Editorials

తండ్రీ కొడుకులు బానే దోచుకుని దాచుకున్నారు

Congress leader Chidambaram and Son Karthi Has Multiple Bank Accounts Abroad

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం, ఆయన కుమారుడు కార్తీలకు విదేశాల్లో ఎనిమిది బ్యాంకు ఖాతాలు ఉన్నాయని దిల్లీ కోర్టుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తెలిపింది. ఎయిర్‌సెల్‌ – మ్యాక్సిస్‌ కేసుల్లో సీబీఐ కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నట్లు ప్రత్యేక జడ్జి ఒ.పి.సైనీ దృష్టికి తీసుకువచ్చింది. సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, సీనియర్‌ అడ్వొకేట్‌ సోనియా మాథుర్‌ సహా మరో నలుగురు అడ్వొకేట్లు ఈడీ తరఫున కోర్టులో తమ వాదనలు వినిపించారు. సింగపూర్‌లోని ‘‘అడ్వాంటేజ్‌ స్ట్రాటజిక్‌ కన్సల్టింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’’ అనే కంపెనీ ద్వారా చిదంబరం, కార్తీ ప్రయోజనం పొందినట్లు దర్యాప్తులో వెల్లడైందని మెహతా, మాథుర్‌ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పనామా పత్రాల్లో పేర్కొన్న కంపెనీ నుంచి సింగపూర్‌ కంపెనీకి నిధులు ప్రవహించాయని ఆరోపించారు. ఈ కంపెనీ బ్రిటిష్‌ వర్జిన్‌ ఐల్యాండ్స్‌లో నమోదై ఉందని మెహతా అన్నారు. ఈడీ, సీబీఐ దర్యాప్తులోనే విదేశీ బ్యాంకు ఖాతాల గురించి తెలిసిందని, తండ్రీకుమారులు కావాలనే చెప్పలేదని ఆరోపించారు. దీంతో బ్యాంకు ఖాతాలపై ఆగస్టు 1లోపు ఈడీ విచారణ పూర్తి చేయాలని జడ్జి ఆదేశించారు. అప్పటివరకు చిదంబరం, కార్తీలను అరెస్టు చేయవద్దన్నారు.