చైనాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం హువావేపై అమెరికా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత నిషేధాన్ని 90 రోజుల పాటు సడలిస్తున్నట్లు ప్రకటించింది. దీని ప్రకారం భవిష్యత్‌లో అమెరికా కంపెనీలేవీ హువావేకు ఎలాంటి సహకారం అందించవు. ముఖ్యంగా గూగుల్ సేవలేవీ హువావేకు అందవు. అయితే, ఈ నిషేధంతో సెర్చింజన్ దిగ్గజం భయపడిందా? అందుకే ఇప్పుడు కొత్త పాట పాడుతోందా? అంటే నివేదికలు అవుననే చెబుతున్నాయి. హువావేపై నిషేధం కారణంగా లాభం కన్నా నష్టమే ఎక్కువని గూగుల్ భావిస్తోందట. అందుకే హువావేపై విధించిన నిషేధం నుంచి తమకు మినహాయింపునివ్వాలని ట్రంప్ సర్కారును అభ్యర్థిస్తోంది. ఇటీవల ప్రభుత్వం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిషేధం నుంచి గూగుల్‌కు మినహాయింపు ఇవ్వాలని గట్టిగా కోరింది. ఇందుకు కారణాలను కూడా ప్రభుత్వం ముందు ఉంచింది. నిషేధం నేపథ్యంలో హువావే ‘టైటాన్’ పేరు ఓ కొత్త ఓఎస్‌పై ఇప్పటికే కసరత్తులు చేస్తోంది. ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ అయినప్పటికీ నిషేధం కారణంగా గూగుల్ అందించే సేవలైన ప్లేస్టోర్, జీ-మెయిల్, యూట్యూబ్ వంటి సేవలు అందుబాటులోకి రావు. ఇక హువావే ఫోన్లలో ప్రీ-ఇన్‌స్టాల్‌గా తమ యాప్ అందుబాటులో ఉండదని తాజాగా ఫేస్‌బుక్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్‌కు పోటీగా ‘టైటాన్’ ఓఎస్‌ను హువావే తయారు చేస్తోంది. అత్యాధునిక ఫీచర్లతో ఇది రాబోతున్నట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. దీంతో గూగుల్ వెన్నులో ఒక్కసారిగా వణుకు పుట్టింది. ‘టైటాన్’ కనుక సక్సెస్ అయితే, ప్రపంచవ్యాప్తంగా తన ఏకఛత్రాధిపత్యానికి ఎక్కడ గండిపడుతోందనన్న ఆందోళన గూగుల్‌లో మొదలైంది. దీంతో హువావేపై నిషేధం విధించడం వల్ల తమకే అత్యధిక నష్టం కలిగే అవకాశం ఉందని గూగుల్ భావిస్తోందట. ఇదే విషయాన్ని ట్రంప్ సర్కారు ముందుంచింది. ఆండ్రాయిడ్ ఓఎస్ సహా, ఇతర సేవల కోసం హువావే గూగుల్‌పై ఆధారపడటం అమెరికాకు లాభించే విషయమని ప్రభుత్వానికి వివరించింది. ఇప్పటికే చైనాకు చెందిన అన్ని మొబైల్ కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్ కోసం గూగుల్ తయారు చేసిన ఆండ్రాయిడ్ ఓఎస్‌ను వినియోగిస్తున్నాయి. ఈ ఓఎస్‌ను రెండు రకాలుగా విభజిస్తారు. ఒకటి అంతర్జాతీయంగా విడుదల చేసే మొబైల్స్‌కు గూగుల్ అందించే అన్ని యాప్స్‌ను యాక్సెస్ చేసుకునే వెసులుబాటునిస్తారు, మరో వెర్షన్ కేవలం చైనాకు సంబంధించిన యాప్స్‌ను మాత్రమే వినియోగించేలా తయారు చేస్తారు. ఒకవేళ చైనాతో అమెరికా సంబంధాలు పూర్తిగా దెబ్బతింటే ఈ ఫోన్లకు సంబంధించిన భద్రత, అప్‌డేట్స్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని గూగుల్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోపక్క హువేవాపై నిషేధం కారణంగా అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌కు చైనాలో అమెరికా టెక్నాలజీ సంస్థల సేవలు నిలిచిపోతాయి. ఇది వ్యాపారపరంగా ఆయా కంపెనీలకు నష్టం కలిగించే అంశం. ఇందులో క్వాల్కమ్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, యూకేకు చెందిన చిప్ డిజైనర్ ఏఆర్‌ఎం సహా పలు కంపెనీలు ఉన్నాయి. మరి గూగుల్ అభ్యర్థనపై ట్రంప్ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కాలమే నిర్ణయిస్తుంది.
గూగుల్‌కు బెండు పెట్టనున్న హూవేయి “టైటాన్”
Related tags :