విరామం లేదు. విశ్రాంతి లేదు. మూడు దశాబ్దాలుగా భారత టెన్నిస్ అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. తాజా ఫ్రెంచ్ ఓపెన్‌తో నాలుగో దశాబ్దంలోకి అడుగుపెట్టాడు. వయసు పెరుగుతున్నా ఆస్వాదించేంత వరకు ఆటకు వీడ్కోలు పలికేదే లేదంటున్నాడు. టెన్నిస్ కోర్టులో స్వేదం చిందించడం తనకో సరదా అని గెలవడమే లక్ష్యంగా ప్రతిసారీ బరిలోకి దిగుతానని శపథం చేస్తున్నాడు లియాండర్ పేస్. భారత టెన్నిస్ చరిత్రపై ఓ పుస్తకం రాస్తే అందులో సగం పేజీలు ‘పేస్’ గురించే ఉంటాయనడంలో సందేహం లేదు. ప్రపంచంలోనే మరెవరూ ఆడనంత సుదీర్ఘంగా టెన్నిస్ ఆడటం ఆశీర్వాదమే అన్నది పేస్ మాట. ఒక ప్రొఫెషనల్ క్రీడాకారుడిగా అతడు నాలుగో దశబ్దంలోకి అడుగుపెట్టాడు. అతడి ఖాతాలో 18 గ్రాండ్‌శ్లామ్ డబుల్స్ టైటిళ్లు ఉన్నాయి. దాదాపు 1000 రాకెట్లు సేకరించాడు తెలుసా! జూన్ 17న పేస్ 46వ పుట్టిన రోజు జరుపుకోనున్నాడు. ఐదో సారి ఎర్రమట్టి కోర్టులో విజేతగా నిలవాలని ఆశించాడు. కానీ పురుషుల డబుల్స్ రెండో రౌండ్లోనే దురదృష్టం కొద్దీ ఇంటిదారి పట్టాడు. ఇండియానా వెల్స్ సింగిల్స్‌లో యువ రోజర్ ఫెదరర్‌ను ఓడించి ఒలింపిక్స్‌కు ఎంపికైన పేసర్ 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో భారత్‌కు కాంస్య పతకం అందించిన సంగతి తెలిసిందే. ఆ ప్రేరణతోనే మరోసారి ఒలింపిక్స్ ఆడిన తర్వాతే ఆటకు వీడ్కోలు పలకడం గురించి ఆలోచిస్తానని అంటున్నాడు. ‘30 ఏళ్లుగా ఆడుతున్నా. ఇది సుదీర్ఘ కాలం. నేను 12 తరాలు చూశా. పీట్ సంప్రాస్, ప్యాట్ రాఫ్టర్ వంటి దిగ్గజాలను ఫ్రెంచ్ ఓపెన్‌లో చూశా. టెన్నిస్ నాకో అందమైన ప్రయాణం. ఇంత పెద్ద కెరీర్ ఉండటం అదృష్టం. నాలుగు సార్లు గెలిచిన ఫ్రెంచ్ ఓపెన్‌కు మళ్లీ రావడమంటే మాటలు కాదు’ అంటున్నాడు పేస్. ఇప్పటికే ఏడుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు. టోక్యో-2020లోనూ ఆడతానని ధీమాగా ఉన్నాడు. ‘ఒలింపిక్స్ చాలా దూరంలో ఉంది. ఇప్పటికే ఒలింపిక్స్‌లో ప్రపంచ రికార్డు సాధించా. ఆ రికార్డును మరింత పొడిగిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా! అది 15 నెలల దూరంలో ఉంది కాబట్టి ఈ మధ్యకాలంలో నేనెంతో కష్టపడాలి’ అన్నది పేస్ మాట. దిగ్గజాలతో కలిసి ఆడిన లియాండర్ పేస్‌కు అన్ని టోర్నీల్లో ఆటగాళ్ల నుంచి ప్రత్యేక గౌరవం లభిస్తుంది. ఫ్రెంచ్ ఓపెన్ లాకర్ నుంచి బయటకు వస్తున్నప్పుడూ జరిగిన ఓ సంఘటన అందుకు ఉదాహరణ. ‘నేను లాకర్ రూమ్ నుంచి బయటకు వస్తున్నప్పుడు రఫెల్ నాదల్, అతడి అంకుల్ టోనీ (కోచ్) నాకు ఎదురయ్యారు. టోనీ నా వద్దకొచ్చి ‘లియో, నీకిప్పుడు 46 కదా? అన్నాడు’ నేను అవునన్నా. ‘1989 (జూనియర్స్)లో తొలిసారి నువ్వు రొలాండ్ గారోస్‌లో ఆడావు కదా? అన్నాడు’ అవునని నా జవాబు. ‘నువ్వు తొలి సెట్ గెలవడం చూశా. గెలిచావు కదా?’ నేను అవునన్నాను. అప్పుడాయన ‘వావ్, అద్భుతం. రఫా, అతనికిప్పుడు 46 ఏళ్లు. ఇంకా ఆడుతున్నాడు. గెలుస్తున్నాడు’ అని పేస్ గర్వంగా చెబుతున్నాడు. టెన్నిస్ చరిత్రలోనే దిగ్గజమైన రఫా, మంచి శిక్షకుడైన టోనీ తన గురించి అలా చెప్పుకోవడం ఎంతో బాగుందని అన్నాడు. ఇలాంటి గౌరవం వెనక ఏళ్ల తరబడి కష్టం దాగుందని వెల్లడించాడు. కెరీర్‌లో ఎంతో మంది దిగ్గజాలతో ఆడిన పేస్ దాదాపు 1000 రాకెట్లు సేకరించాడు తెలుసా! రాడ్ లావెర్స్ రాకెట్ అతని వద్ద ఉంది. ఇంకా విజేతలైన రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్, నొవాక్ జకోవిచ్, ఆండీ ముర్రే, మార్టినా నవత్రిలోవా, సెరెనా విలియమ్స్, వీనస్ విలియమ్స్, మార్టినా హింగిస్ సహా చాలా మంది రాకెట్లు అతడి వద్ద ఉన్నాయి. పేస్ తొలిసారి సేకరించిన రాకెట్ ‘జోర్న్ బోర్గ్స్’. కాలం మారుతున్న కొద్దీ టెన్నిస్‌లో మార్పులు వస్తున్నాయి. అందుకు తగ్గట్టు తనను తాను 11, 12, 13, 14 సార్లు పునరుత్తేజుడిని చేసుకునన్నానని పేస్ చెప్పాడు. తన కన్నా 20 ఏళ్లు తక్కువ వయసున్న యువకులతో ఆడటం సులభం కాదని పేర్కొంటున్నాడు. మరి పేస్ టోక్యో-2020 ఒలింపిక్స్ ఆడి తన కోరిక నెరవేర్చుకోవాలని ఆశిద్దాం.
అలుపెరుగని భారత టెన్నిస్ వీరుడు – లియాండర్ పేస్
Related tags :