Movies

స్టెరాయిడ్స్ చికిత్సలో సుస్మితా సేన్

Susmita Sen On Steroids

నటీనటులది హాపీ లైఫ్. ఒక్క సినిమా హిట్టైతే చాలు కోట్లు కోట్లు డబ్బు వచ్చి పడుతుంది. మరిన్ని ఆఫర్లు తలుపు తడుతుంటాయి. అవకాశాలు యాడ్స్ రూపంలో కూడా పలకరిస్తుంటాయి. రాత్రికి రాత్రే సెలబ్రిటీ స్టేటస్. వాటే వండర్ పుల్ జాబ్. లైఫ్‌లో ఇంతకంటే ఇంకే కావాలి అనుకుంటారు. వాళ్ల జీవితం వడ్డించిన విస్తరి అనుకుంటారు. కానీ వాళ్లూ మామూలు మనుషులే. అందరిలానే స్పందనలు ఉంటాయి. అనారోగ్యాలు వెంటాడుతుంటాయి.మాజీ మిస్ యూనివర్స్, బాలీవుడ్ నటి సుస్మితా సేన్ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కుని అనారోగ్యాన్ని అధిగమించింది. తను దతత్త తీసుకున్న ఇద్దరు పిల్లలకి అమ్మతనాన్ని పంచుతూ ఆనందంగా గడుపుతోంది. జీవితాంతం స్టెరాయిడ్స్ వాడితేనే బతుకుతావు అని చెప్పిన డాక్టర్లను సైతం ఆశ్చర్యపరుస్తూ పూర్తి ఆరోగ్యవంతురాలిగా తన బిడ్డలకు అమ్మ ప్రేమని అందిస్తోంది. ఈ విషయాలన్నీ ఓ ఇంటర్వ్యూలో వివరించింది సుస్మిత.నిర్బాక్ అనే బెంగాలీ చిత్రంలో నటిస్తున్నప్పుడు అస్వస్థతకు గురయ్యింది. డాక్టర్‌కి చూపిస్తే అడ్రినల్ గ్రంథి పనితీరు ఆగిపోయిందని చెప్పారు. దాని ప్రభావం మిగతా అవయవాలపై పడింది. ఎప్పుడూ కళ్లు తిరిగి పడిపోతుండేది. దాంతో వైద్యులు బ్రతికినంతకాలం హైడ్రోకోర్టిసోన్ అనే స్టెరాయిడ్ వాడమని చెప్పారు. రోజుకి మూడు సార్లు తీసుకోమని అన్నారు. అలా తీసుకోవడంతో బరువు పెరిగిపోయింది. జుట్టు రాలిపోయేది. అద్దంలో తనని తాను చూసుకుని చాలా భయపడిపోయేది. దీంతో మెరుగైన చికిత్స నిమిత్తం లండన్ వెళ్లింది. చికిత్స అనంతరం పూర్తి ఆరోగ్య వంతురాలిగా కోలుకుని ఇండియాకు తిరిగి వచ్చింది.అప్పటికే మొదటి పాప రెనీని దత్తత తీసుకుని పెంచుకుంటోంది. మళ్లీ 2010లో రెండో పాప అలీసాని దత్తత తీసుకుంది. ఇద్దరినీ చూసుకోవడానికి సినిమాల్లో చేయడమా, మానేయడమా అన్న ఆలోచన వచ్చినప్పుడు శ్రేయోభిలాషులంతా సినిమాల్లో నటించమని సూచించారు. వయసు మీదపడితే అవకావాలు రావన్నారు. అయినా సుస్మిత మనసు పిల్లల్ల్ని ఆయమ్మకి వదిలేసి వెళ్లడాన్ని ఇష్టపడలేకపోయింది. దాంతో సినిమాలకు పుల్‌స్టాప్ పెట్టింది. సినిమాల్లో అవకాశాలు రాకపోతే ఏదైనా వ్యాపారం కానీ మరేదైనా కానీ చేయాలనుకుంటోంది.