ఏదో ఒక సందర్భంలో ‘అప్పట్లో అలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింద’ని గతాన్ని తలచుకొంటూ బాధపడేవాళ్లు చాలామందే. కానీ కియారా అడ్వాణీ మాత్రం అలా ఎప్పుడూ అనుకోదట. ‘‘గతాన్ని గుర్తు చేసుకోవడం నాకూ అలవాటే. జ్ఞాపకాలు నెమరేసుకోవడం ఓ గమ్మతైన అనుభూతి. కానీ అలా చేయకపోతే బాగుండేది, ఇలా చేసుండాల్సిందేమో అని మాత్రం అనుకోను. జీవితంలో ప్రతి సంఘటన, ప్రతి అనుభవం కూడా ఏదో రకమైన పాఠం నేర్పుతుందని నమ్ముతా. వ్యక్తిగా నేనిలా ఎదగడానికి కారణం కూడా ఆ పాఠాలే. అందుకే తప్పులైనా, ఒప్పులైనా అన్నీ మన మంచికే’’ అని చెప్పుకొచ్చింది. ‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ‘అర్జున్ రెడ్డి’ రీమేక్‌తోపాటు పలు చిత్రాలతో, హిందీలో బిజీగా గడుపుతోంది. నటిగా ప్రయాణం ఎలా సాగుతోందని అడిగితే… ‘‘నటుల జీవితాలు చాలా గ్లామరస్‌గా ఉంటాయని అనుకుంటారు కానీ… అందరికీ కనిపించని అంశాలు చాలానే ఉంటాయి. అందమైన దుస్తులు ధరించి అందంగా కనిపిస్తుంటాం, ప్రేక్షకుల ప్రేమని పొందుతుంటామనేది నిజమే కానీ దాని వెనక కఠోర శ్రమ, క్రమశిక్షణ, తపన ఉంటుంది. వాటి ఫలితాలే బాగుంటాయి’’ అని చెప్పింది కియారా.
గతాన్ని తలచుకొంటూ
Related tags :