Business

బెయిల్ కోసం నీరవ్ అర్జీ

Nirav Modi Pleas For Bail In UK Court

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు(పీఎన్‌బీ)ను రూ.కోట్ల మేర మోసం చేసిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ ప్రస్తుతం లండన్‌లోని ఓ జైలులో ఉంటున్న విషయం తెలిసిందే. శుక్రవారం ఆయన యూకే హైకోర్టులో బెయిల్‌ కోసం పిటిషన్‌ వేశారు. ఆయన పిటిషన్‌పై జూన్‌ 11న విచారణ జరపనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. పీఎన్‌బీ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన ఆయనను లండన్‌ పోలీసులు మార్చి 19న అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన జైలులో ఉంటున్నారు. రూ.13,500 కోట్ల కుంభకోణం కేసులో పరారీలో ఉన్న ఆయనను నగదు అక్రమ చలామణీ కేసులో అప్పగించాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గతంలో బ్రిటన్‌ను విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. కాగా, ఒకవేళ నీరవ్‌ను భారత్‌కు అప్పగిస్తే ఏ జైల్లో ఉంచుతారన్న విషయాన్ని తమకు తెలియజేయాల్సిందిగా భారత అధికారవర్గాలను గురువారం బ్రిటన్‌ కోర్టు కోరింది. ఈ విషయాన్ని తమకు 14 రోజుల్లోగా తెలపాలని సూచించింది. ఈ కేసులో తదుపరి విచారణను జూన్‌ 27కు వాయిదా వేసింది. ఆయనను గురువారం విచారణ అనంతరం తిరిగి జైలుకు తీసుకెళ్లారు. ఆయనపై చేపట్టనున్న విచారణకు సంబంధించిణ నమూనా పత్రాలను భారత అధికారులు సమర్పించారు.