DailyDose

9వ తేదీన ఏపీకు మోడీ-తాజావార్తలు–06/01

June 02 2019 - Daily Breaking News - Modi to visit Andhra On June 9th

*లోక్‌సభలో తమకు 52 మంది సభ్యులు ఉన్నారని, వారితో కలిసి భాజపాతో ప్రతి రోజూ పోరాడుతామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానని రాహుల్‌ పట్టుబట్టిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మౌనంగా ఉంటున్న రాహుల్‌ నేడు తొలిసారిగా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడారు.
*ప్రధానిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్రమోదీ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు రానున్నారు. ఈనెల 9న సాయంత్రం 4గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారని ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. భాజపా శ్రేణులు ప్రధానికి ఘనస్వాగతం పలకాలని కన్నా విజ్ఞప్తి చేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై అధికారులు సన్నద్ధమవుతున్నారు.
* రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం(ఏసీడీపీ) నిధుల మూడో వాయిదాను విడుదల చేస్తూ ఆర్థిక, ప్రణాళికశాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే మంజూరు చేసిన పనులకు సంబంధించి రూ.31.13 కోట్లను విడుదల చేశారు.
* సికింద్రాబాద్‌లోని గాంధీ వైద్యకళాశాల ఇన్‌ఛార్జి ప్రధానాచార్యులుగా న్యూరోసర్జరీ ఆచార్యులు డాక్టర్‌ జి.ప్రకాశ్‌రావును ప్రభుత్వం నియమించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ ఆదేశాలు అమలవుతాయని పేర్కొంటూ శుక్రవారం వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు.
* రాష్ట్ర ప్రభుత్వం, ఐటీశాఖ, నూతన ఆవిష్కరణల విభాగ(టీఎస్‌ఐసీ)ం ఆధ్వర్యంలో జూన్‌ 2న హైదరాబాద్‌ పీపుల్స్‌ ప్లాజాలో తెలంగాణ నూతన ఆవిష్కరణల దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. సాయంత్రం 4 నుంచి 10 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో రూపొందించిన ఆవిష్కరణలను ప్రదర్శిస్తారు.
*నెల రోజులుగా ఉగ్రరూపం దాల్చిన భానుడు కొద్దిగా చల్లబడ్డాడు. రాయలసీమ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి ఏర్పడటం, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ దాన్ని ఆనుకుని ఉన్న ఒడిశా ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో బంగాళాఖాతం నుంచి తేమ గాలులు అటువైపు ప్రయాణిస్తున్నాయి.
*ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం) భారత్‌లో నిర్వహించే సదస్సుకు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను ఆహ్వానించింది. భారత ఆర్థిక శిఖరాగ్ర సదస్సు పేరిట అక్టోబరు 3, 4 తేదీల్లో దిల్లీలో భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) భాగస్వామ్యంతో దీనిని జరుపుతున్నామని వివరిస్తూ కేటీఆర్‌కు లేఖ రాసింది.
*సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోయే జగన్‌కు అభినందనలు తెలిపేందుకు త్రిసభ్య బృందాన్ని పంపాలని బుధవారం జరిగిన తెదేపా శాసనసభాపక్ష సమావేశంలో నిర్ణయించారు. గంటా శ్రీనివాసరావు, కె.అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్‌ వెళ్లి తన అభినందన సందేశం అందజేయాలని చంద్రబాబు కోరారు. ఈ మేరకు త్రిసభ్య బృందం బుధవారం రాత్రే జగన్‌ కార్యాలయానికి సమాచారం అందించింది. గురువారం ఉదయం 11గంటల దాకా వారికి ఎలాంటి సమాధానం రాలేదు. అనంతరం చంద్రబాబు లేఖను పత్రికలకు విడుదల చేశారు.
*రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటూ నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు.
* ఇంజినీరింగ్‌, భద్రత పనుల నేపథ్యంలో 9 ప్యాసింజర్‌, మెమూ రైళ్లను దక్షిణమధ్య రైల్వే నెలరోజుల పాటు రద్దు చేసింది. మరో 3 రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి. జూన్‌ 1 నుంచి 30వరకు- కాజీపేట-అజ్ని ప్యాసింజర్‌, మణుగూరు-కాజీపేట, కాజీపేట-మణుగూరు, బొల్లారం-హైదరాబాద్‌ ప్యాసింజర్‌, ఫలక్‌నుమా-భువనగిరి, భువనగిరి-ఫలక్‌నుమా మెమూ, డోర్నకల్‌-భద్రాచలం రోడ్‌, భద్రాచలం రోడ్‌-డోర్నకల్‌ రోడ్‌ రైళ్లు రద్దయినట్లు సీపీఆర్వో రాకేశ్‌ తెలిపారు.
*మోదీ మంత్రివర్గంలో అత్యంత పిన్న వయస్కురాలు స్మృతి ఇరానీయే. ఆమె వయసు 43 ఏళ్లు. పెద్ద వయసు ఉన్నవారు రాంవిలాస్‌ పాసవాన్‌ (73). గత మంత్రివర్గంలో మంత్రుల సగటు వయసు 62 సంవత్సరాలు కాగా, ఇప్పుడు సగటు వయసు 60 ఏళ్లే. 65 ఏళ్ల పైబడ్డ సీనియర్లకు మంత్రి పదవులు ఇవ్వకపోవడం, 50 ఏళ్లలోపు ఉన్న పలువురికి స్థానం కల్పించడంతో సగటు వయసు తగ్గింది. గత మంత్రివర్గంలో అనుప్రియ పటేల్‌ (38) చిన్నవారు కాగా, ఆమె ఈ సారి గెలుపొందలేదు.
* తితిదే ఆధ్వర్యంలోని బర్డ్‌ ఆసుపత్రి డైరెక్టర్‌ పదవి నుంచి డాక్టర్‌ గుడారు జగదీష్‌ వైదొలగనున్నారని సమాచారం. ఈ మేరకు గురువారం రాత్రి విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. తితిదే ఛైర్మన్‌ పుట్టాసుధాకర్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన బోర్డు సమావేశంలో ఆయన పదవీ కాలాన్ని రెండేళ్లపాటు పొడిగించారు.
*కృష్ణా నది నీటి మట్టం స్థాయిలను తెలిపే సూచీల (గేజ్‌ పోల్స్‌)ను ఏర్పాటు చేయాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను కోరాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) నిర్ణయించింది. గురువారం బోర్డు ఛైర్మన్‌ ఆర్‌కే గుప్తా అధ్యక్షతన సభ్య కార్యదర్శి పరమేశ్వర్‌, సభ్యుడు హరికేశ్‌ మీనా, ఎస్‌ఈ మహేందర్‌, ఈఈలతో వర్షాకాల సన్నాహక సమావేశం జరిగింది.
*కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీ)ల్లో 6, 7, 8వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు సర్వశిక్షా అభియాన్‌ ప్రాజెక్టు సంచాలకులు జి.శ్రీనివాస్‌ ఓ ప్రకటనలో తెలిపారు.