ScienceAndTech

సోషల్ మీడియా వాడి మహిళలకు వల

Kerala Man Rapes 50 Women By Blackmailing On Social Media-సోషల్ మీడియా వాడి మహిళలకు వల

సోషల్ మీడియా.. రెండువైపులా పదునున్న కత్తిలాంటింది. దానివల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో అదే రేంజ్‌లో కష్టనష్టాలు ఉన్నాయి. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన వారిని ప్రేమ పేరుతో మోసగించడం, మహిళల్నివేధించడం, బెదిరించి లోబరుచుకోవడం వంటి ఘటనలు ఈ మధ్యకాలంలో పెరిగిపోయాయి. తాజాగా ఇలాంటి ఘటన కేరళలో జరిగింది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన మహిళల్ని బ్లాక్ మెయిల్ చేస్తూ వారిపై అత్యాచారాలకు పాల్పడతున్న ఓ కీచకున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో ఆ కామాంధుడు చెప్పిన విషయాలు విని పోలీసులే అవాక్కయ్యారు. కేరళలోని ఎట్టిమనూర్ సమీపంలోని ఆరిపరబుకు చెందిన ప్రదీష్ కుమార్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవాడు. తన లైంగిక కోరికలు తీర్చుకునేందుకు ఫేస్‌బుక్‌ను వేదికగా చేసుకున్నాడు. పెళ్లైన మహిళలే టార్గెట్‌గా ఆ కీచకుడు తొలుత వారితో పరిచయం పెంచుకుని, కాస్త చనువు పెరిగాక ఫోన్ నెంబర్ తీసుకుని మాట్లాడేవాడు. మహిళల కుటుంబ వివరాలు తెలుసుకుని తన ప్లాన్ అమలు చేసేవాడు. యువతుల పేరుతో ఫేస్‌బుక్ ఐడీలు క్రియేట్ చేసి సదరు మహిళల భర్తలతో అమ్మాయిలా చాటింగ్ చేసేవాడు. ఆ ఛాట్‌ను స్క్రీన్ షాట్‌ తీసి ఆ మహిళలకు పంపి వారి భార్యభర్తల మధ్య మనస్పర్థలు సృష్టించేవాడు. భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమైన తర్వాత ప్రదీష్ సదరు మహిళల పట్ల సానుభూతి ప్రదర్శిస్తూ వారికి మరింత దగ్గరయ్యేవాడు. మహిళలకు ఓ కోడ్ చెప్పి తనతో ఛాట్ చేసే ముందు దాన్ని పంపాలని చెప్పేవాడు. అలా వారితో ఫోన్ కాల్స్, వీడియో చాట్ చేసి చనువు పెంచుకునే ప్రదీష్.. కొంతకాలానికి మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకునేవాడు. ఇలా ఇప్పటి వరకు దాదాపు 50మంది మహిళలతో ప్రదీష్ లైంగిక సంబంధాలు పెట్టుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. మహిళలతో వీడియో ఛాట్ చేసే సమయంలో ఆ కీచకుడు వాటిని రికార్డు చేసేవాడు. ఒకవేళ మహిళలు తన లైంగిక వాంఛ తీర్చేందుకు నిరాకరిస్తే మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు వారి భర్త, ఇతర కుటుంబ సభ్యులకు పంపుతానని బెదిరించేవాడు. ఓ మహిళను ఇలానే వేధించడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఆ కామాంధున్ని అరెస్ట్ చేసిన పోలీసులు అతని వద్ద నుంచి అసభ్య ఫొటోలు, వీడియోలు ఉన్న ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నాడు. 50మంది మహిళల జీవితాలతో ఆడుకున్న ఆ కామాంధుడిని కటకటాల వెనక్కి నెట్టారు.