గుప్పెడంత పిట్ట… పేరు వీవర్… దీని గూడు చూస్తే అబ్బ! అనిపిస్తుంది… ఆ పనితనం చూసి ఆశ్చర్యపోవాల్సిందే… ఆ చిట్టి ముక్కు చేసే మ్యాజిక్కే దాని గూడు… ఆ కష్టం వెనుక ఓ లక్ష్యం… ఆ శ్రద్ద వెనుక ఓ రహస్యం… ఏంటబ్బా? అంటే? తెలుగులో గిజిగాడే… ఆంగ్లంలో వీవర్. ఇప్పుడిది గూడు పెట్టు కోవాలనుకుంటోంది. అల్లాటప్పాగా పెడితే సరిపోదు. చూస్తేనే ముచ్చటగా అనిపించాలి. ఎంతో అందంగా ఉండాలి. ఆడ గిజిగాడు రెక్కలు కట్టుకొచ్చి గూటిలో వాలిపోవాలి. అవి రెండూ ఆనందంగా పిల్లాపాపలతో కుటుంబాన్ని వృద్ధి చేసుకోవాలి. ఇంకా ఇరుగుపొరుగు గూళ్లకు దగ్గరగా ఉండాలి. అంతా కలిసికట్టుగా ఉంటే శత్రువుల నుంచి తమని, తమ పిల్లల్ని రక్షించుకోవడం తేలిక. అందుకని కాలనీలోనే గూడు కట్టుకోవాలి. గూడే లక్ష్యంగా గిజిగాడు పని మొదలు పెట్టింది. అందమైన గూటి కోసం ఓ తుమ్మ చెట్టు కొమ్మకు గడ్డిపోచను ముడి వేసి శంకుస్థాపన చేసింది. ముక్కుతోపాటు కాళ్లకీ పని చెప్పింది. ఎగిరెళ్లి గడ్డి తేవడం.. దాన్ని చెట్టు కొమ్మకు ముడేయడం.. చేస్తూనే ఉంది. రెండు రోజులకు దాని పునాది సిద్ధమైంది. అంటే కొమ్మకు గూడు వేలాడే హ్యాంగర్ పూర్తయ్యింది. తర్వాత ఆ హ్యాంగర్‌కు ఓ రింగును ఏర్పాటు చేసే పనిలో పడింది. గడ్డిని ఓ రింగులా చేస్తే దాని చుట్టూ అల్లికలు తేలికవుతాయి. ఇదిప్పుడు ఆ పనిలోనే నిమగ్నమైంది. కొన్ని పోచలు కింద పడిపోతున్నాయి. కొన్ని పోచలు ముడేస్తుంటే తెగిపోతున్నాయి. మరి కొన్నేమో అసలు ముడే పడటం లేదు. అయినా దాని రెక్కలకు అలసట లేదు. దాని ప్రయత్నానికి ఆపు లేదు. పట్టుదలతో చేస్తూనే ఉంది. వృత్తం పూర్తయ్యింది. ఇప్పుడు ఆ వృత్తమే దాని గూటి గుమ్మం. దాన్ని ఆసరాగా చేసుకుని చుట్టూ అందమైన డిజైను వచ్చేలా అది పోచల్ని ముడేస్తూ గోడల్ని అల్లేస్తోంది. ఎంత పెద్ద ఇంజినీరుకైనా దీని నైపుణ్యం రాదు. ఎందుకంటే ఆ నైపుణ్యమంతా దాని చిట్టి ముక్కులోనే దాగుంది. అది కాళ్ల సహాయంతో వేసే ముడుల్లోనే దాగుంది. అందుకే చుట్టూ ఇల్లుతోపాటు లోపల గదుల్నీ ఏర్పాటు చేసేస్తోంది. సగం పూర్తయ్యాక ఆ గూటిని చూట్టానికి రమ్మని ఆడ వీవర్‌ని ఆహ్వానించింది. అది రెక్కలు అల్లల్లాడిస్తూ అక్కడికొచ్చి వాలింది. అంతా తరచి చూసింది. ‘హబ్బ! భలే ఉందే’ అనుకుంది. ఆనందంగా తన సహాయం అందించింది. ఇప్పుడు రెండు ముక్కులు అల్లికల్లో మునిగిపోయాయి. ఎంతో కష్టం చేస్తే… చివరికి గూడు పూర్తయ్యింది. దాన్ని చూసి రెండూ మురిసిపోయాయి. ఆడ వీవర్ మూడంటే మూడు గుడ్లు పెట్టింది. వాటిని రెండు వారాల పాటు పొదిగితే గుడ్లు పిల్లలయ్యాయి. పెరిగి పెద్దవయ్యాయి. గూటి నుంచి ఎగిరిపోయాయి. అవి లేని గూటిలో మనమెందుకు అనుకుంటూ పెద్ద గిజిగాళ్లూ గాల్లోకి తుర్రుమన్నాయి. అంతే.
పిల్లలూ…పట్టుదలకు మారుపేరు వీవర్ పక్షి
Related tags :