WorldWonders

₹31కోట్ల విందుతో సేవా కార్యక్రమం

Man wins charity dinner with Warren Buffet for 31Crore INR

అపర కుబేరుడు వారెన్‌ బఫెట్‌తో ప్రైవేటు విందు చేసేందుకు నిర్వహించిన వేలంలో ఓ అజ్ఞాత వ్యక్తి భారీ స్థాయిలో 45,67,888 డాలర్లు (దాదాపు రూ.31 కోట్లు) చెల్లించేందుకు ముందుకొచ్చారు. 2012, 2016లో సమకూరిన 35,56,789 డాలర్ల రికార్డును ఇది బద్దలు కొట్టింది.దాతృత్వ కార్యక్రమాలకు నిధులు సమకూర్చేందుకు బఫెట్‌ ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది ‘ఈబే’లో ఐదు రోజుల పాటు ఆన్‌లైన్‌లో వేలం చేశారు. ఆ గడువు శుక్రవారం రాత్రితో ముగిసింది. ఈసారి వచ్చే సొమ్మును శాన్‌ఫ్రాన్సిస్కోలోని ‘గ్లైడ్‌ ఫౌండేషన్‌’ అనే స్వచ్ఛంద సంస్థకు అందిస్తారు. పేదలు, నిరాశ్రయులకు ఈ సంస్థ సేవలు అందిస్తోంది. బఫెట్‌ ఇప్పటికే 20సార్లు నిర్వహించిన వేలం ద్వారా 3.42 కోట్ల డాలర్లను ఈ సంస్థకు సమకూర్చారు. 2004లో చనిపోయిన మొదటి భార్య సుసాన్‌ ద్వారా ‘గ్లైడ్‌ ఫౌండేషన్‌’ ఆయనకు పరిచయమైంది. తాజా వేలంపై బఫెట్‌ ఆనందం వ్యక్తంచేశారని గ్లైడ్‌ సంస్థ అధ్యక్షురాలు కేరన్‌ హాన్‌రాహన్‌ పేర్కొన్నారు. తాను ఆరోగ్యంగా ఉన్నంతకాలం వేలం నిర్వహిస్తుంటానని ఆయన చెప్పినట్లు వివరించారు. ఈ ఏడాది వేలంలో ఐదుగురు బిడ్డర్లు 18 బిడ్లను దాఖలు చేశారు. నిబంధనల ప్రకారం బిడ్‌ గెల్చుకున్న విజేత, ఆయనకు సంబంధించిన ఏడుగురు మిత్రులు బఫెట్‌తో కలసి మాన్‌హటన్‌లోని స్మిత్‌ అండ్‌ వోలెన్‌స్కీ స్టీక్‌హౌస్‌లో విందుకు హాజరుకావొచ్చు. ఆ సందర్భంగా బఫెట్‌ తదుపరి పెట్టబోయే పెట్టుబడుల మినహా ఏ అంశంపైన్నైనా చర్చించవచ్చు.