Food

నేడు ప్రపంచ పాల దినోత్సవం

Lets look into the health benefits of milk on world milk day-నేడు ప్రపంచ పాల దినోత్సవం

జూన్ 1.. ప్రపంచ పాల దినోత్సవం. అన్ని దినోత్సవాల మాదిరిగానే పాలకు కూడా ఓ దినం కేటాయించడం గొప్ప విషయమే. పాలకు ఉన్న ప్రాధాన్యం దేనికీ లేదనే చెప్పొచ్చు. తల్లి కడుపు నుంచి బయటకు వచ్చిన బిడ్డకు మొదటి రుచి చూపేది పాలే. తన రక్తాన్ని పాలగా మార్చి స్తన్యాన్ని బిడ్డ నోటికి బలవంతంగా పెట్టి పసికూనకు తొలి రుచి చూపుతుంది స్త్రీమూర్తి. ఆ మాటకొస్తే దాదాపు భూమిపైకి వచ్చిన అన్ని క్షీరదాలు బిడ్డలకు తొలుతగా పట్టించేది పాలే. అమ్మ పాల మురిపాన్ని ఆస్వాదించాలే కానీ, ఎంత వర్ణించినా తక్కువే. తల్లి ప్రేమను కూడా తెల్లని పాలతో పోల్చి చెబుతుంటారు కవులు, రచయితలు. మానవులు, జంతువులే కాదు కొన్ని చెట్లకు సంబంధించిన పాలను కూడా ఇప్పటికీ పలు ప్రాంతాల్లో పిల్లలకు తాగించి రోగాలు, రుగ్మతలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అదీ పాలకున్న గొప్పతనం. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ (ఎఫ్‌ఏవో), 2001లో జూన్ 1ని ప్రపంచ పాల దినంగా ప్రకటించింది. పాలు, పాల ఉత్పత్తులపై అవగాహన పెంచడం, దైనందిన జీవితంలో పాలతో ముడిపడి ఉన్న విషయాన్ని గుర్తు చేయడం, పాలు ఉత్పత్తిని జీవనోపాధిగా చేపట్టిన జాతులకు చేదోడు వాదోడుగా చేయూత నివ్వడమే లక్ష్యంగా పాల దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు ఆరు వందల కోట్ల ప్రజలు పాల ఉత్పత్తులు, వాటికి సంబంధించిన ఇతర రంగాలపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనం సాగిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు పాల దినోత్సవాన్ని జూన్ 1న జరుపుకుంటున్నాయి. పైగా ఆయా దేశాలు అదనంగా ఇతర రోజుల్లో కూడా పాల ఉత్పత్తికి సంబంధించిన అవగాహన కల్పిస్తూ ఆ రంగానికి చేయూతనివ్వాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి.
**మూడు సంవత్సరాల ముచ్చట్లు..
2016లో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 40 దేశాలు పాల దినోత్సవాన్ని జరుపుకున్నాయి. ఆయా దేశాల్లో మారథాన్లు, కుటుంబసభ్యులంతా కలిసి పరుగులు నిర్వహించడం (ఫ్యామిలీ రన్స్), క్షేత్ర పరిశీలనలు, పాఠశాలల్లో వివిధ కార్యక్రమాలు, సెమినార్లు నిర్వహణ, క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతుల ప్రదానం చేయడం వంటివి చేసి పాలకు ఉన్న ప్రాధాన్యాన్ని ప్రజలందరికీ తెలియజేసేలా ప్రోగ్రామ్స్ నిర్వహించాయి. ప్రతీ మనిషికి తన నిత్య జీవితంలో పాలు తాగడం, వాటికి ఉన్న గొప్పతనం, పాలతో కలిగే లాభాలు వంటివి వివరించడం పనిగా పెట్టుకుని ఆయా దేశాలు తమ భాగస్వామ్యాన్ని పాల దినోత్సవంలో చూపించాయి.
**2017లో..
ప్రపంచ పాలదినోత్సవం సందర్భంగా ప్రజల్లో చైతన్యం పెరిగింది. అంతకుముందు అంటే 2016తో పోల్చితే ఈ సంవత్సరం రెట్టింపు సంఖ్యలో దేశాలు తమ భాగస్వామ్యాన్ని చాటుకున్నాయి. దాదాపు 80 దేశాల్లో పాల దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్ని జాగృతం చేసే 588 కార్యక్రమాలు జరిపారు. ఆయా దేశాల్లో నిర్వాహకులు సుమారు 400 మిలియన్ల మందికి పాల గొప్పతనం తెలిసేల మెసేజ్ చేరేలా ఈవెంట్స్ కండక్ట్ చేశారు. పాఠశాలల్లో పాలను పంపిణీ చేయడం, విద్యార్థులకు వ్యాసరచన , ఆటల పోటీలు నిర్వహించడం, కనీసంగా కూడా నోచుకోని పిల్లలకు స్వచ్ఛందంగా పాలను దానం చేసేలా ప్రేరణ ఇవ్వడం, ఫుడ్ న్యూట్రిషియన్ గురించి వివరించడం, పాలతో ముడిపడిన శక్తి సామర్థ్యాలను తెలియజేయడం, పాలతో కలిగే ప్రయోజనాల గురించి చెప్పడం చేస్తూ ఆయా దేశాలు విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించాయి.
**పాల దినంపై వివాదం..
జూన్ 1ని ఎఫ్‌ఏవో పాల దినంగా ప్రకటించి పదిహేడు సంవత్సరాలుగా కొత్తకొత్త కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, మరొకవైపు పాల విశిస్ఠతను ప్రజలకు చేరువ చేసేందుకు అన్ని దేశాలు శక్తి వంచన లేకుండా కృషి చేస్తూనే ఉన్నా 2017లో మాత్రం కొంత చేదు అనుభవం ఎదురైంది. అదే సంవత్సరం ఆగస్టు 22న వరల్డ్ ప్లాంట్ మిల్క్ డే అనే కొత్త కోణాన్ని కొన్ని సంస్థలు తెరపైకి తెచ్చాయి. ఈ క్రమంలో కాస్త గందరగోళ పరిస్థితి ఎదురైంది. పాలతో కొన్ని దుష్పరిణామాలు ఉన్నాయనే ప్రచారంతో పాల ఉత్పత్తి కేంద్రాలపై లేనిపోని ఆరోపణలు చేస్తూ కొత్తగా ఈ రోజును ప్రకటించింది.
**పాలు, పాల ఉత్పత్తులలో లభించేవి..
పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవడంతో శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పాల దినం అంటూ ఒకటి గుర్తించిన నాటి నుంచి పాలపై ప్రచారం జరగడమే కాకుండా పాలతో కలిగే ప్రయోజనాలు, పొందే విటమిన్లు, ప్రొటీన్ల గురించి కూడా తీవ్ర ప్రచారం జరిగింది. ప్రతీ ఒక్కరికీ వాటిపై అవగాహన పెరిగింది. పాలతో కేవలం ఉత్తేజంగా ఉండడం, ప్రత్యక్ష శక్తి మాత్రమే కాకుండా శరీరానికి కావాల్సిన కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఫాస్పరస్, అయోడిన్, ఐరన్, పొటాషియం, విటమిన్ ఏ, డీ, బీ12వంటి వాటితో పాటు రిబోఫ్లెవిన్, మరిన్ని ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా పుష్కలంగా అందుతాయి. అంతేకాకుండా శరీరానికి అవసరమైన అత్యవసర ఆమ్లాలు, ఆమ్ల కారక ప్రొటీన్స్ కూడా లభ్యమవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.
**భారతదేశంలో..
పాల ఉత్పత్తిలో ప్రపంచ దేశాల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. ఇండియాలో సమతుల ఆహారానికి అవసరమైన ప్రొటీన్లు, లాక్టోస్‌లు పాల నుంచి లభిస్తాయనేది నిపుణులు చెబుతున్న విషయం. దేశంలో సుమారు 65 శాతం జనాభా వ్యవసాయాన్నే వృత్తిగా ఎంచుకున్నారు. వ్యవసాయంతో పాల పరిశ్రమకు అవినాభావ సంబంధం ఉంది. ప్రతీ రైతు గేదెనైనా, గోవునైనా కుటుంబ సభ్యులుగా పరిగణించే సంప్రదాయం ఉంది. గేదెలు, గోవులే కాకుండా గొర్రెలు, మేకలు వంటివి కూడా పాల ఉత్పత్తిలో తమ వాటాను కలిగి ఉన్నాయి. ప్రపంచంలోనే ఎక్కువగా గేదె పాలను ఉత్పత్తి చేసే దేశంగా భారత్‌కు రికార్డు ఉంది. దేశంలో చాలా రకాల జీవజాతులు ఉన్నా ముఖ్యంగా 37 రకాల జంతువులు పాల ఉత్పత్తికి కేంద్రబిందువుగా మారాయి. ఏటా 146.31 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి జరుగుతుంది. మన రాష్ట్ర విషయానికి వస్తే పాలు ప్రాథమిక పరిశ్రమగా కూడా వర్థిల్లుతున్నది. చాలా మంది రైతు కుటుంబాలకు ఇది ఒక ఆర్థిక వనరుగా విరాజిల్లుతున్నది.
**ఇక 2018…
ఈ సంవత్సరంలో 72 దేశాల్లో 586 కార్యక్రమాలు నిర్వహించారు. గత ఏడాది అంటే 2017తో పోల్చితే ఈ యేడు ఇంకా క్షేత్రస్థాయికి వెళ్లేలా కార్యక్రమాలు రూపొందించి ఆచరణలో పెట్టారు. పాల గొప్పతనం, పాలతో కలిగే ప్రయోజనాలను తెలిపేందుకు రైతులు, రాజకీయ నాయకులు, డాక్టర్లు, అథ్లెట్లు, స్టార్ హోటళ్లలో పని చేసే వంటవారు, పలు కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే సిబ్బంది, ఇలా దాదాపు అన్ని వర్గాల వారిని, అన్ని సెక్టార్ల వారిని కలుపుకు పోతూ ముందుకెళ్లారు. వారివారి రంగాల్లో వారు రాణించడానికి పాల పాత్ర ఎంత ఉందనేది వారి వారి ప్రత్యక్ష అనుభవాలను సోదహరణగా వివరించారు. సోషల్ మీడియా ద్వారా 2018 మే 1 నుంచి జూన్ 2 వరకు దాదాపు 291 మిలియన్ల మందికి పాల గొప్పతనం చేరేలా ఆయా రంగాల వారు విపరీతంగా ప్రచారం కల్పించారు. ఈ సంవత్సరం కూడా పాల దినాన్ని ఘనంగా జరపడానికి ఎఫ్‌ఏవోఎన్నో ఏర్పాట్లు చేస్తున్నది. పలువురు సెలబ్రిటీలతో ప్రత్యక్ష ప్రసారం చేయడమే కాకుండా ఆయా దేశాల్లో మాల్ న్యూట్రీషియన్ వల్ల ఇబ్బంది పడుతున్న చిన్నారుల పరిస్థితిని చూపించడం, తల్లి పాలకున్న ప్రాముఖ్యాన్ని తెలియజేసేలా చేయడం, ఇక దేశ ఆర్థిక స్థితిలో పాలు, పాల ఉత్పత్తుల వాటా ఏ విధంగా ఉంటుంది, ఉండబోతోందో తెలిసేలా చేయడం వంటివి గుర్తు చేసేలా కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందించింది.