ScienceAndTech

WWDC2019 సమస్తం తెలుగులో

Everything from Apples WWDC2019 In Telugu

తన కొత్త ప్రోడక్టలు, ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో మార్పుల గురించి వివరించడానికి ఆపిల్‌ ఏటా వరల్డ్‌ వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌ (డబ్ల్యూడబ్ల్యూడీసీ) నిర్వహిస్తుంటుంది. ఈ ఏడాదికిగాను సోమవారం రాత్రి ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో ఐఓఎస్‌, టీవీ ఓఎస్‌, వాచ్‌ ఓఎస్‌, మ్యాక్‌ ఓఎస్‌లోకి కొత్త వెర్షన్లు, ఫీచర్లను పరిచయం చేసింది. అవేంటో చూసేద్దాం!

*** టీవీలో లైవ్‌ లిరిక్స్‌
• కుటుంబంలో ప్రతి ఒక్కరికీ ఉపయోగపడేలా మల్టీ యూజర్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. దీని వల్ల కుటుంబంలో ఏ ఇద్దరికీ ఒకే తరహాలో వీడియో రికమెండేషన్లు రావు. ఎవరు చూసే వీడియోలకు తగ్గట్టుగా ఆపిల్‌ టీవీ తర్వాత వీడియోలు సూచిస్తుంది.
• మల్టీ యూజర్‌ సపోర్టు వల్ల ఆపిల్‌ టీవీలో ఆపిల్‌ మ్యూజిక్‌లో పర్సనలైజ్డ్‌ రికమెండేషన్లు వస్తాయి. దీంతోపాటు పాటలు ప్లే అయ్యేటప్పుడు లైవ్‌ లిరిక్స్‌ కూడా కనిపిస్తాయి.
• ఆపిల్‌ టీవీకి గేమ్‌ కంట్రోలర్స్‌ సౌకర్యాన్ని తీసుకొస్తున్నారు. ఎక్స్‌బాక్స్‌, ప్లే స్టేషన్‌ గేమింగ్‌ కంట్రోలర్స్‌తో త్వరలో ఆపిల్‌ టీవీలో గేమ్స్‌ ఆడుకోవచ్చు.
• ఆపిల్‌ టీవీలో కొత్తగా సముద్రంలోపలి దృశ్యాల వాల్‌పేపర్లను తీసుకొస్తున్నారు. దీని కోసం బీబీసీలో ఆపిల్‌ టై అప్‌ అయ్యింది.

*** వాచీలో ఆప్‌స్టోర్‌
⇒ వాచ్‌ స్క్రీన్స్‌లో మార్పులు చేశారు. కొత్తగా ఐదు స్క్రీన్లను జోడించారు. ఇవి ఇప్పటివరకు వచ్చిన స్క్రీన్లలా కాకుండా పూర్తి కొత్త విధానంలో ఉంటాయి.
⇒ గతంలో వాచీల్లో ప్రతి గంటకు ఓ చిన్న అలారం మోగుతుండేది. కొత్త వాచ్‌ ఓఎస్‌లోఈ ఆప్షన్‌ తీసుకొచ్చారు. ప్రతి గంటకు వాచీ చిన్నపాటి శబ్దం చేస్తుంది. ఆ శబ్దం ఏంటనేది యూజర్‌ ఎంచుకోవచ్చు.
⇒ ఆపిల్‌ వాచీ లోకి ఆపిల్‌ బుక్స్‌, వాయిస్‌ రికార్డింగ్‌, కాలిక్యులేటర్‌ యాప్స్‌ను తీసుకొచ్చారు.
⇒ పాడ్‌కాస్ట్‌, లైవ్‌ స్పోర్ట్స్‌ లాంటి వాటి కోసం స్ట్రీమింగ్‌ ఏపీఐని ఎనేబుల్‌ చేశారు. డెవలపర్లు దీని ఆధారంగా వాచీ కోసం కొత్త యాప్స్‌ సిద్ధం చేయొచ్చు.
⇒ ఇకపై ఆపిల్‌ వాచీలోనూ ఆప్‌ స్టోర్‌ను వినియోగించొచ్చు. దీని ఆధారంగా వాచీలోనే మీకు కావాల్సిన ఆపిల్‌ యాప్స్‌ను సెర్చ్‌ చేసి ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు.
⇒ ఆపిల్‌ వాచీలో హెల్త్‌, ఫిట్‌నెస్‌ ఆప్షన్లను పెంచారు. మీ ఫిట్‌నెస్‌ యాక్టివిటీని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ట్రెండ్స్‌ ఆప్షన్‌ తీసుకొచ్చారు. దీని ఆధారంగా నిర్ణీత కాలంలో మీ ఫిట్‌నెస్‌, ఎక్సర్‌సైజ్‌ ట్రెండ్స్‌ ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.
⇒ మీ పరిసర ప్రాంతాల్లోని శబ్ద కాలుష్యం గురించి ఇకపై ఆపిల్‌ వాచ్‌ ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. శబ్ద తీవ్రత పెరగగానే… మీ ప్రాంతంలో నిర్ణీత శబ్ద తీవ్రత కంటే ఎక్కువగా ఉంది. ఇలానే ఈ శబ్దం వింటే మీకు చెవి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది అని సూచన ఇస్తుంది. అలా అని మీ మాటల్ని ఆపిల్‌ వాచ్‌ రికార్డు చేయదు.
⇒ మహిళల కోసం సైకిల్‌ ట్రాకింగ్‌ అనే ఆప్షన్‌ను తీసుకొస్తోంది. మెన్‌స్ట్రువల్‌ సైకిల్‌ను ఈ ఆప్‌ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. అంతేకాదు దీన్ని ఆపిల్‌ ఫోన్స్‌లోనూ ఈ యాప్‌ను తీసుకొస్తోంది.

*** సరికొత్త కేటలీనా
• ఐట్యూన్స్‌ యాప్‌ను ఆపిల్‌ తన మ్యాక్‌ ఓఎస్‌ కోసం మార్పులు చేసింది. ఆపిల్ మ్యూజిక్‌, ఆపిల్‌ పాడ్‌కాస్ట్‌, ఆపిల్‌ టీవీ సౌకర్యాల్ని కలిపి ఐట్యూన్స్‌గా రూపొందిస్తున్నారు.
• కొత్త ఓఎస్‌లో మ్యాక్‌కు వాయిస్‌ కంట్రోల్‌ సౌకర్యాన్ని అందించారు. దీని మాటలతోనే మ్యాక్‌ను ఆపరేట్‌ చేయొచ్చు. సిరి వాయిస్‌ టెక్నాలజీ ద్వారా ఇది పని చేస్తుంది.
• ఫైండ్‌ మై అనే కొత్త ఫీచర్‌ను కూడా కొత్త కేటలీనాతో తీసుకొస్తున్నారు. ఫైండ్‌ మై ఫోన్‌ తరహాలోనే ఇది పని చేస్తుంది.
• ఇకపై ఐప్యాడ్‌ను మీ మ్యాక్‌ సెకండరీ డిస్‌ప్లేగా వినియోగించొచ్చు. సైడ్‌ కార్‌ ఫీచర్‌ ద్వారా ఈ సౌకర్యం పొందొచ్చు.
• మ్యాక్‌లో యాక్టివేషన్‌ లాక్‌ ఆప్షన్‌ను తీసుకొస్తున్నారు. ఒకవేళ మీ మ్యాక్‌ చోరీకి గురైతే… అవతలి వ్యక్తి మీ పాస్‌వర్డ్‌ లేకుండా ఆ మ్యాక్‌ను ఏమీ చేయలేరు. రీసెట్‌ చేసే అవకాశమూ లేదు.
• మ్యాక్‌ ఓఎస్‌ కూడా యాప్స్‌ రూపొందించేలా ఆపిల్‌ తన ఎక్స్‌కోడ్‌లో మార్పులు చేసింది. ఇకపై మ్యాక్స్‌కి కూడా డెవలపర్లు యాప్స్‌ రూపొందించొచ్చు.
మ్యాక్‌ ఓఎస్‌, ఐఓఎస్‌, ఐప్యాడ్‌ ఓస్‌ బీటా వెర్షన్‌ తక్షణమే అందుబాటులోకి తీసుకొచ్చారు. పబ్లిక్‌ వెర్షన్‌ను జులైలో లైవ్‌లోకి తీసుకొస్తారు.

*** మెరుగైన ప్రైవసీతో
• ఫేస్‌ ఐడీ అన్‌లాకింగ్‌ వేగాన్ని 30 శాతం పెంచారు. యాప్‌ అప్‌డేట్‌ ప్రాసెస్‌లో 50 శాతం వేగం పెరిగింది. యాప్‌ లాంచ్‌లో రెండింతల వేగం కనిపిస్తుంది.
• కొత్త వెర్షన్‌ ఓఎస్‌లో డార్క్‌ మోడ్‌ను ప్రవేశపెట్టారు. దీని వల్ల బ్యాటరీ వినియోగంలో తగ్గుదల, వెలుతురు వల్ల కళ్లకు ఇబ్బంది కలగకపోవడం లాంటి ఫీచర్లు వస్తాయి.
• ఇన్నాళ్లూ గూగుల్‌ కీబోర్డ్స్‌లో ఉన్న గ్లైడ్‌ టు కంపోజ్‌ ఆప్షన్‌ ఇప్పుడు ఐఫోన్లలోకి వచ్చింది. దీని ద్వారా కీబోర్డుపై వేలిని స్వైప్‌ చేస్తూ కంపోజ్‌ చేయొచ్చు.
• కెమెరాతో క్లిక్‌మనిపించిన ఫొటోలను షేర్‌ చేసినప్పుడు అందులో ఉన్న మీ స్నేహితుల ముఖాలను గుర్తుపట్టి… ‘వాళ్లకు షేర్‌ చేస్తారా’ అంటూ సజెషన్స్‌ కూడా కనిపిస్తాయి.
• రిమైండర్‌ యాప్‌లో ఆపిల్‌ చాలా మార్పులు చేసింది. రిమైండర్‌ సజెషన్స్‌, ట్యాగింగ్‌ లాంటి ఫీచర్లు తీసుకొచ్చింది.
• ఆపిల్‌ మ్యాప్స్‌ రీబిల్డ్‌ చేశారు. దీని కోసం ఆపిల్‌ ప్రత్యేకంగా వాహనాలు, సెన్సర్లు సిద్ధం చేసి తగు మార్పులు చేసింది. దీంతోపాటు మ్యాప్స్‌లో త్రీడీ ఫొటోలు చూసే అవకాశం కల్పించారు.
• ఒకసారి లొకేషన్‌ షేర్‌ చేస్తే ఆ యాప్‌ ఎప్పుడు ఓపెన్‌ చేసినా లొకేషన్‌ షేర్‌ అయిపోయేది. కొత్త వెర్షన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో ‘అలౌ వన్స్‌’ ఆప్షన్‌ తీసుకొస్తోంది. దీని వల్ల యాప్‌ ఓపెన్‌ చేసినప్పుడల్లా మీకు లొకేషన్‌ చేయాలా అని అడుగుతుంది. దీని వల్ల ప్రైవసీ పెరుగుతుంది.
• సోషల్‌ లాగిన్‌ ఆప్షన్‌లో ‘సైన్‌ ఇన్‌ విత్‌ ఆపిల్‌’ అనే ఆప్షన్‌ తీసుకొస్తోంది. ఇప్పటివరకు ఫేస్‌బుక్‌, గూగుల్‌ మాత్రమే ఈ సోషల్‌ లాగిన్‌లో ఉండేవి. అంటే ఐఫోన్‌లో ఏదైనా యాప్‌ ఓపెన్‌ చేస్తే లాగిన్‌ అయ్యేటప్పుడు ఈ ఆపిల్‌ సైన్‌ ఇన్‌ వస్తుంది.
• ఆపిల్‌తో లాగిన్‌ అయినప్పుడు మీ మెయిల్‌ ఐడీ అవతలి వాళ్లకు వెళ్లిపోతుందనే భయం అక్కర్లేదు. ఎందుంకటే ఇందులో హైడ్‌ ఈమెయిల్‌ ఆప్షన్‌ ఉంది. ఇది ఎంచుకుంటే మీ మెయిల్‌ ఐడీ బదులు ర్యాండమ్‌ మెయిల్‌ ఐడీ క్రియేట్‌ అవుతుంది. ఇలా ఎన్ని యాప్స్‌ ఓపెన్‌ చేస్తే అన్ని ర్యాండమ్‌ మెయిల్‌ ఐడీలు క్రియేట్‌ అవుతాయి.
• ఇళ్లలో వాడే సెక్యూరిటీ కెమెరాలు వీడియో ఫుటేజ్‌ని క్లౌడ్‌లో అప్‌లోడ్‌ అయ్యి… తర్వాత యూజర్లకు చేరుతుంటాయి. ఇది ప్రైవసీకి భంగం కలిగించేదే. అందుకే ఆపిల్‌ కొత్తగా హోమ్‌ కిట్‌ సెక్యూర్‌ వీడియో అనే ఆప్షన్‌ తీసుకొస్తోంది. దీని ద్వారా కెమెరాలో రికార్డయిన వీడియో ఎన్‌క్రిప్ట్‌ రూపంలో సేవ్‌ అవుతుంది. దీని వల్ల ప్రైవసీ ఇబ్బంది ఉండదు. ఈ ఆప్షన్‌ ఉన్న కెమెరాలు త్వరలో మార్కెట్‌లోకి వస్తాయి.
• ఇళ్లలో వాడుకునే స్మార్ట్‌ బల్బులు, స్మార్ట్‌ డోర్‌లాక్‌లు లాంటివి వైఫైతో అనుసంధానం అయి ఉంటాయి. దీని వల్ల మీ డేటా చోరీకి గురయ్యే అవకాశం ఉంది. ఈ ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ ఫైర్‌ వాల్‌ ఉన్న హోమ్‌ కిట్‌ రూటర్స్‌ వస్తున్నాయి.
• ట్రూకాలర్‌ తరహా ఫీచర్‌ను కొత్త ఐఓఎస్‌లో చూడొచ్చు. మీ ఐఫోన్‌కు ఎవరైనా మెసేజ్‌ చేస్తే అవతలి వ్యక్తి పేరుతోపాటు, ఫొటో/ మెమోజీ కనిపిస్తాయి. దీని వల్ల కొత్త నంబరు ఎవరిది? అనే కష్టం ఉండదు.
• గతేడాది ఐఫోన్లలో మెమోజీని తీసుకొచ్చిన ఆపిల్‌ ఈ ఏడాది మెమోజీ స్టిక్కర్లను తీసుకొచ్చింది. వీటిని మెయిల్‌, విచాట్‌ లాంటి సర్వీసుల్లో వినియోగించుకోవచ్చు.
• కెమెరా విషయంలో ఆపిల్‌ కొన్ని ఆసక్తికరమైన మార్పులు చేసింది. పోర్‌ట్రైట్‌ కెమెరాలో లైటింగ్‌ ఆప్షన్లు మరింత సహజంగా ఉండేలా మార్పులు చేసింది. ఫొటోలలో ఉండే రొటేట్‌, ఫిల్టర్‌ లాంటి ఆప్షన్లు ఇప్పుడు వీడియో ఎడిటింగ్‌లోనూ కనిపిస్తాయి.
• ఫొటోస్‌ యాప్‌లో వర్గీకరణను మరింత సులభం చేశారు. మీ ఫోన్‌లోని ఫొటోలను డేస్‌, మంథ్స్‌, ఇయర్స్‌ వారీగా చెక్‌ చేసుకోవచ్చు.

*** సిరి సూపర్‌
• ఎయిర్‌ పాడ్స్‌లో ఇకపై మీకొచ్చే మెసేజ్‌లను ఆటోమేటిక్‌గా వినొచ్చు… అంతేకాదు వాటికి సమాధానం కూడా ఇవ్వొచ్చు. అంటే మీరు మెసేజ్‌ విని… మాటల్లో సమాధానం చెబితే.. ఆ మాట అవతలి వ్యక్తికి చేరుతుంది. ఇదంతా వాయిస్‌ అసిస్టెంట్‌ సిరి ద్వారా జరుగుతుంది.
• మీ ఐఫోన్‌లోని పాటను మీ స్నేహితుడి ఎయిర్‌ పాడ్‌లో వినిపించొచ్చు. కొత్త ఓఎస్‌లో ఈ సౌకర్యం ఉంది.
• సిరిలో లైవ్‌ రేడియో సౌకర్యాన్ని తీసుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా లక్షకుపైగా రేడియో స్టేషన్లు అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
• ‘హే సిరి’ ప్లే మ్యూజిక్‌ అనగానే మీరు గతంలో విన్నకొన్ని పాటలకు అనుగుణంగా పాటలు ప్లే చేస్తుంది. ఇకపై ఇది జరగదు. ఎందుకంటే సిరి మీ వాయిస్‌ను పసిగట్టి… మనిషి ఎవరో గుర్తించి దానికి తగ్గట్టుగా పాటలు వినిపిస్తుంది.
• ఇంటికి చేరగానే నా మొబైల్‌ డేటాను ఆఫ్‌ చేయ్‌… లేదంటే వైఫైని ఆన్‌ చేయ్‌… లాంటి షార్ట్‌కట్‌ను మీ ఆపిల్‌ సిరిలో పెట్టుకుని ఉంటారు. అలా సేవ్‌ చేసుకున్న షార్ట్‌కట్‌లు ఒక దగ్గర కనిపిస్తే బాగుండు అనుకున్నారా? కొత్త ఓఎస్‌లో ఈ ఆప్షన్‌ను తీసుకొచ్చారు.

*** ఐప్యాడ్‌ కోసం కొత్తగా
• ఇన్నాళ్లూ ఫోన్ల ఓఎస్‌ను ఐప్యాడ్‌కు వినియోగిస్తూ వచ్చిన ఆపిల్‌… ఐప్యాడ్‌ కోసం కొత్తగా ఐప్యాడ్‌ ఓఎస్‌ను తీసుకొచ్చింది.
• ఐప్యాడ్స్‌కు ఐక్లౌడ్‌ షేరింగ్‌ సౌకర్యాన్ని తీసుకొచ్చారు. దీంతోపాటు ఐప్యాడ్స్‌లో పెన్‌డ్రైవ్‌ వినియోగించుకునే సదుపాయమూ కల్పిస్తున్నారు. ఇప్పుడు స్టిల్ కెమెరా నుంచి నేరుగా ఐప్యాడ్‌తో ఫొటోలు తీసుకోవచ్చు.
• హోమ్‌ స్క్రీన్‌ మీద ఐకాన్స్‌ సంఖ్యను పెంచారు. దీంతోపాటు మీకు కావాల్సిన విడ్జెట్స్‌ను హోమ్‌ స్క్రీన్‌ మీదే పెట్టుకునేలా మార్పు చేశారు.
• రీసెంట్‌ యాప్స్‌ చూడటం, మల్టీ టాస్కింగ్‌ (స్ప్లిట్‌ వ్యూ) ఆప్షన్లను సులభతరం చేశారు.
• ఐప్యాడ్‌ ఫైల్స్ యాప్‌లో మ్యాక్ తరహా ఫీచర్లు తీసుకొచ్చారు. దీనికి క్విక్‌ యాక్షన్‌ను జోడించారు. అంటే పీడీఎఫ్‌, రొటేట్‌ లాంటి ఆప్షన్లు ఇప్పుడు ఫైల్స్‌లో సులభంగా వినియోగించొచ్చు.
• ఐప్యాడ్‌లోని సఫారీలో డెస్క్‌టాప్‌ క్లాస్‌ బ్రౌజింగ్‌ను తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు మొబైల్‌, డెస్కటాప్‌ తరహా బ్రౌజింగ్‌ మాత్రమే అందుబాటులో ఉంది.
• సఫారీ బ్రౌజర్‌లో షార్ట్‌కట్స్‌, డౌన్‌లోడ్‌ మేనేజర్‌ ఫీచర్లను తీసుకొచ్చారు. దీంతోపాటు కస్టమ్‌ ఫాంట్స్‌ను వినియోగించుకునే సదుపాయమూ తీసుకొస్తున్నారు.
• ఐప్యాడ్‌లో ఇక కాపీ, పేస్ట్‌, డిలీట్‌ చాలా సులభం. కాపీ చేయాల్సిన టెక్ట్స్‌ వేళ్లతో సెలక్ట్‌ చేసుకొని మూడువేళ్లతో జూమ్‌ అవుట్‌ తరహాలో స్వైప్‌ చేస్తే కాపీ అవుతుంది. అదే మూడు వేళ్లతో జూమ్‌ ఇన్‌ తరహాలో స్వైప్‌ చేస్తే పేస్ట్‌ అవుతుంది. ఇక డిలీట్‌ చేయడానికి మూడువేళ్లలో ఎడమవైపు స్వైప్‌ చేయాలి.