నిన్నమొన్నటి దాకా ఎక్కడ చూసినా నోరూరిస్తూ, కవ్వించిన హలీం రంజాన్ మాసం ముగియడంతో మాయమయింది. ‘అయ్యో.. అప్పుడే రంజాన్ నెల ముగిసిందా, హలీం తినాలంటే మళ్లీ ఏడాది దాకా ఆగాల్సిందేనా..’ అని ఈ సందర్భంలో మాంసప్రియులు అనుకోవడం సహజమే. అయితే.. ఇక ఆ ఆందోళన అవసరం లేదంటున్నారు జాతీయ మాంస పరిశోధన కేంద్రం (ఎన్ఆర్సీఎం) శాస్త్రవేత్తలు. ప్రస్తుతం ప్రాసెస్డ్ హలీంపై పరిశోధనలు చేస్తున్నామని, అది పూర్తయితే ఎప్పుడు తినాలనిపించినా నిమిషాల్లో ఇంట్లోనే హలీం చేసుకోవచ్చని చెబుతున్నారు. ఎక్కువ రోజులు పాడవకుండా ఉండేలా.. బ్యాక్టీరియా లేకుండా రెడిమేడ్ హలీంను స్టెరైల్ ప్యాకింగ్ చేయనున్నారు. రిఫ్రిజిరేటర్ అవసరం లేకుండా మాములుగానే రెండు నుంచి మూడు నెలల పాటు ప్రాసెస్డ్ హలీం నిల్వ ఉండేలా పరిశోధనలు చేస్తున్నారు. హలీం తయారు చేయాలంటే సుమారు ఆరు, ఏడు గంటలపాటు మాంసాన్ని రుబ్బాల్సి ఉంటుంది. ఇది శ్రమతో కూడుకున్న పనికావడంతో సాధారణ రోజుల్లో హలీం తయారీకి వ్యాపారులు ముందుకు రావడం లేదు. ఇకపై ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, మానవ శ్రమతో పనిలేకుండా, మాంసాన్ని రుబ్బేందుకు అవసరమైన యంత్రాలను తయారు చేసే పనిలో ఎన్ఆర్సీఎం నిమగ్నమైంది. పరిశోధనలన్నీ పూర్తిచేసి వచ్చే ఏడాదిలోగా ప్రాసెస్డ్ హలీంను అందుబాటులోకి తెస్తామని ఎన్ఆర్సీఎం శాస్త్రవేత్త ఒకరు తెలిపారు.
ఇక ఏడాది పొడవునా ప్యాకెట్లలో హాలీం
Related tags :