DailyDose

జగన్‌కు చంద్రబాబు లేఖ–రాజకీయ-06/05

June 05 2019 - Daily Political News-Chandrababu writes to Jagan

*ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు తెదేపా అద్యక్షుడు చంద్రబాబు నాయుడు బుధవారం లేఖ రాశారు. ఉండవల్లిలోని ప్రజావేదికను తనకు అధికార నివాసంగా కేటాయించాలని ఆయన ఈ సందర్భంగా ఆలేఖలో కోరారు. కాగా ప్రజావేదిక చంద్రబాబు ఉంటున్న ఇంటికి అనుబద్నంగా ఉందని దాన్ని ప్రతిపక్ష నేత హోదాలో ఆయన నివాసం కోసం ఇవ్వాలని ప్రభుత్వాన్ని అడగాలని పార్టీ నాయకులు సూచించగా, చంద్రబాబు ఆ మేరకు ప్రభుత్వానికి లేఖ రాశారు. నిన్న తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశం అయిన చంద్రబాబు తన నివాసం, పార్టీ రాష్ట్ర కార్యాలయం గురించి చర్చించారు. గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయం అందరికీ అందుబాటులో లేనందున విజయవాడలో రాష్ట్ర పార్టీ కార్యక్రమాలకు మరో భవనాన్ని చూడాలని చంద్రబాబు ఇప్పటికే కేశినేని నాని, దేవినేని ఉమాకు సూచించారు.
*వచ్చే వారం నుండి ఏపీ అసెంబ్లీ
ఈ నెల 12వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ తొలి సమావేశాలు జరగనున్నాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో నూతనంగా ఎన్నికైన 175 మంది, అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రొటెం స్పీకర్ సభ్యుల చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం స్పీకర్‌ ఎన్నిక జరుగుతుంది. అయితే ప్రొటెం స్పీకర్‌గా స్పీకర్ ఎవరనేదానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. సంప్రదాయంగా సీనియర్ నేత ప్రొటెం స్పీకర్‌గా ఉంటారా లేక అధికార పార్టీ నుంచి ఎవరైన ఆ స్థానంలో ఉంటారా అనేది తెలియాల్సి ఉంది. కాగా సమావేశాలు ప్రారంభానికి ముందే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నారు.ఈ నెల 8వ తేదీ ఉదయం సీఎం జగన్ సచివాలయంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అదే రోజున మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం సచివాలయంలో జరుగుతుంది. మంత్రివర్గ విస్తరణకు ఒక రోజు ముందుగా 7వ తేదీన వైఎస్సార్‌ ఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి.. మంత్రివర్గ కూర్పుపై చర్చించనున్నారు.
* ముద్ర‌గ‌డ‌ చేరిక ఖాయం
కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గడ ప‌ద్‌ నాభం వైసీపీలో అధికారికంగా చేర‌నున్నారు. 2014 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తే కాపుల‌ను బీసీల్లో చేరుస్తామ‌ని నాడు చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. అయితే, అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత దీని పైన ఒత్తిడి పెంచేందుకు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం తుని వ‌ద్ద కాపుల స‌భ ఏర్పాటు చేసారు. అది హింస‌కు దారి తీసి ర‌త్నాచ‌ల్ ఎక్స్‌ప్రెస్ ద‌హ‌నం అయింది.ఆ త‌రువాత దీని పై ప్ర‌భుత్వం కాపు రిజ‌ర్వేష‌న్ల పైన అధ్య‌యనం కోసం మంజునాధ క‌మిష‌న్‌ను ఏర్పాటు చేసింది. అయితే, ఆ క‌మిష‌న్ ప్ర‌భుత్వానికి నివేదిక ఇచ్చే స‌మ‌యంలో విభేదాలు వ‌చ్చాయి. స‌భ్యులు రిజ‌ర్వేష‌న్‌కు అనుకూలంగా నివేదిక ఇవ్వ‌గా..ఛైర్మ‌న్ వ్య‌తిరేకంగా నివేదిక ఇచ్చారు. రాష్ట్ర ప్ర‌భుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదించింది. ఆ త‌రువాత అగ్ర‌వ‌ర్ణాల పేదల కోటాలో కాపుల‌కు అయిదు శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం తీర్మానం చేసింది. ఆ స‌మ‌యంలోనూ స్పందించ‌ని ముద్ర‌గ‌డ ప‌ద్మనాభం ఎన్నిక‌ల వేళ‌..మౌనంగానే ఉన్నారు. తాజాగా ఆయ‌న వైసీపీలో చేరాల‌ని నిర్ణ‌యించారు.కాపు ఉద్య‌మ నాయ‌క‌డు ముద్ర‌గ‌డ వైసీపీలో చేర‌టం ఖాయ‌మైంది. కాపుల‌ను బీసీల్లో చేర్చాలంటూ ఉద్య‌మం కొన‌సాగిస్తున్న ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఎన్నిక‌ల‌వేల సైలెంట్‌గా ఉన్నారు. కాపు వ‌ర్గం మొత్తం ప‌వ‌న్ క‌ళ్యాన్‌కే మ‌ద్ద‌తుగా నిలుస్తార‌ని కొంత మంది..కేంద్రం ఆమోదించిన అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు ఇచ్చే రిజ‌ర్వేష‌న్ల‌లో అయిదు శాతం కాపుల‌కు ఇవ్వ‌టంతో వారంతా చంద్ర‌బాబు వైపే ఉంటార‌ని మ‌రి కొంద‌రు అంచ‌నా వేసారు. అయితే, అనూహ్యంగా కాపుల్లో అధిక శాతం వైసీపీకే ప‌ట్టం క‌ట్టారు. ఇక‌, భ‌విష్య‌త్ స‌మీక‌ర‌ణాలే ల‌క్ష్యంగా జ‌గ‌న్ అడుగులు వేస్తున్నారు.
*జగన్ కు లేఖ రాసిన ఖన్నా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి 7లేఖలు రాసిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ… రాజధాని భూముల అక్రమాలు, అసైన్డ్ ల్యాండ్స్ కొనుగోలులో అక్రమాల పైవిచారణ జరిపించాలని, రైతులకు న్యాయం చేయాలని , గత ప్రభుత్వం తెచ్చిన ఉచిత ఇసుక విధానం పై ఆలోచన చేయాలని, అక్రమ ఇసుక రవాణా ను అడ్ఢకట్ట వేసేవిధంగా కొత్త ఇసుక పాలసీని తీసుకురావాలని.పోలవరం ప్రాజెక్ట్ విషయంలో నిర్వాసితులకు,గిరిజనుకు న్యాయం చేయాలనిక్రిష్ణ పుష్కరాల సమయంలో విజయవాడలో తొలగించిన హిందు దేవాలయాలను పునర్మించాలని,సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో చుక్కల సమస్యల పై వెంటనే పరిష్కరించాలని,అగ్రిగోల్డ్ లో అవినీతి పై సీబీఐ విచారణ జరిపించాలని ,. దేవాలయ భూముల పరిరక్షణ కోసం గత ప్రభుత్వం తెచ్చిన చట్టంలో మార్పులు తీసుకురావాలని లేఖలలో కోరిన కన్నా లక్ష్మీనారాయణ.
*నేడు కూడా సీసీఎస్ విచారణకు వచ్చిన టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్
సంతకాల ఫోర్జరీ, మోసం వంటి అభియోగాలను ఎదుర్కొంటూ, దాదాపు నెల రోజులకు పైగా అజ్ఞాతంలో గడిపిన టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్, నేడు వరుసగా రెండో రోజూ సీసీఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
నిన్న ఆయన్ను 5 గంటల పాటు ఉన్నతాధికారులు విచారించిన సంగతి తెలిసిందే. ఈ విచారణలో ఆయన పెద్దగా ఉపయోగపడే సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో ఆయన్ను నేడు కూడా విచారణకు రావాలని ఆదేశించగా, ఉదయం 11 గంటల ప్రాంతంలో సీసీఎస్ కార్యాలయానికి రవిప్రకాశ్ వచ్చారు. నేడు ఆయన్ను పలు అంశాలపై ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది. రవిప్రకాశ్ ను కనీసం 48 గంటల పాటు అరెస్ట్ చేయవద్దని రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు పెట్టిన గడువు నేటితో ముగియనుండటంతో, నోటీసులు ఇచ్చి, ఆయన అరెస్ట్ చూపించాలని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం.
*అమరావతికి రానున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్..
కల్యాణ్ రేపు అమరావతికి రానున్నారు. రేపు ఉదయం 9:30 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు పవన్ చేరుకోనున్నారు. అక్కడ్నుంచి పటమటలంకలోని తన నివాసానికి జనసేనాని వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి మంగళగిరి జనసేన కార్యాలయంలో పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నేతలతో పవన్ సమీక్షా నిర్వహించారు.ఈ సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని పవన్ పిలుపునిచ్చారు. సమీక్షలో ఎన్నికల ఫలితాలు, త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల గురించి నేతలతో పవన్ చర్చించనున్నారు. ఈ సమావేశం అనంతరం పవన్ ప్రెస్‌మీట్ నిర్వహిస్తారని తెలుస్తోంది..వరంగల్ లో ఇంటర్ పరీక్ష ప్రశ్న పేపర్లు మాయం.
*పీసీసీ పదవి పై ఆశలేదు – కోమటిరెడ్డి
పీసీసీ పదవి పై తనకు ఆశలేదని ఆపదవి పై ఉత్సాహం ఎవరికైనా ఉంటె వారికే ఇవ్వమని చెపుతానని కాంగ్రెస్ సేనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పీసీసే కంటే ముఖ్యమైన ఎంపీ పదవిని భువనగిరి ప్రజలు తనకు ఇచ్చారని, వారికి సేవ చేస్తానని పేర్కొన్నారు.
గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకోసం పోరాడినట్లుగా ప్రజలకోసం పోరాడుతానని చెప్పారు. ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు శుభాకాంక్షలు తెలిపారు. అధికారం అండతో కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తే చూస్తూ ఉరుకొమని హెచ్చరించారు.
* మమత ప్రభుత్వం ముందే కూలిపోతుంది: బీజేపీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న బీజేపీ ఇవాళ మరో అడుగు ముందుకేసింది. రాష్ట్రంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉండబోదనీ.. త్వరలోనే దానంతట అదే కూలిపోతుందని జోస్యం చెప్పింది. ‘‘మమతా బెనర్జీ ప్రభుత్వం 2021 వరకు అధికారంలో ఉంటుందని నేను అనుకోవడం లేదు. అయితే ఆ విషయం ఇప్పుడే చెప్పడం తొందరపాటే అయినా.. 2021 ఎన్నికల కోసం మేము సిద్ధమవుతున్నాం. అయితే ఈ ప్రభుత్వం దానంతట అదే కూలిపోతుంది..’’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్‌వర్గీయ పేర్కొన్నారు. మమతా బెనర్జీ ఓ ‘‘అహంకార పాలకురాలు’’ అంటూ ఆయన దుయ్యబట్టారు.
* ఏపిలో ఐపీఎస్ ల బదిలీలకు రంగం సిద్దం.
నేడో, రేపో రేంజ్ డీఐజి లతో పాటు జిల్లా ఎస్పీలకు బదిలీలు చేసేందుకు ఫైల్ సిద్ధం చేసి ఏపీ డీజిపి గౌతమ్ సవాంగ్.
విజయవాడ, విశాఖపట్నం కమీషనర్స్ కు తప్ప ని బదిలీల బెడద.ఇప్పటికీ కే ఏపీ డీజిపి సీయంతో సమావేశం.
సీయం ఆదేశాల కోసం ఎదురు చూస్తున్న డీజిపి.సీయం గ్రీన్ సిగ్నల్ ఇస్తే… వేంటనే ఏపీలో ఐపీఎస్ లు బదిలీలు.ఐపీఎస్ లో మొదలైన బదిలీల టెన్షన్.అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం
* టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి సంచలన నిర్ణయం
టీపీసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి భావిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. దీంతో.. ఆయన జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు హైకమాండ్‌కు ఉత్తమ్ ఇప్పటికే సంకేతాలిచ్చినట్లు తెలిసింది. కొత్త పీసీసీ చీఫ్‌ను నియమించుకోవాలని ఉత్తమ్ హైకమాండ్‌కు పరోక్షంగా చెప్పేశారని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
*వైకాపా పార్లమెంటరీ పార్టీ నేతగా విజయసాయి
వైకాపా పార్లమెంటరీ పార్టీ నేతగా విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. లోక్‌సభలో వైకాపా పక్ష నేతగా పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, విప్‌గా మార్గాని భరత్‌ను నియమించారు. ఈముగ్గురిని ఆయా పదవుల్లో నియమిస్తున్నట్లు వైకాపా అధ్యక్షుడు, ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రికి లేఖ రాశారు. విజయసాయిరెడ్డి ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. మిథున్‌రెడ్డి వరుసగా రెండో సారి లోక్‌సభకు ఎన్నికైన విషయం తెలిసిందే. వైకాపాలో కీలకనేతగా ఉన్న విజయసాయిరెడ్డిని రాష్ట్రమంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం జరిగింది. కానీ, చివరకు ఆయన్ను పార్లమెంటరీ పార్టీ నేతగా నియమించారు.
*ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా అప్పల నాయుడు?
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఈనెల 12న శాసనసభ తొలి సమావేశాలు ప్రారంభం కానున్నట్లు సమాచారం. ప్రొటెం స్పీకర్‌గా విజయనగరం జిల్లాకు చెందిన వైకాపా ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు నియమితులయ్యే అవకాశముంది. బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఇప్పటికి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన అనంతరం శాసనసభ సమావేశాల తొలిరోజున కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు. ఆతర్వాత శాసనసభ స్పీకర్‌ ఎన్నికను కూడా నిర్వహించాల్సి ఉంటుంది.
*ఎంపీ కేశినేనితో గల్లా జయదేవ్‌ భేటీ
లోక్‌సభలో విప్‌ పదవిని తిరస్కరించిన విజయవాడ ఎంపీ కేశినేని నానితో తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్‌ భేటీ అయ్యారు. అంతకు ముందే విప్‌ పదవిని తిరస్కరిస్తున్నట్లు ఫేస్‌బుక్‌ ద్వారా ప్రకటించిన నాని.. ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఫేస్‌బుక్‌లో వ్యక్తిగత అభిప్రాయాలు పంచుకునే స్వేచ్ఛ ఉందన్నారు. విజయవాడ ఎంపీ కంటే తనకు మరో పెద్ద పదవి లేదని వ్యాఖ్యానించారు. విప్‌ అంశాన్ని పెద్దదిగా చూడొద్దని, విజయవాడ ఎంపీగానే లోక్‌సభలో అవిశ్వాసం పెట్టానని గుర్తు చేశారు. పోరాడేందుకు పదవులు అవసరం లేదన్న కేశినేని విభజన హామీలపై విజయవాడ ఎంపీగానే పోరాడానని స్పష్టం చేశారు.
*అసాధారణ, అఖండ విజయమిది
స్వాతంత్య్రానంతరం నిర్వహించిన ఏ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ లేనివిధంగా రాష్ట్ర ప్రజలు దేశ చరిత్రలోనే చరిత్రాత్మక తీర్పునిచ్చారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు.
*ఆగస్టు తర్వాత కశ్మీర్‌ ఎన్నికలు!
అమర్‌నాథ్‌ యాత్ర ముగిశాక జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్లు ఎన్నికల కమిషన్‌ (ఈసీ) మంగళవారం ప్రకటించింది. ఈ ఏడాది చివర్లోగా ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉందని ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాది జూన్‌లో పీడీపీ-భాజపా సంకీర్ణ సర్కారు పడిపోయినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం లేదు. జూన్‌ 19న రాష్ట్రంలో గవర్నర్‌ పాలన విధించారు. డిసెంబర్‌ 19న రాష్ట్రపతి పాలన విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇది ఈ నెల 19న ముగుస్తుంది. ‘‘జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితిని కమిషన్‌ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. సంబంధీకులందరి నుంచి అవసరమైన సమాచారాన్ని తీసుకుంటోంది. అమర్‌నాథ్‌ యాత్ర ముగిశాక ఎన్నికలపై షెడ్యూల్‌ను ప్రకటిస్తాం’’ అని ఈసీ తెలిపింది. వచ్చే నెల 1న ప్రారంభమయ్యే అమర్‌నాథ్‌ యాత్ర ఆగస్టు 15న ముగుస్తుంది.
*ఏకాభిప్రాయంతోనే ఎంపిక
తెలంగాణలోని మొత్తం స్థానాలను గెలిచేందుకు అవసరమైన బలం ఉన్న తెరాసలో జడ్పీ ఛైర్‌పర్సన్‌ పదవుల కోసం జడ్పీటీసీ సభ్యులు ఆశపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి పలువురు అభ్యర్థులు తెరమీదికి వచ్చారు. అధిష్ఠానం మాత్రం జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల ఏకాభిప్రాయంతోనే జడ్పీ ఛైర్‌పర్సన్లు, ఎంపీపీలను ఎంపిక చేయాలని భావిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే జడ్పీ పీఠాలపై మాజీ ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి పేరును ఆసిఫాబాద్‌కు, పుట్ట మధు పేరును పెద్దపల్లికి ఖరారు చేశారు.
*చతికిలపడ్డ కమలదళం
లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో సత్తా చాటిన ‘కమలం’ పరిషత్‌ ఎన్నికల్లో చతికిలబడింది. నాలుగు ఎంపీ సీట్లు కైవసం చేసుకుని జోష్‌ మీదున్న కమలదళం మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో అదే జోరు కొనసాగుతుందని భావించింది. కానీ, ఫలితాల్లో ప్రభావం చూపలేకపోయింది. రాష్ట్రవ్యాప్తంగా 211 ఎంపీటీసీ, 8 జడ్పీటీసీ స్థానాల్లో మాత్రమే భాజపా అభ్యర్థులు విజయం సాధించారు. ఎంపీటీసీ స్థానాల్లో భాజపా తొమ్మిది జిల్లాల్లో బోణీయే చేయలేదు. 16 జిల్లాల్లో ఒక అంకె స్థానానికే పరిమితమైంది. లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ లోక్‌సభ స్థానాల పరిధిలో కూడా చెప్పుకోదగ్గ స్థానాల్లో గెలవకపోవడం కమలనాథులకు తీవ్ర నిరాశ కలిగించింది.
*‘హస్త’ విలాపం
రాష్ట్రంలో పరిషత్‌ పోరులో కాంగ్రెస్‌ పార్టీకి తీవ్ర నిరాశ ఎదురైంది. రాష్ట్రంలో ఒక్క జిల్లా పరిషత్‌నూ దక్కించుకోలేకపోయింది. ఆరు జిల్లాల్లో ఒక్క జడ్పీటీసీ స్థానాన్నీ పొందలేదు. జిల్లా పరిషత్‌లతో పాటు మండల పరిషత్‌లలోనూ నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలపై ప్రత్యేక దృష్టిసారించినా ఫలితం దక్కలేదు. లోక్‌సభ ఎన్నికల్లో మూడు ఎంపీ స్థానాలను దక్కించుకోవడంతో పాటు, రెండు స్థానాల్లో తక్కువ ఓట్ల తేడాతో ఓడిన కాంగ్రెస్‌ పార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలపై నమ్మకం పెట్టుకుంది.
*టీఐఎఫ్‌ఆర్‌ అభివృద్ధికి రూ.896 కోట్లు
గోపన్‌పల్లిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ హైదరాబాద్‌(టీఐఎఫ్‌ఆర్‌) అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.896.09 కోట్లు మంజూరు చేసిందని సంస్థ డైరెక్టర్‌ వి.చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. 21వ శతాబ్దంలో విజ్ఞానశాస్త్రం స్థితిగతులు, పరిశోధనలకు కావాల్సిన పరికరాలు, సవాళ్లపై వివరణాత్మక ప్రాజెక్ట్‌ ప్రాతిపాదనలను ఆటమిక్‌ ఎనర్జీ కమిషన్‌(ఏఈసీ)కి సమర్పించామన్నారు. ఫిబ్రవరిలో తమ ప్రతిపాదనలకు ఏఈసీ ఆమోదం తెలిపిన నేపథ్యంలో కేంద్రం నిధులు మంజూరు చేసిందని తెలిపారు.
*కర్ణాటక సంకీర్ణానికి కొత్త తలనొప్పులు
కర్ణాటకలోని జేడీ(ఎస్‌), కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వానికి సొంత పార్టీ నేతల నుంచే తలనొప్పి తీవ్రమైంది. త్వరలో మంత్రివర్గాన్ని విస్తరించి, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలకు పదవులు ఇవ్వాలని రెండు పార్టీల నేతలు తీర్మానించడంతో వివాదాల తేనెతుట్టె కదిలింది. తమ అధినాయకులపైనే పలువురు విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు.
*సీపీఐకి త్వరలో కొత్త ప్రధాన కార్యదర్శి?
కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (సీపీఐ)కి త్వరలోనే కొత్త ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఆరోగ్య కారణాల రీత్యా ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాలని యోచిస్తున్నట్లు ప్రస్తుత పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పార్టీకి తెలిపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగమైన సీపీఐ జాతీయ మండలి.. కొత్త ప్రధాన కార్యదర్శి పేరును ఈ ఏడాది జులై ఆఖరు నాటికి ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ పదవికి గాను డి.రాజా, బినోయ్‌ విశ్వం, అతుల్‌ అంజన్‌, అమర్జీత్‌ కౌర్‌, కనమ్‌ రాజేంద్రన్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
*ప్రభావం చూపని తెదేపా
స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభావం చూపలేకపోయింది. మొత్తం 500 ఎంపీటీసీ, 180 జడ్పీటీసీ స్థానాల్లో పోటీచేసి కేవలం 21 ఎంపీటీసీల్లోనే గెలిచింది. కొన్నిచోట్ల కాంగ్రెస్‌, వామపక్షాలకు మద్దతిచ్చి గెలిపించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికను జిల్లా నేతలకు పార్టీ అప్పగించింది. రాష్ట్రస్థాయి నాయకత్వం అభ్యర్థుల ఎంపికను స్థానికంగా వదిలేసిందని, వీలైన చోట మిత్రపక్షాలకు మద్దతుగా నిలబడ్డారని నేతలు వివరించారు.
*ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వామపక్షాల ఉనికి
రాష్ట్రంలో జరిగిన మండల పరిషత్‌ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వామపక్షాలు తమ ఉనికిని కొంత గుర్తింపు స్థాయిలోనే చాటుకున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పోల్చితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే సీపీఐ, సీపీఎంలు అత్యధిక స్థానాలను దక్కించుకున్నాయి. ఈ రెండు పార్టీలకు మొత్తంగా 84 ఎంపీటీసీ స్థానాలు దక్కగా, ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే 50 స్థానాల్లో విజయం సాధించాయి. సీపీఐ, సీపీఎంలు ఒక్క జడ్పీటీసీ స్థానంలోనూ విజయం సాధించలేదు. అయితే సీపీఐఎంఎల్‌ న్యూడెమొక్రసీ మద్దతిస్తున్న అభ్యర్థి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల నుంచి జడ్పీటీసీగా గెలుపొందారు.
*ఎస్పీతో శాశ్వత తెగతెంపులు కాదు -మాయావతి స్పష్టీకరణ
ఉత్తర్‌ ప్రదేశ్‌లో 11 అసెంబ్లీ స్థానాలకు త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతున్నంత మాత్రాన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)తో తాము శాశ్వతంగా తెగతెంపులు చేసుకున్నట్లు కాదని బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి స్పష్టం చేశారు. రాజకీయ అనివార్యతల కారణంగానే ప్రస్తుతం ఒంటరి పోరుకు మొగ్గుచూపినట్లు పేర్కొన్నారు.
*గుజరాత్‌ నుంచి రాజ్యసభకు జయ్‌శంకర్‌?
విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా నరేంద్రమోదీ మంత్రివర్గంలో బాధ్యతలు చేపట్టిన ఎస్‌.జయ్‌శంకర్‌ను గుజరాత్‌ నుంచి రాజ్యసభకు పంపే అవకాశం కనిపిస్తోంది. ఆరు నెలల్లోగా ఆయన ఏదో ఒక సభ నుంచి పార్లమెంటుకు ఎన్నిక కావాల్సి ఉంది. వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రాంవిలాస్‌ పాసవాన్‌ సైతం గుజరాత్‌ నుంచే రాజ్యసభకు వెళ్లొచ్చని తెలుస్తోంది. భాజపాకు ప్రస్తుతం గుజరాత్‌ నుంచి రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. బిహార్‌లో మరో స్థానం ఉంది. ఇంతకుముందు అమిత్‌ షా, స్మృతి ఇరానీ, రవిశంకర్‌ ప్రసాద్‌ రాజ్యసభ సభ్యులుగా ఉండేవారు. వీరంతా లోక్‌సభకు ఎన్నికవ్వడంతో వారి స్థానాలు ఖాళీ అయ్యాయి.
*ఆత్మహత్యలకు బాధ్యత ప్రభుత్వానిదే
ఇంటర్మీడియట్‌ ఫలితాల గందరగోళంతో విద్యార్థులు చేసుకున్న ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని భాజపా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భరత్‌గౌడ్‌ అన్నారు. విద్యార్థిని అనామిక ఆత్మహత్య చేసుకున్న తర్వాత రీవాల్యుయేషన్‌లో ఆమె మార్కుల విషయంలో జరిగిన గందరగోళం ప్రభుత్వ, ఇంటర్‌ బోర్డు అధికారుల నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోందని ధ్వజమెత్తారు.
*పోతంగల్‌లో భాజపా విజయం
ఎంపీటీసీ ఎన్నికలో మాజీ ఎంపీ కవిత అత్తగారి గ్రామమైన నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం పోతంగల్‌లో భాజపా అభ్యర్థి విజయం సాధించారు. లోక్‌సభ ఎన్నికల్లో తెరాస ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆమె పోతంగల్‌లో వందకు పైగా ఓట్ల ఆధిక్యం సాధించారు. కానీ ఈ ఎన్నికలో మాత్రం అధికార పార్టీ అభ్యర్థి ఓడిపోయారు. గ్రామంలో మొత్తం 1912 ఓటర్లు ఉండగా, 1382 ఓట్లు పోలయ్యాయి. భాజపా అభ్యర్థి రాజేశ్వర్‌, తెరాస అభ్యర్థి చంద్రకళపై 96 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.
*కేంద్రంపై పోరాటమే
తెదేపా ఇకపై లోక్‌సభ నియోజకవర్గాల వారీగా పార్టీ కమిటీలను నియమించనుంది. రాష్ట్రంలో ఒక్కో లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలని ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో తెదేపా అలాగే పార్టీ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించింది. విభజన చట్టంలోని అంశాలు, రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీల్ని సాధించేందుకు పోరాటం కొనసాగించనుంది. తెదేపా జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలు కొందరితో సమావేశమయ్యారు.
*దేన్నైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలి
బాధపడితే పోరాడలేమని, పోరాడేవారు బాధపడరని, దేన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తనను కలిసిన తెదేపా కార్యకర్తలతో అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అందరూ ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం టి.నర్సాపురం మండలం, చిత్తూరు జిల్లా సత్యవేడు, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం, ప్రకాశం జిల్లాల నుంచి భారీ ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు, ప్రజలు ఆయనను మంగళవారం కలిశారు.
*తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై ప్రభుత్వ వైఖరేంటి: తులసిరెడ్డి
కృష్ణా నదిపై అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరేంటో తెలియజేయాలని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి డిమాండ్‌ చేశారు. అనుమతుల్లేకుండా తెరాస ప్రభుత్వం 90 టీఎంసీల సామర్థ్యంతో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల, 30 టీఎంసీల సామర్థ్యంతో డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుల్ని నిర్మిస్తోందన్నారు.
*ఎమ్మెల్సీ పదవికి పయ్యావుల రాజీనామా
తెదేపా సీనియర్‌ నాయకుడు పయ్యావుల కేశవ్‌ తన ఎమ్మెల్సీ పదవికి మంగళవారం రాజీనామా చేశారు. ఆయన ఇటీవల శాసనసభ ఎన్నికల్లో అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి పోటీ చేసి గెలిచారు. దాంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను మండలి ఛైర్మన్‌ ఆమోదించారు.
*కీలక మంత్రులతో అమిత్‌ షా సమీక్ష
కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అధ్యక్షతన కేంద్రంలోని కీలక శాఖల మంత్రులు మంగళవారం సమావేశమయ్యారు. ఇందులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, విదేశాంగ మంత్రి ఎస్‌.జయ్‌శంకర్‌, వాణిజ్య, రైల్వే శాఖల మంత్రి పీయూష్‌ గోయల్‌, పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పాల్గొన్నారు. దాదాపు గంట పాటు ఈ భేటీ జరిగింది. ముడి చమురు సరఫరా, పెరుగుతున్న ధరల అంశాలను ఇందులో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
* ప్రకృతిని పరిరక్షించడం భారతీయత: కోవింద్‌
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు సందేశమిచ్చారు. భూమిని స్వచ్ఛంగా ఉంచడానికి భారత్‌ కట్టుబడి ఉందని, ప్రకృతిని పరిరక్షిస్తూ కలిసి జీవించడం భారతీయ విలువల్లో భాగమని వ్యాఖ్యానించారు. వాతారణ మార్పుల వల్ల వస్తున్న సమస్యల్ని పరిష్కరిస్తూ స్వచ్ఛమైన, పచ్చని గ్రహాన్ని ముందు తరాలకు అందించాలని రామ్‌నాథ్‌ కోవింద్‌ పిలుపునిచ్చారు. అలాగే ప్రధాని మోదీ స్పందిస్తూ.. ప్రకృతికి అనుగుణంగా జీవనం సాగించాలని అప్పుడే మెరుగైన భవిష్యత్తు ఉంటుందన్నారు.
* టిటిడి చైర్మన్ గా మోహన్ బాబు..?
టిటిడి చైర్మన్ గా ప్రముఖ నటుడు, వైసిపి నేత మంచు మోహన్ బాబును నియమించే అవకాశం కనిపిస్తోంది. టిటిడి చైర్మన్ గా మోహన్ బాబును నియమించనున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ విషయంపై మోహన్ బాబు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. వైసిపి చీఫ్ జగన్ ను ఎపి సిఎంగా చూడాలన్నదే తన కోరిక అని మోహన్ బాబు తేల్చి చెప్పారు. వైసిపి విజయం కోసం తన వంతు ప్రయత్నం చేశానని ఆయన చెప్పుకొచ్చారు. తాను ఎటువంటి నామినేటెడ్ పదవులు ఆశించడం లేదని, జగన్ ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో పని చేస్తానని మోహన్ బాబు స్పష్టం చేశారు.
తనను టిటిడి చైర్మన్ గా నియమిస్తున్నారన్న వార్తలపై ఆయన ట్వీట్ చేస్తూ పైవిధంగా స్పందించారు.
* నేను ఎలాంటి పదవులు ఆశించలేదు- మోహన్ బాబు
“నిజమేంటో తెలుసుకోకుండా నా పై అసత్య ప్రచారాలు చేయడం తగదు’’ అని ప్రముఖ సినీ నటుడు, నిర్మాత, విద్యావేత్త మంచు మోహన్ బాబు అన్నారు. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు మోహన్ బాబు వైజాగ్ నుంచి చిత్తూరు వరకూ వైఎస్ఆర్ సీపీ తరఫున భారీ ఎత్తున ప్రచారం చేసిన విషయమూ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు పార్టీ తరఫున ఏదో పదవి ఇవ్వనున్నారనే ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. అయితే తాను ఏ పదవీ ఆశించలేదని డా. మోహన్ బాబు స్పష్టం చేశారు. ఈ విషయంపై ఆయన ఈ విధంగా స్పందించారు.“మీడియా మిత్రులకు నమస్కారం. గత కొన్ని రోజులుగా మీడియాలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు మోహన్ బాబుకి ఫలానా పదవి ఇవ్వబోతున్నారని ఊహాగానాలు చేస్తూ నా పేరుని, నా ఛాయా చిత్రాన్నిచానెల్స్ లో పదే పదే చూపిస్తూ నన్ను ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు ముఖ్యమంత్రి కావాలని మాత్రమే ఆ భగవంతుడిని కోరుకున్నాను. అందులో ఏ స్వార్థమూ లేదు. ఏ పదవినీ ఆశించి ప్రచారం చేయలేదు. అందుకని ఇలాంటి ప్రచారాలు చేయడం భావ్యం కాదు. 50 ఏళ్లుగా అహర్నిశలూ నేను శ్రమించి సంపాదించిన కీర్తి ప్రతిష్టలకు అది భంగం అని మీకు తెలియజేస్తున్నాను. దయచేసి ఇలాంటి ఊహాగానాలు ముందు ముందు నా పేరుతో ప్రచారం చేయవద్దని మనవి చేసుకుంటున్నాను.