్మికత కొట్టొచ్చినట్లు కనిపించింది. దీన్ని త్వరలోనే విమానంలో అట్లాంటాకు పంపిస్తామని భక్తులు తెలిపారు. వైదిక పద్ధతులు తెలిసిన అర్చకుల సమక్షంలో ఇప్పటికే రామాలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయన్నారు. అట్లాంటాలో రాముడి భక్తులు విశేష సంఖ్యలో ఉన్నారని తెలిపారు.
For More Info Visit: www.jaisriram.org