WorldWonders

హైదరాబాద్‌లో భయంకరంగా పెరిగిపోయిన కిడ్నాప్‌లు

Hyderabad Sees Huge Spike Of Young Women Kidnaps In Cyberabad Area

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మనుషులు కనిపించకుండా పోతున్న ఉదంతాలు పెరిగిపోతున్నాయి. ఆకర్షణ మాయలో పడి యువతరం గువ్వ పిట్టల్లా ఎగిరిపోతుండగా.. ఆదరణ కరవై పెద్దతరం గడప దాటేస్తోంది. మూడు కమిషనరేట్ల పరిధిలో ఈ నెల మొదటి నాలుగు రోజుల్లోనే 77 అదృశ్యం కేసులు నమోదయ్యాయి. ఇందులో సగం మంది కంటే ఎక్కువగా మహిళలే ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. అందులోనూ లేచిపోయిన కేసులే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఠాణాలకు వచ్చే ఫిర్యాదుల్ని బట్టి పోలీసుల ప్రాథమిక అంచనాలు ఇవి.
**సగం కంటే ఎక్కువ మంది అమ్మాయిలే…
హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఈ నెల 1వ తేదీనుంచి 4వరకు 77 అదృశ్యం కేసులు నమోదయ్యాయి. అందులో 45 మంది మహిళలు, బాలికలు ఉన్నారు. అందులోనూ మహిళల కేసుల్లో యుక్తవయసులోపువారే ఎక్కువ. ఉదాహరణకు ఈ నెల 2న మూడు కమిషనరేట్లలో నమోదైన కేసుల్ని పరిశీలిస్తే ఆరోజు మొత్తం 31 మంది అదృశ్యం కాగా… అందులో 21 మంది మహిళలు, బాలికలున్నారు. వీరిలో తొమ్మిది మంది 20 ఏళ్లలోపు.. ఏడుగురు 25ఏళ్లలోపు.. ముగ్గురు 30 ఏళ్లలోపు ఉన్నారు. మిగిలిన ఇద్దరు 37 ఏళ్ల వయసు మహిళలు ఉన్నారు.
**సామాజిక మాధ్యమాల వల్లే…
ఈ ఘటనలు పెరగడానికి ప్రధాన కారణం సామాజిక మాధ్యమాలేనని… ఆకర్షణ, ప్రేమ మాయలో పడి కనిపించకుండా పోతున్న ఉదంతాలే ఎక్కువగా ఉన్నాయని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఫేస్‌బుక్‌, వాట్సప్లాంటి సాధనాల వల్ల అబ్బాయిలు, అమ్మాయిల మధ్య ఆకర్షణ పెచ్చుమీరుతోంది. 24 గంటలూ ప్రేమికుడు, ప్రేయసితో మాట్లాడుతుండటం… పారిపోయేందుకు ప్రేరేపిస్తోంది. వారు ఊహించుకున్న రంగుల ప్రపంచమేమీ బయట ఉండదని వెళ్లిన వాళ్లకు కొన్ని రోజుల్లోనే తత్వం బోధపడుతున్నది. వారిలో కొందరు ధైర్యం చేసి తిరిగి ఇంటికి వచ్చేస్తున్నారు. మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొందరు హత్యకు గురవుతున్నారు.
**బతుకుదెరువు కోసం వచ్చి వలవేస్తున్నారు
భాగ్యనగరంలో దేశం నలుమూలల నుంచి వలస వస్తుంటారు. ఏదో ఒక పని చేస్తూ జీవనం సాగిస్తుంటారు. ఇలా హైదరాబాద్కి వచ్చిన యువకులు ఎక్కువగా అదృశ్యం ఘటనల్లో కారకులుగా ఉంటున్నారు. మైలార్‌దేవ్‌పల్లి, కాటేదాన్‌, గగన్‌పహాడ్‌, జీడిమెట్ల తదితర పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసేందుకు వస్తున్న ఉత్తరాది యువకులు దిగువ మధ్యతరగతికి చెందిన బాలికలతో ప్రేమయాణాలు సాగించడం… ఆకర్షణతో ఆ చిన్నారులు గడప దాటుతున్నట్లు దర్యాప్తు క్రమం వెల్లడిస్తోంది. హైదరాబాద్లో ఎక్కువగా ఇలాంటి కేసులే నమోదవుతున్నాయి. బతుకుదెరువులో పడి తల్లిదండ్రులు పిల్లల్ని సరిగ్గా గమనించకపోవడం లాంటి కారణాల వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.
**ప్రియుడితో వెళ్లిపోయిన కేసులే అధికం
హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో నమోదవుతున్న అదృశ్యం ఉదంతాల్లో ‘ప్రియుడితో వెళ్లిపోయిన…’ కేసులే అధికం. ఠాణాలకు వచ్చే ఫిర్యాదుల్ని బట్టి 90 శాతానికిపైగా ఇటుంటివే ఉంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు. పెళ్లైన తర్వాత అత్తింట్లో ఆదరణ కరవై, ఆఫీసంటూ పొద్దున నుంచి రాత్రి వరకు భర్తలు ఇంటి పట్టున లేకపోవడంతో… కోరుకున్న అనురాగం దొరకకపోవడం తదితర అంశాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఫోన్ల ద్వారా వేరే యువకులతో సంబంధాలు నెరపడం, ఇంట్లోంచి వెళ్లిపోవడం జరుగుతున్నాయి. మరికొందరు మాత్రం అత్తింట్లో హింసను భరించలేక దూరంగా బతుకుదామని పారిపోతున్నారు.
**మతిస్థిమితం లేక వృద్ధులు…
వృద్ధులు కనిపించకుండా పోవడానికి ముఖ్య కారణ మతిస్థిమితం లేకపోవడమేనని దర్యాప్తులో వెల్లడైంది. ఇంటి నుంచి బయటికి వెళ్లిన తర్వాత తిరిగి వచ్చే దారి తెలియకపోవడం, చిరునామా చెప్పే స్థితి లేక అదృశ్యమైపోతున్నారు. కొందరు మాత్రం ఇళ్లలో పిల్లల ఆదరణ లేక కావాలనే వెళ్లిపోతున్నారు. ఇలాంటి కేసులు 5శాతం లోపే ఉంటున్నాయి.ఈ తరహా ఉదంతాల్ని నివారించేందుకు పాఠశాల స్థాయి నుంచే అవగాహన సదస్సులు పెంచాల్సిన అవసరముంది. మైనర్లను ప్రేమ పేరుతో ఎలా మోసగిస్తున్నారనే అంశంపై సైబరాబాద్‌లో కళాజాత బృందాల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు జరుగుతున్నాయి. అమ్మాయిల్ని తీసుకెళ్తున్న ఎంతో మంది యువకులు తర్వాత కేసులపాలై భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.