DailyDose

ఏపీ స్పీకర్‌గా తమ్మినేని–రాజకీయ-06/07

Is Tammineni SItaram The Next Speaker Of Andhra Assembly

*ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌గా తమ్మినేని సీతారామ్‌, డిప్యూటీ స్పీకర్‌గా పీడిక రాజన్న దొరను నియమించనున్నట్లు సమాచారం. ఇవాళ మధ్యాహ్నం తమ్మినేని సీతారామ్‌, రాజన్నదొర ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస నియోజకవర్గం నుంచి తమ్మినేని ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ప్రొటెం స్పీకర్‌గా శంబంగి వెంకట చిన అప్పలనాయుడును నియామకం కూడా దాదాపు ఖరారైంది. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం నుంచి అప్పలనాయుడు గెలుపొందారు.
* కాంగ్రెస్ పార్టీ విలీన పక్రియ పూర్తి
టీఆర్‌ఎస్‌లో తెలంగాణ కాంగ్రెస్‌ లెజిస్లేటివ్‌ పార్టీ విలీన ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు గురువారం రాత్రి శాసనసభ కార్యదర్శి డాక్టర్‌ వి. నరసింహా చార్యులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయం నేటి నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ లెజిస్లేటివ్‌ పార్టీకి చెందిన 12 మంది సభ్యులు అభ్యర్థన మేరకు విలీన ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసినట్టు ప్రకటనలో తెలిపారు. రాజ్యాంగం 10వ షెడ్యూల్‌ సబ్‌-పేరా(2)లోని నిబంధనలు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేల కోరిక మేరకు విలీనం చేసినట్టు వివరించారు. ఈ 12 మంది ఎమ్మెల్యేలు ఇక నుంచి శాసనసభలో టీఆర్‌ఎస్‌ సభ్యులతో కలిసి కూర్చుంటారని తెలిపారు. 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వతంత్రుల చేరికతో అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌ బలం 102కు చేరింది. కాగా, విలీనంపై న్యాయపోరాటం చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. ఎమ్మెల్యేల కొనుగోలుపై లోక్‌పాల్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపింది. తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో కలిసిపోవడంతో శాసనసభలో కాంగ్రెస్‌ ప్రతిపక్ష హోదా కోల్పోయింది. కాంగ్రెస్‌ పార్టీకి ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు.
* బీజేపీకి షాకిచ్చిన సినీ నటి సుమలత.
మాండ్యా ఎంపీ, సినీ నటి సుమలత, బీజేపీకి షాకిచ్చారు. సుమలత త్వరలో కమలదళంలో చేరబోతున్నా రంటూ జరుగుతున్న ప్రచారాన్ని సుమలత ఖండించారు. బీజేపీలో చేరే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. స్వతంత్ర ఎంపీగా కొనసాగుతానని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో JDSతో చేతులు కలపకుండా పోటీ చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీ మరిన్ని స్థానాలు గెలిచి ఉండేదన్నారు. JDSతో పొత్తు చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీసిందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసి ఉంటే కనీసం 10 లోక్‌సభ నియోజకవర్గాల్లో గెలిచి ఉండేదన్నారు. కర్ణాటకలో BJPకి అత్యధిక స్థానాలు రావడంపై స్పందించిన సుమలత, ప్రజాబలంతో బీజేపీ గెలిచినట్లుగా తాను భావించడం లేదన్నారు.
* టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనం సంపూర్ణం
టీఆర్‌ఎస్‌లో సీఎల్పీ విలీన ప్రక్రియ పూర్తైంది. విలీన ప్రక్రియ సంపూర్ణమైనట్టు శాసనసభ సచివాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. సీఎల్పీని విలీనం చేయాలని కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలు ఇవాళ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించారు. దానిపై సానుకూలంగా స్పందించి.. టీఆర్‌ఎస్‌లో సీఎల్పీని విలీనం చేశారు. సీఎల్పీ విలీనంపై శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు బులిటెన్ జారీ చేశారు. దీంతో శాసనసభలో టీఆర్‌ఎస్ బలం 103కు చేరింది.స్పీకర్‌ను కలిసిన ఎమ్మెల్యేల్లో సబితా ఇంద్రారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ఆత్రం సక్కు, హరిప్రియ, జాజుల సురేందర్‌, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, సుధీర్‌ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, రేగ కాంతారావు, పైలట్‌ రోహిత్‌ రెడ్డి, కందాల ఉపేందర్‌ రెడ్డి, చిరుమర్తి లింగయ్య ఉన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో పని చేయడానికి 12 మంది ఎమ్మెల్యేలం సిద్ధంగా ఉన్నామని పిరాయింపు ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. తమ నిర్ణయాన్ని కూడా ప్రజలు సంపూర్ణంగా ఆమోదించారని ఆయన తెలిపారు.
* ఈ ఎన్నికల్లో అది నిరూపితమైంది – పవన్ కళ్యాణ్
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ఓటమిపై రివ్యూ చేశారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌. గురువారం మంగళగిరిలో ఆయన పార్టీ నేతలతో సమీక్షా సమవేశం జరిపారు. ఈ ఓటమి తమకు ఓ అనుభవన్నారాయన. నాలుగేళ్ల పార్టికీ లక్షలాదిమంది ఓటు వేయడాన్ని ఓ విజయంగా భావిస్తున్నట్లు తెలిపారు. అయితే పార్టీని ఎదగనీయకుండా.. కొన్ని బలమైన శక్తులు పనిచేయడం వల్లే ఓడిపోయామన్నారు…జనసేనకు బలమైన క్యాడర్‌తో పాటు జనబలం కూడా ‌ ఉందని… ఈ ఎన్నికల్లో నిరూపితమైందన్నారు పవన్ కల్యాణ్. ఆ బలాన్ని పార్టీ కోసం వినినియోగించడమే ప్రస్తుత కర్తవ్యమని నేతలకు సూచించారు. తుది శ్వాస ఉన్నంత వరకు పార్టీని ముందుకు తీసుకెళ్తామన్నారు. గాజువాక, భీమవరం రెండు చోట్ల పోటీ చేసినప్పటికి సమయాభావం వల్ల ఏ నియోజకవర్గంలోనూ పూర్తిస్థాయిలో ఓటర్లను కలుసుకోలేకపోయామన్నారు పవన్‌..ఇక ప్రస్తుతం ఉన్న రాజకీయవ్యవహారాల కమిటీ కాల పరిమితి ముగియడంతో కొద్దిరోజుల్లోనే కొత్త కమిటిని నియమిస్తామన్నారు పవన్‌. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని మరో కమిటీ కూడా నియమిస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలు, ప్రణాళికలు అభ్యర్ధుల ఎంపి వంటివాటిపై దృష్టిపెడతామన్నారు పవన్‌ కల్యాణ్‌.
* ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా తమ్మినేని సీతారాం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా ఆముదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం నియమితులు కబ్స్లోతున్నారు. ఇప్పటికే సీఎం జగన్ కలిసిన తమ్మినేనికి స్పష్టమైన ఆదేశాలు అందినట్టు సమాచారం. అయితే స్పీకర్ రేసులో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద్ రావులు ఉన్నప్పటికీ సీఎం జగన్ తమ్మినేని వైపే మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. సీనియర్ ఎమ్మెల్యేగా గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం తమ్మినేని సీతారాంకు ఉంది.కాళింగ సామాజికవర్గానికి చెందిన తమ్మినేని ఐదుసార్లు ఆముదాలవలస నియోజకవర్గంనుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడుసార్లు టీడీపీ నుంచి ఒకసారి స్వతంత్రంగా తాజాగా వైసీపీనుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 9ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేశారు. శ్రీకాకుళం జిల్లాలో కీలకమైన కాళింగ సామాజిక వర్గానికి కీలక పదవి ఇవ్వాలన్న ఉద్దేశ్యంతోనే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
* మంత్రివర్గ ఏర్పాటులో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఏర్పాటులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఎవరూ ఊహించని విధంగా ఒకరిద్దరు కాదు ఏకంగా ఐదుగుర్ని డిప్యూటీ సీఎంలుగా నియమించేందుకు జగన్ సిద్ధమయ్యారు. శుక్రవారం ఉదయం వైసీపీఎల్పీ సమావేశంలో జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పించాలని సీఎం నిర్ణయించారు. ఈ ఐదుగురిలో వైసీపీ సీనియర్ నేత, పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేరు దాదాపు ఖరారు కాగా.. మిగిలిన నలుగురు ఎవరనేది తెలియాల్సి ఉంది.
* గవర్నర్‌తో చంద్రబాబు భేటీ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అయ్యారు. ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌కు చేరుకున్న చంద్రబాబు.. గవర్నర్‌ను కలిసి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. ఇవాళ, రేపు హైదరాబాద్‌లో ఉండనున్న చంద్రబాబు పార్టీ నేతలతో సమావేశంకానున్నారు. గురువారం రాత్రి చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు నారా లోకేశ్‌ హైదరాబాద్‌ చేరుకున్న విషయం తెలిసిందే.
* ఊహాగానాలకు తెర.. బీజేపీకి షాకిచ్చిన మండ్య ఎంపీ సుమలత
మండ్య నుంచి ఎంపీ, సినీ నటి సుమలత బీజేపీలో చేరబోతున్నట్లు వెలువడుతున్న ఊహాగానాలకు గురువారం తెరదించారు. పార్లమెంట్‌లో తాను స్వతంత్ర ఎంపీగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. బీజేపీలో చేరే ఆలోచన లేదన్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎ తో చేతులు కలుపకుండా కాంగ్రెస్‌ ఒంటరిగా బరిలోకి దిగివుంటే మరిన్ని లోక్‌సభ స్థానాల్లో విజయం లభించివుండేదన్నారు.
*మమతకు ప్రశాంత్‌ కిశోర్‌ సలహాలు
పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ సలహాదారునిగా వ్యవహరించనున్నారు. వారిరువురు గురువారం ఇక్కడ రెండు గంటల పాటు సమావేశమయ్యారు. ‘ఎన్నికల విజయం’ ప్యాకేజీపై సంతకాలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో భాజపాను అడ్డుకునేందుకు ప్రశాంత్‌ కిశోర్‌ సహాయం తీసుకోవాలని మమత నిర్ణయించారు. 2014లో మోదీ, 2015లో నీతీశ్‌ల గెలుపునకు ఆయన సహకారం అందించారు. 2017లో ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు సలహాలు ఇచ్చినా అవి ఫలించలేదు.
*ఎమ్మెల్సీ పదవికి కరణం బలరాం రాజీనామా
శాసనమండలి సభ్యత్వానికి తెదేపా నేత కరణం బలరాం రాజీనామా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుంచి తెదేపా తరఫున ఆయన పోటీచేసి విజయం సాధించారు. దీంతో శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేస్తూ లేఖను గురువారం శాసనసభ కార్యదర్శి సత్యనారాయణరావుకి సమర్పించారు.
*వచ్చే ఎన్నికల్లో పోటీచేయను
‘కాబోయే మంత్రి అంటూ మీరంతా నినాదాలు చేయవద్దు.. నేను మంత్రిని కాను.. కావాలనే ఆశ కూడా లేదు. ప్రజలు ఇచ్చిన ఎమ్మెల్యే హోదా మంత్రి పదవి కంటే పెద్దది’ అని తిరుపతి శాసన సభ్యుడు భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. తిరుపతి నగర పరిధి కొర్లగుంటలోని డీపీఆర్‌ కల్యాణ మండపంలో గురువారం నిర్వహించిన వైకాపా సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడూ ఏ పనికోసం అబద్దం చెప్పలేదని అన్నారు.
*కాంగ్రెస్‌ ఖల్లాస్‌
తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్‌ గల్లంతైంది. ఆ పార్టీ శాసనసభా పక్షం తెలంగాణ రాష్ట్రసమితి శాసనసభాపక్షంలో విలీనమైంది. ఈమేరకు ఆ పార్టీకి చెందిన 12 మంది శాసనసభ్యులు గురువారం మధ్యాహ్నం శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిని కోరారు. దీనిని పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పిన ఆయన సాయంత్రానికి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో శాసనసభలో కాంగ్రెస్‌ విపక్ష హోదా కోల్పోయింది. ఆ పార్టీకి ఆరుగురు సభ్యులే మిగిలారు. వీరు సాధారణ సభ్యులుగా కొనసాగుతారు. 12 మంది సభ్యుల విలీనంతో సభలో తెరాస బలం 103కు (నామినేటెడ్‌ సభ్యునితో కలిపి)పెరిగింది.
*కేసీఆర్‌ నాయకత్వంలో పనిచేస్తా
నియోజకవర్గ అభివృద్ధి కోసమే తెరాసలో చేరుతున్నట్లు వికారాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు, తాండూరు శాసనసభ్యుడు రోహిత్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, నవీన్‌రావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ నాయకత్వంలో పని చేస్తానని రోహిత్‌రెడ్డి చెప్పగా కేటీఆర్‌ అభినందించారు. తాను ఆది నుంచి తెరాస సైనికుడినేనని, అనుకోని పరిస్థితుల వల్ల పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరాల్సి వచ్చిందన్నారు.
*అన్ని సంఘాల్లోనూ అమిత్‌ షా
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 8 కేబినెట్‌ కమిటీల్లోనూ ప్రధాని మోదీకి అత్యంత విశ్వాసపాత్రుడిగా గుర్తింపు పొందిన హోంమంత్రి అమిత్‌షాకు చోటు దక్కింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పార్లమెంటరీ వ్యవహారాల కమిటీకి నేతృత్వం వహిస్తారు. పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ తప్పించి చాలా వాటికి ప్రధాని మోదీ నాయకత్వం వహిస్తారు. ముందుగా.. కొన్ని కమిటీల్లో రాజ్‌నాథ్‌ పేరు కనిపించలేదు. తర్వాత ప్రభుత్వం సవరించిన జాబితాను కేబినెట్‌ సెక్రటేరియట్‌ వెబ్‌సైట్‌లో ఉంచింది. కేబినెట్‌ నియామకాల కమిటీలో ప్రధానిమోదీ, అమిత్‌షా మాత్రమే ఉండనున్నారు.
*ఈ ఓటమి ఒక అనుభవం
సార్వత్రిక ఎన్నికల ఫలితాన్ని ఓటమిగా కాక ఒక అనుభవంగా తీసుకుంటున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ చెప్పారు. నాలుగేళ్ల పార్టీకి ఇన్ని లక్షల ఓట్లు రావడాన్ని ఒక విజయంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. జనసేనను ఎదగనివ్వకూడదని కొన్ని బలీయమైన శక్తులు పని చేయడంతో ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు చూడాల్సి వచ్చిందన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో మాట్లాడారు. జనసేనకు ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ పార్టీ తీర్మానం ఆమోదించింది.
*స్థానిక సమస్యలపై పోరాడదాం
ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ పోరాటాలు చేయాలని, పార్టీ కార్యకర్తలపై అధికారపక్షానికి చెందినవారు దాడులకు, దౌర్జన్యాలకు పాల్పడితే దీటుగా ఎదుర్కోవాలని తెదేపా నిర్ణయించింది. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు గురువారం తన నివాసంలో… అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలు కొందరితో సమావేశమయ్యారు. పార్టీ భవిష్యత్‌ కార్యాచరణ, శాసనసభ సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహం తదితరాలపై చర్చించారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలపై మాత్రం ఎప్పటికప్పుడు స్పందించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. కార్యకర్తలకు అండగా నిలవాలని, వారిపై ఎక్కడ దాడులు జరిగినా వెంటనే స్పందించాలని పార్టీ నాయకుల్ని చంద్రబాబు ఆదేశించారు.
*కాంగ్రెస్‌లో కోవర్టులున్నారు
కాంగ్రెస్‌ పార్టీ గుర్తుపై గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు తెరాసలో చేరి ఏం సాధిస్తారని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు నిలదీశారు. ఆయన గురువారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ, తెరాస శాసనసభాపక్షంలోకి కాంగ్రెస్‌ శాసనసభాపక్షం విలీనమైతే కాంగ్రెస్‌ కార్యకర్తలందరూ తలదించుకుంటారన్నారు. పార్టీ విధేయులను అధిష్ఠానం విస్మరించడం, అమ్ముడుపోయేవారికి టికెట్లు కట్టబెట్టడంతోనే కాంగ్రెస్‌లో ఇలాంటి పరిస్థితి తలెత్తిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో కోవర్టులు ఉన్నారని ఎప్పటినుంచో చెబుతున్నానని, వాళ్ల పేర్లతో త్వరలోనే సోనియాగాంధీతో సమావేశమవుతానని వెల్లడించారు.
*స్థానిక సమస్యలపై పోరాడదాం
ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ పోరాటాలు చేయాలని, పార్టీ కార్యకర్తలపై అధికారపక్షానికి చెందినవారు దాడులకు, దౌర్జన్యాలకు పాల్పడితే దీటుగా ఎదుర్కోవాలని తెదేపా నిర్ణయించింది. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు గురువారం తన నివాసంలో… అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలు కొందరితో సమావేశమయ్యారు. పార్టీ భవిష్యత్‌ కార్యాచరణ, శాసనసభ సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహం తదితరాలపై చర్చించారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలపై మాత్రం ఎప్పటికప్పుడు స్పందించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. కార్యకర్తలకు అండగా నిలవాలని, వారిపై ఎక్కడ దాడులు జరిగినా వెంటనే స్పందించాలని పార్టీ నాయకుల్ని చంద్రబాబు ఆదేశించారు.
*డిప్యూటీ స్పీకర్‌’ ఇవ్వండి: శివసేన
ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో ఒకేఒక్క మంత్రి పదవి పొందిన శివసేన తాజాగా లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ పదవిని కూడా ఆశిస్తోంది. ఇదే విషయాన్ని భాజపా దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు శివసేన నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌రౌత్‌ తెలిపారు. తమ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రేతో పాటు 18 మంది లోక్‌సభ ఎంపీలు వచ్చే వారం అయోధ్యను సందర్శించనున్నట్లు చెప్పారు.
*హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో 200మంది బీసీ అభ్యర్థుల పోటీ: కృష్ణయ్య
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 22 శాతానికి తగ్గించడాన్ని నిరసిస్తూ హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో 200మంది బీసీ అభ్యర్థులను బరిలోకి దింపుతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. ఆయన గురువారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ, 14 బీసీ సంఘాల నిర్ణయం మేరకు ఈ భారీ పోటీకి రంగం సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో జరగాల్సిన మండలాధ్యక్షుల, జిల్లా పరిషత్‌ ఛైర్మన్ల ఎన్నికల్లో బీసీలకు 50 శాతం స్థానాలు కేటాయించాలని ఆయన డిమాండ్‌ చేశారు.
*తెలంగాణలో పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ
తెలంగాణలో కాంగ్రెస్‌ తరఫున గెలిచిన శాసనసభ్యులను తెరాసలో చేర్చుకోవడం.. పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లుగా ఉందని ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్‌ ఖేరా విమర్శించారు. ఏఐసీసీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను అప్రజాస్వామికంగా తెరాసలో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు.
*మమతకు ప్రశాంత్‌ కిశోర్‌ సలహాలు
పశ్చిమ బెంల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ సలహాదారునిగా వ్యవహరించనున్నారు. వారిరువురు గురువారం ఇక్కడ రెండు గంటల పాటు సమావేశమయ్యారు. ‘ఎన్నికల విజయం’ ప్యాకేజీపై సంతకాలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో భాజపాను అడ్డుకునేందుకు ప్రశాంత్‌ కిశోర్‌ సహాయం తీసుకోవాలని మమత నిర్ణయించారు. 2014లో మోదీ, 2015లో నీతీశ్‌ల గెలుపునకు ఆయన సహకారం అందించారు. 2017లో ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు సలహాలు ఇచ్చినా అవి ఫలించలేదు.
*చంద్రబాబు, లోకేశ్‌ ప్రయాణిస్తున్న విమానం దారి మళ్లింపు
తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ ప్రయాణిస్తున్న విమానాన్ని ప్రతికూల వాతావరణం నేపథ్యంలో గురువారం రాత్రి దారి మళ్లించారు. కొద్ది గంటల ఆలస్యంగా వారు సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నారు. గురువారం సాయంత్రం 7.20 గంటలకు ఎయిర్‌ఇండియా విమానం విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరింది. ఇందులో చంద్రబాబు, లోకేశ్‌తోపాటు 130 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం హైదరాబాద్‌ మీదుగా దిల్లీ వెళ్లాల్సి ఉంది. వాతావరణం సరిగా లేకపోవడంతో విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. రాత్రి 9.20 గంటలకు విమానం అక్కడకు చేరుకుంది. చంద్రబాబు, లోకేశ్‌, ప్రయాణికులు కొద్దిసేపు అక్కడే వేచి ఉన్నారు. వాతావరణం అనుకూలించాక రాత్రి 10.30 గంటల సమయంలో తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లారు.