Movies

ప్రతిఫలం సుభద్రం

Rashi Khannas New Lessons On Satisfactory Results

‘‘కష్టాన్ని నమ్ముకున్నవారు చెడిపోయినట్టు చరిత్రే లేదు. మొదటి నుంచి నేను ఆ సిద్ధాంతాన్ని నమ్మి, కెరీర్‌ బిల్డప్‌ చేసుకున్నాను. ఎప్పుడూ నా రూటు సెపరేటే’’ అని అంటున్నారు రాశీ ఖన్నా. ఆమె ప్రస్తుతం తెలుగులో విజయ్‌ దేవరకొండ సరసన ఓ చిత్రంలోనూ, నాగచైతన్య సరసన ‘వెంకీమామ’లోనూ నటిస్తున్నారు. తమిళంలో సిద్ధార్థ్‌ సరసన ‘సైతాన్‌ కా బచ్చా’, విజయ్‌ సేతుపతి సరసన ‘కడైసీ వివసాయి’, ‘సంగ తమిళన్‌’లో నటిస్తున్నారు. రాశీ మాట్లాడుతూ ‘‘ఎప్పుడూ ఇతరులతో పోల్చుకోకూడదని మా అమ్మ చిన్నప్పుడు చాలా సార్లు చెప్పేది. ఎవరి సత్తా వారికి ఉంటుంది. కాకపోతే మనల్ని మనం గుర్తించుకోగలగాలి అని నాక్కూడా నిదానంగా అర్థమైంది. అందుకే నేను బరువు తగ్గే విషయంలోనూ వాళ్లూ, వీళ్లూ చెప్పినవి, చేసినవీ చేయలేదు. నిపుణులను సంప్రదించి నా శరీరతత్వానికి సరిపడే వ్యాయామాలనే ఎంపిక చేసుకున్నాను. ‘నేను చేయగలను’ అనే నమ్మకమే నా సక్సెస్‌ మంత్రం. కష్టపడి పనిచేసేవారికి సక్సెస్‌ ఒకరోజు ఆలస్యంగా రావచ్చేమోగానీ, కచ్చితంగా వచ్చి తీరుతుంది. మన కష్టం తాలూకు ప్రతిఫలాన్ని ఎవ్వరూ దోచలేరు’’ అని అన్నారు.