తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అద్భుతమైన చిత్రాల జాబితాను తీస్తే, అందులో కచ్చితంగా ‘అన్నమయ్య’ ఉంటుంది. రాఘవేంద్రరావు దర్శకత్వ ప్రతిభకు, నాగార్జున నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక సినిమాకు మరో ప్రధాన బలం కీరవాణి సంగీతం. అన్నమాచార్య కీర్తలను సన్నివేశాలకు తగ్గట్టుగా వాడుకొని అద్భుతమైన కళాఖండంగా తీర్చిదిద్దారు. ఈ చిత్రానికి సంబంధించి కథ ఒక ఎత్తయితే, పాత్రల ఎంపిక మరో ఎత్తు. ఆ విషయంలో దర్శకేంద్రుడు నూటికి నూరు మార్కులు కొట్టేశారు. ఇందులో నాగార్జున చేసిన అన్నమయ్య పాత్ర, సుమన్ చేసిన వెంకటేశ్వరస్వామి పాత్ర రెండూ రిస్క్‌తో కూడుకొన్నవే. ఎందుకంటే అప్పట్లో ఈ సినిమా ప్రకటించగానే అందరూ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. మాస్ ఇమేజ్ ఉన్న నాగార్జున ఇలా భక్తిరస చిత్రంలో నటించగలడా? అని పెదవి విరిచారు. ఈ సినిమా కథను రాసిన రచయిత జేకే భారవి తొలుత రాఘవేంద్రరావుకు ఈ కథను వినిపించారు. కథ విన్న వెంటనే పదివేల రూపాయల కట్టను తీసుకొచ్చి, ‘ఈ సినిమా చేస్తున్నాం’ అని చెప్పారు. ఆ తర్వాత నాగార్జున సైతం కథను విని ఒకే చెప్పారు. ‘‘ఇలా ‘అన్నమయ్య’ పాత్రను చేస్తున్నా’’ అని నాగార్జున తన తండ్రి నాగేశ్వరరావు వద్ద ప్రస్తావిస్తే, ‘నువ్వు ఎన్ని సినిమాలు చేసినా, కేవలం హీరో అనిపించుకుంటావు, కానీ, ఇలాంటి సినిమా చేస్తే నటుడు అనిపించుకుంటావు’ అని అనడంతో మరో ఆలోచన లేకుండా నాగార్జున సైతం ‘అన్నమయ్య’ చేసేందుకు ఒప్పుకొన్నారు. ఇక వెంకటేశ్వరస్వామిగా ఎవరు నటించాలి? అనుకున్నప్పుడు దర్శకుడు రాఘవేంద్రరావు మదిలో మెదిలిన నటుడు సుమన్. ఇదే విషయాన్ని సుమన్ వద్ద ప్రస్తవిస్తే, తొలుత ‘నా వల్ల కాదేమో’ అన్నారట. అయితే, రాఘవేంద్రరావు ధైర్యం చెప్పడంతో ఆయనపై నమ్మకం ఉంచి వెంకటేశ్వరస్వామి పాత్రను చేయడానికి ఒప్పుకొన్నారు. సుమన్‌నే ఈ పాత్రకు ఎంపిక చేయడం వెనుక ఒక కారణం ఉంది. సుమన్ ఎత్తుగా ఉండటంతో పాటు, ఆయన ముక్కు, కళ్లు ఆ పాత్రకు సరిపోతాయని ఊహించారట రాఘవేంద్రరావు. ఆయన ఊహ కరెక్ట్ అయింది. ప్రేక్షకులు సినిమాకు కనెక్ట్ అయ్యారు. 1997 మే 22న విడుదల ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.
నాగేశ్వరరావు సలహాతో
Related tags :