ScienceAndTech

మరో వాన్నాక్రై సిద్ధంగా ఉంది-మైక్రోసాఫ్ట్

Microsoft warns that there is another wannacry malware ready to attack

అంతర్జాతీయంగా దాదాపు పది లక్షల కంప్యూటర్ల మీద మాల్‌వేర్ దాడి చేసే ప్రమాదం పొంచి ఉందని మైక్రోసాఫ్ట్‌ హెచ్చరించినట్లు మీడియా కథనం. 2017లో ఇలాంటి తరహా మాల్‌వేర్ వాన్నాక్రై ప్రపంచ వ్యాప్తంగా కొన్ని బిలియన్‌ డాలర్ల నష్టాన్ని కలిగించిన సంగతి తెలిసిందే. తాజాగా వైరస్‌ బ్లూకీప్ నుంచి తప్పించుకోవాలంటే వెంటనే వినియోగదారులు తమ కంప్యూటర్లను అప్‌డేట్ చేసుకోవాలని కంపెనీ మరోసారి వెల్లడించింది.  ‘ఈ మాల్‌వేర్‌ను ఎదుర్కోవడానికి పరిష్కారాన్ని సిద్ధం చేసి రెండు వారాలే అవుతుంది. ఇప్పటి వరకు ఆ వైరస్‌ జాడలు కనిపించలేదు. అలాగని పూర్తిగా ముప్పు నుంచి తప్పించుకున్నట్లు కాదు’ అని మైక్రోసాఫ్ట్ ప్రతినిధి సైమన్ పోప్‌ హెచ్చరించారు. ‘దీనిపై మేం సిఫార్సు చేసేది ఒక్కటే. సాధ్యమైనంత త్వరగా సిస్టమ్స్‌ను అప్‌డేట్ చేసుకోవాలి’ అని ఆయన సూచించారు. విండోస్‌ ఎక్స్‌పీ, విండోస్‌ 7, సర్వర్‌ ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద ఈ మాల్‌వేర్ ప్రభావం అధికంగా ఉండనుంది. కార్పరేట్ సంస్థల్లో ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్‌ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఇంటర్నెట్‌తో అనుసంధానమైన కంప్యూటర్లకు మాల్‌వేర్ ప్రభావం అధికంగా ఉండనుందని మీడియా సంస్థ తెలిపింది.