తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో విజయవంతమైన కథలు అందించిన జోడీ పరుచూరి బ్రదర్స్. అంతేకాదు, ఇద్దరూ నటులుగానూ వెండితెరపై తమ ప్రతిభను చూపించారు. పరుచూరి సోదరుల్లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ ‘పరుచూరి పలుకులు’ పేరుతో యువ దర్శకులు, కథా రచయితలకు సలహాలు, సూచనలు ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన సినిమాల్లో ‘ఫ్యాక్షన్’ అంశంపై మాట్లాడారు.
‘‘ఫ్యాక్షన్ సినిమాలను చాలా మంది తీశారు. మా అన్నయ్య ఎప్పటికప్పుడు కొత్త జోనర్‌లో వెళ్లాలని ఆలోచిస్తారు. 1990లో రెండు కథలు రాశాం. ‘ప్రేమఖైదీ’, ‘కడప రెడ్డమ్మ’. మొదటి చిత్రంలో ఫ్యాక్షనిస్ట్ తండ్రి ఉంటాడు కానీ, అందులో ఆ నేపథ్యం ఉన్న కథలా అనిపించదు. ఒక డబ్బున్న వాడు.. పేదవాడి మధ్య ప్రేమ కథలా సాగిపోతుంది. ఈ రెండూ చలపతి ఎదురుగా పెడితే, ఆయన ‘ప్రేమఖైదీ’ వదిలేసి, ‘కడపరెడ్డమ్మ’ తీసుకున్నారు. అందులో మోహన్‌బాబు ఒక కులం అబ్బాయిగా.. శారద మరో కులం అమ్మాయిగా కనిపిస్తారు. ఈ సినిమా అంతగా ఆడలేదు. పరుచూరి బ్రదర్స్ కలం నుంచి వచ్చిన ఫ్యాక్షన్ కథ ‘కడపరెడ్డమ్మ’’
‘‘అయితే, ఆ తర్వాత చాలా రోజులకు ఒక సందర్భంలో పరిటాల రవిని కలిశాను. ‘‘కడపరెడ్డమ్మ’పై నేను చాలా ఆశపెట్టుకున్నా. కానీ ఆడలేదు. ఎందుకు విజయం సాధించలేదో తెలుసా’’ అని అడిగా. ‘ఈసారి మీరు కథ రాస్తే, ఒకే కులం మీద రాయండి. అమ్మాయి.. అబ్బాయి ఇద్దరూ రెడ్లు, లేదా ఇద్దరూ కమ్మవారిగా చూపించండి’ అని సలహా ఇచ్చారు. ఆ సలహాతోనే ‘సమరసింహారెడ్డి’లో హీరో, హీరోయిన్ ఇద్దరూ రెడ్డి కమ్యూనిటీకి చెందిన పాత్రలుగా చూపించాం. అదే ‘నరసింహనాయుడు’లో ఇద్దరూ నాయుడు కమ్యూనిటీ చెందిన పాత్రలే రాశాం. ఇది పరిటాల రవి ఇచ్చిన అద్భుతమైన సూచన. మా సినిమాల్లో ఎక్కడా దొంగ, రౌడీ, ఫ్యాక్షనిస్ట్ గొప్పవాళ్లని చెప్పలేదు. నేనూ, మా అన్నయ్య కలిసి తీసుకున్న ఆంతరంగిక నిర్ణయమిది. అయితే, హీరో ఎందుకు అలా మారాడన్నదానికి కారణం చెబుతాం. ‘సమరసింహారెడ్డి’ సినిమా విషయంలో చాలా చర్చలు జరిగాయి. ప్రతినాయకుడిని చంపేయడం హీరోకు కేవలం ఒక్క నిమిషం పని. కానీ, వదిలేస్తాడు. అయితే, ఆడియన్స్ నిరాశ పడకూడదని, ప్రతినాయకుడు తనకి తానే చంపుకొనేలా కథ రాశాం’’అని చెప్పుకొచ్చారు.