జగన్ మంత్రివర్గంలో రోజాకు చోటు దక్కలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రోజాకు కచ్చితంగా మంత్రి పదవి దొరకుతుందని ఆమె అనుచరులు గట్టిగానే ప్రచారం చేస్తూ వస్తున్నారు.
కేవలం ప్రచారం మాత్రమే కాదు… ఏకంగా మహిళా కోటాలో హోంమంత్రి పదవే దక్కనుందని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది.
కేబినెట్ కూర్పు జరిగే చివరి నిమిషాల వరకు కూడా రోజా ఈసారి కచ్చితంగా మంత్రి అవుతారని అందరూ నమ్ముతూ వచ్చారు.
కానీ చివరి నిమిషంలో కేబినెట్ కూర్పులో ఆమె పేరు కనిపించక పోవడంతో అందరూ షాక్‌కు గురయ్యారు.
మరోవైపు కేబినెట్‌లో ఒక ముస్లిం, ఏడుగురు బీసీలు, ఐదుగురు ఎస్సీలు, నలుగురు కాపులు, నలుగురు రెడ్లు, ఒక ఎస్టీ, ఒక కమ్మ, ఒక క్షత్రియ, ఒక వైశ్య వర్గానికి చోటు కల్పించారు.
ఇక బ్రాహ్మణ వర్గానికి డిప్యూటీ స్పీకర్ పదవి వరించింది. దీంతో అన్ని సామాజిక వర్గాల వారికి మంత్రివర్గంలో చోటు దక్కినట్లేనని, తాము సమతౌల్యత పాటించామని వైసీపీ వర్గాలు అంటున్నాయి.
అయితే బీసీలకు మాత్రం మంత్రివర్గంలో అధిక ప్రాధాన్యతను కల్పించారు.
మరోవైపు శనివారం ఉదయం వరకూ ఏవైనా అనూహ్య పరిణామాలు సంభవించి తమ తమ నేతలకు బెర్తులు లభించే అవకాశాలున్నాయని కార్యకర్తలు, అనుచరులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.