ఐటీ నిపుణులు అమెరికా వెళ్లేందుకు అత్యధికంగా వినియోగించే హెచ్1బీ వీసాల జారీ తగ్గిపోయింది. ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ఈ వీసాల విషయంలో కఠినంగా ఉండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 2018లో వీటి జారీ 10శాతం తగ్గింది. 2018 సంవత్సరానికి గాను రెన్యూవల్స్ సహా కలిపి 3,35,000 హెచ్1బీ వీసాలను మాత్రమే మంజూరు చేసినట్లు అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ లెక్కలు చెబుతున్నాయి. ఇవే వీసాలు 2017లో 3,73,400 మంజూరు చేశారు. అంటే 2017లో వచ్చిన ప్రతి 100 దరఖాస్తు 93కు ఆమోద ముద్రపడగా.. 2018 నాటికి కేవలం 85కు మాత్రమే గ్రీన్‌సిగ్నల్ లభించింది. అదే ఏడాది మొదటి ఆరు నెలల్లో నూటికి 79 వీసాలను మాత్రమే ఆమోదించారు. చివర్లో కొంత ఉదారంగా ఉండటంతో అది 85శాతానికి చేరింది. 2018లో 8.50లక్షల నేచురలైజేషన్ దరఖాస్తులను పరిష్కరించారు. ‘‘హెచ్1బీ వీసాల వినియోగాన్ని తగ్గించాలని ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి ఉండటంతో జారీకి కళ్లెం వేశారు. ఆ చర్యల ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి.’’అని మైగ్రేషన్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ విశ్లేషకురాలు సారా పెర్సీ తెలిపారు.
10శాతం తగ్గిన హెచ్1బీ జారీ
Related tags :