ఒక హోదా, అధికారంలో ఉన్నప్పుడు అందుకు తగ్గట్లుగానే మన ప్రవర్తన, వస్త్రధారణ ఉండాలి అంటోంది తమిళనాడు ప్రభుత్వం. ఇందులో భాగంగానే రాష్ట్ర సచివాలయంలో పనిచేసే ఉద్యోగులకు డ్రెస్‌కోడ్ తీసుకొచ్చింది. పురుషులు ఫార్మల్ చొక్కాలు, ఫార్మల్ ప్యాంట్లు మాత్రమే వేసుకోవాలని, మహిళా ఉద్యోగులు చీర లేదా దుపట్టాతో ఉన్న చుడిదార్, సల్వార్ కమీజ్ ధరించాలని ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ గిరిజా వైద్యనాథ్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ‘ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఆఫీస్ మర్యాదను కాపాడేందుకు ఈ డ్రెస్‌కోడ్ అందరూ అనుసరించాలి. ఇక కోర్టులు, ట్రైబ్యునల్ లేదా న్యాయ కమిటీ ముందు హాజరయ్యే పురుష ఉద్యోగులు తప్పనిసరిగా ట్రౌజర్లు, కోట్ ధరించాలి. మహిళా ఉద్యోగులైతే చీర లేదా దుపట్టాతో ఉన్న చుడిదార్ వేసుకోవాలి. తమిళ సంప్రదాయాన్ని పరిరక్షించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతి ఒక్కరూ దీన్ని అనుసరించాలి. ఫార్మల్‌గా కనిపిస్తే సచివాలయానికి వచ్చే ప్రజలు కూడా మనల్ని గౌరవిస్తారు’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇటీవల సచివాలయంలో పనిచేసే కొందరు యువ ఉద్యోగులు జీన్స్‌లు, టీషర్ట్‌లో విధులకు హాజరయ్యారు. దీనిపై కొందరు విమర్శలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తమిళ సంప్రదాయ దుస్తులైన ధోతీ ధరించవచ్చో లేదో అన్నది స్పష్టత ఇవ్వలేదు. మరి రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు కూడా ఇవే ఆదేశాలను తీసుకొస్తాయో చూడాలి.
తమిళనాడు సచివాలయ ఉద్యోగులకు ఏకరూప దుస్తులు
Related tags :