ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో మరో ఏకపక్ష మ్యాచ్. పాకిస్థాన్, వెస్టిండీస్ పోరు సైతం చప్పగానే సాగింది. పాక్ నిర్దేశించిన 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విండీస్ 13.4 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి సునాయాసంగా ఛేదించింది. ఛేదనలో క్రిస్‌గేల్ (50; 34 బంతుల్లో 6×4 3×6) అద్భుత అర్ధశతకంతో చెలరేగాడు. వెన్నునొప్పి వేధిస్తున్నా భారీ సిక్సర్లు బాదేశాడు. అతడికి తోడుగా నికోలస్ పూరన్ (34*; 19 బంతుల్లో 4×4, 2×6) కళ్లు చెదిరే బౌండరీలతో అలరించాడు. అంతకు ముందు పాక్‌ను ఒషాన్ థామస్ (4/27), జాసన్ హోల్డర్ (3/42), ఆండ్రీ రసెల్ (4/2) భారీ దెబ్బకొట్టారు. స్వల్ప లక్ష్యాన్ని విండీస్ సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్ క్రిస్‌గేల్ అర్ధశతకంతో అదరగొట్టాడు. చక్కని బంతుల్ని గౌరవించిన అతడు అందివచ్చిన బంతుల్ని మాత్రం స్టాండ్స్‌లో పెట్టేశాడు. వెన్ను నొప్పి వేధిస్తున్నా గేల్ పట్టుదలగా ఆడటం గమనార్హం. మరో ఓపెనర్ షైహోప్ (11) జట్టు స్కోరు 36 వద్ద ఆమిర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. పది పరుగుల వ్యవధిలోనే ఆమిర్‌కే డారెన్ బ్రావో (0) బలయ్యాడు. అయితే నికోలస్ పూరన్ భారీ సిక్సర్లు, బౌండరీలో చెలరేగి విజయం అందించాడు. షిమ్రన్ హెట్‌మైయిర్ (7) అతడికి తోడుగా నిలిచాడు. పాక్ బౌలర్లలో మహ్మద్ ఆమిర్ 3/26 ఆకట్టుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన పాక్‌ను విండీస్ బౌలర్లు విలవిల్లాడించారు. ఒక్కరు సైతం 30 స్కోరు చేయలేదు. ఫకర్ జమాన్ (22; 16 బంతుల్లో 2×4, 1×6), బాబర్ ఆజామ్ (22; 33 బంతుల్లో 2×4) టాప్ స్కోరర్లు. జట్టు స్కోరు 17 వద్దే ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (2)ను కాట్రెల్ బోల్తా కొట్టించాడు. దూకుడుగా ఆడుతున్న ఫకర్ జమాన్, హ్యారిస్ సొహైల్‌ను పది పరుగుల తేడాతో ఆండ్రీ రసెల్ పెవిలియన్ పంపించాడు. అప్పుడు పాక్ స్కోరు 45. కాస్త నిలకడగా ఆడుతున్న బాబర్ ఆజామ్‌ను 13.1వ బంతికి థామస్ ఔట్ చేశాడు. థామస్‌తో పాటు హోల్డర్ చెలరేగడంతో పాక్ 75 నుంచి 83 పరుగుల వ్యవధిలో సర్ఫరాజ్ (8), ఇమాద్ వసీమ్ (1), షాబాద్ ఖాన్ (0), హసన్ అలీ (1) పెవిలియన్‌కు వరుస కట్టారు. విండీస్ బౌలర్ల షార్ట్‌పిచ్ బంతులకు పాక్ ఆటగాళ్లు బెంబేలెత్తారు. గతంలో ఎప్పుడూ ఆడనట్టే ప్రవర్తించారు. చివర్లో వహబ్ రియాజ్ (18) రెండు సిక్సర్లు, ఓ బౌండరీ బాదడంతో పాక్ స్కోరు 100 దాటింది. లేదంటే 85కే చాపచుట్టేలా కనిపించింది.
విండీస్ షార్ట్‌పిచ్ బంతులకు పాకిస్థాన్ విలవిల
Related tags :