1. పంచప్రయాగలు చూసొద్దాం రండి – తదితర ఆద్యాత్మిక వార్తలు
రిషీకేశ్ నుండి బదరీనాథ్ వెళ్ళేదారిలో భక్తులు ఐదు ప్రయాగ లను చూస్తారు. లోగడ నేను పంచకేదార్ లను వివరించడం జరిగింది. ఇపుడు పంచప్రయాగలను చూద్దాము. రిషీకేశ్ నుండి బయలుదేరగానే 1. దేవప్రయాగ 2.రుద్రప్రయాగ 3.నందప్రయాగ 4. కర్ణప్రయాగ 5. విష్ణుప్రయాగ లు వరుసగా వస్తాయి. రిషీకేశ్ నుండి వాటి దూరాలు
1. దేవప్రయాగ : 70 కి.మీ.
2. రుద్రప్రయాగ : 140 కి.మీ.
3. కర్ణప్రయాగ : 169 కి.మీ.
4. నందప్రయాగ : 190 కి.మీ.
5. విష్ణుప్రయాగ : 256 కి.మీ.
1. దేవప్రయాగ : కుబేరుని పట్టణమైన అలకాపురి నుండి వచ్చే అలకనంద మరియు గంగోత్రినుండి వచ్చే భాగీరథీ నదుల సంగమం. ఇక్కడ రఘునాథ్ మందిరమున్నది. దీనిని విధిగా దర్శించాలి. శ్రీరాముడు ఇక్కడ అశ్వమేధయాగం చేసిన ప్రదేశం.
2. రుద్రప్రయాగ : మందాకినీ , అలకనందా నదులసంగమం. ఇక్కడ రుద్రనాథమందిరం, చాముండాదేవి ఆలయం ఉన్నాయి. శంకరుడు నారదునకు సంగీతం నేర్పిన ప్రదేశమిది. శంకరుడు వీణానాదాన్ని( రుద్రవీణ) ఆలపించిన చోటు.
3. కర్ణప్రయాగ : అలకనంద మరియు పిండారీ నదులసంగమం. కర్ణుడు తపమాచరించి శంకరుని ప్రసన్నం చేసుకున్న ప్రదేశం. స్వామివివేకానంద ఇక్కడ 18రోజులు తపమాచరించాడు. ఇక్కడ ఉమాదేవి ఆలయము ఉన్నది.
4. నందప్రయాగ : అలకనంద మరియు నందాకినీ నదులసంగమం. నందుడు యజ్ఞమాచరించిన ప్రదేశం. నందగోపాలుని మందిరమిక్కడ ఉన్నది. కణ్వాశ్రమము ఇక్కడనే ఉండెడిది. దుష్యంతుడు, శకుంతలల వివాహస్థలమిదియే. శ్రీకృష్ణుడు పెరిగిన నందుని ఊరు ఇదియే.
5. విష్ణుప్రయాగ : అలకనంద మరియు ధౌళిగంగ ల సంగమమిదియే. నారదుడు విష్ణు భగవానునికై తపమాచరించిన ప్రదేశమిది. ఇచట విష్ణ్వాలయము మరియు సంగమం వద్ద విష్ణు కుండము ఉన్నాయి.
2. తితిదే సభ్యత్వానికి సుధానారాయణమూర్తి రాజీనామా
తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యురాలి పదవికి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ సుధానారాయణమూర్తి రాజీనామా చేశారు. ఈ మేరకు తితిదే ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ శుక్రవారం ధ్రువీకరించారు. గత ఏడాది మే నెలలో ఆమె రెండోదఫా తితిదే సభ్యురాలిగా నియమితులయ్యారు. అంతకుముందు ధర్మకర్తల మండలిలో కేవలం రెండు నెలలు మాత్రమే ఉన్నారు. దీంతో రెండోసారి మరో అవకాశమిస్తూ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో.. పొట్లూరి రమేష్‌బాబు, చల్లా రామచంద్రారెడ్డి, రుద్రరాజు పద్మరాజు, రాయపాటి సాంబశివరావు, బి.కె.పార్థసారథి, బొండా ఉమామహేశ్వరరావు, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావులు ఇప్పటికే తమ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. శ్రీవారి సన్నిధిలో పదవీభాగ్యాన్ని వదులుకోవడం భావ్యం కాదంటూ.. తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పుట్టా సుధాకర్ యాదవ్‌తో పాటు మరికొందరు సభ్యులు నేటికీ కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈ మండలిని రద్దు చేసి నూతన మండలి ఏర్పాటు చేసే సన్నాహాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.
3. అన్నప్రసాదం ట్రస్టుకు రూ.1,100 కోట్ల డిపాజిట్లు
శ్రీవేంకటేశ్వర నిత్య అన్నప్రసాదం ట్రస్టు అధీనంలో రూ.1,100 కోట్ల డిపాజిట్లు ఉన్నట్లు తితిదే ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ వెల్లడించారు. ట్రస్టు ఆర్థిక వ్యవహారాలపై తితిదే ఈవో తిరుమలలో శుక్రవారం తిరుమల, తిరుపతి జేఈవోలు శ్రీనివాసరాజు, లక్ష్మీకాంతంతో కలిసి సమీక్షించారు. ‘‘నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో అన్నప్రసాదానికి అయ్యే వ్యయమూ పెరుగుతోంది. గతంలో ఒకరోజు విరాళం పథకం కింద అన్నప్రసాదం వితరణకు రూ.26లక్షల వ్యయం అయ్యేది. ఇటీవలి ఆడిట్ ప్రకారం అది రూ.30లక్షలకు పెరిగింది. ఇకపై విరాళాలు ఇవ్వదలచిన దాతలు ఉదయం అల్పాహారం కోసం రూ.7 లక్షలు, మధ్యాహ్నం భోజనానికి రూ.11.50 లక్షలు, రాత్రి భోజనానికి రూ.11.50 లక్షలు వంతున ఇస్తే వారి పేరుతో భక్తులకు అన్నప్రసాదం వడ్డించనున్నాం’’ అని ఈవో వివరించారు. రూ.లక్షకు పైగా విరాళాలు అందించిన దాతలు 37,169 మంది ఉన్నట్లు గుర్తుచేశారు. ఇది వరకు ఎన్నడూలేనంతగా రికార్డు స్థాయిలో 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.140కోట్ల విరాళాలు వచ్చినట్లు తెలిపారు. సమావేశంలో తితిదే ఆర్థిక సలహాదారు ఒ.బాలాజీ, సీఏవో రవిప్రసాద్, మార్కెటింగ్ అధికారి జగదీశ్వరరెడ్డి, క్యాటరింగ్ అధికారి జీఎల్‌ఎన్ శాస్త్రి పాల్గొన్నారు.
4. ఆన్‌లైన్‌లో 70,918 శ్రీవారి సేవా టిక్కెట్లు
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించి 70,918 టిక్కెట్లను శుక్రవారం ఉదయం పది గంటలకు విడుదల చేసినట్లు తితిదే ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ వెల్లడించారు. సెప్టెంబరులో స్వామివారి సేవలో పాల్గొనేందుకు వీలుగా.. ఆన్‌లైన్ డిప్ విధానంలో 10,618 సేవా టిక్కెట్లు విడుదల చేయగా.. ఇందులో సుప్రభాతం 7,898, తోమాల 120, అర్చన 120, అష్టదళ పాదపద్మారాధన 180, నిజపాద దర్శనం 2,300 టిక్కెట్లు ఉన్నాయి. ఆన్‌లైన్ జనరల్ కేటగిరిలో 60,300 టిక్కెట్లు జారీ చేయగా వీటిలో విశేష పూజ 2000, కల్యాణోత్సవం 13,775, ఊంజలసేవ 4,350, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,975, వసంతోత్సవం 15,400, సహస్ర దీపాలంకరణ సేవ 16,800 టిక్కెట్ల చొప్పున ఉన్నాయి. తితిదే స్థానిక ఆలయాల ఆర్జిత సేవాటిక్కెట్లతో పాటు శ్రీవారి సేవ, పరకామణి సేవ, లడ్డూ ప్రసాదసేవ, పీడబ్ల్యూఎఫ్‌ఎస్ ఆన్‌లైన్ సెప్టెంబరు కోటాను కూడా విడుదల చేశారు. రూ.300 టిక్కెట్లను మాత్రం ఈనెల 11న విడుదల చేస్తామని ఈవో వెల్లడించారు.
5. వేములవాడకు పోటెత్తిన భక్తులు
మరో 4 రోజుల్లో వేసవి సెలవులు ముగుస్తుండడంతో వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఇవాళ భక్తులతో రద్దీగా కనిపించింది. వేకువజాము నుంచే భక్తులు ధర్మగుండంలో స్నానాలు ఆచరించి కోడెమొక్కు తీర్చుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ఆర్జితసేవలను నిలిపివేశారు. వివిధ టిక్కెట్ల ద్వారా రాజన్నకు సుమారు రూ.7 లక్షల ఆదాయం సమకూరినట్లు, దాదాపు 8 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
6. తిరుమల సమాచారం
ఓం నమో వేంకటేశాయ!!
ఈ రోజు శనివారం.
08.06.2019
ఉదయం 5 గంటల
సమయానికి,
తిరుమల: 24C° – 34℃°
నిన్న 79,703 మంది
భక్తుల కు కలియుగ దైవం
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కల్గినది,
స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లో గదులన్నె
భక్తులతో నిండినది, వెలుపల
వేచి ఉన్నారు,
ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
20 గంటలు పట్టవచ్చును, నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
₹: 2.82 కోట్లు,
శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
నాలుగు గంటల సమయం
పట్టవచ్చును,
వయోవృద్దులు మరియు దివ్యాంగుల
ప్రత్యేయకంగా ఏర్పాటు
చేసిన కౌంటర్ ద్వారా
ఉ: 10 గంటలకి (750)
మ: 2 గంటలకి (750)
ఇస్తారు,
చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు
సుపథం మార్గం గుండా శ్రీవారి
దర్శనానికి అనుమతిస్తారు
ఉ: 11 గంటల నుంచి
సాయంత్రం 5 గంటల వరకు
దర్శనానికి అనుమతిస్తారు,
గమనిక:
విద్యా సంస్థల పునః ప్రారంభం నేపద్యంలో భారీ రద్దీ, సర్కారీ సహస్ర కళాశాభిషేకం కూడా ఉండటం వల్ల రేపు (9న) ప్రత్యేక దర్శనాలు రద్దు, మూడుగంటల సేపు సర్వదర్శనం కూడా ఉండదు,
రేపు కాలిబాట భక్తులకు
ఇచ్చే దివ్య దర్శనం, సర్వ
దర్శనం టోకెన్ల కూడా రద్దు,
సర్వదర్శనం ద్వారా మాత్రమే
స్వామివారి దర్శినానికి
అనుమతించినా మూడు
గంటలు బ్రెక్ ఉంటుందని
గమనించగలరు,
శ్రీవేంకటేశ్వర సుప్రభాతం
!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ !!
తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది
కావున లెమ్ము స్వామి
ttd Toll free #18004254141
తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం
కోసం క్రింద లింకు ద్వారా చేరండి
https://t.me/joinchat/AAAAAEHgDpvZ6NI-F2C7SQ
7. చరిత్రలో ఈ రోజు జూన్, 08 సంఘటనలు
632: ఇస్లాం మతాన్ని స్థాపించిన మహమ్మద్ ప్రవక్త మదీనాలో పరమపదించాడు. ఆయన తరువాత కాలిఫ్ అభు బకర్ ఆయన బాధ్యతలు స్వీకరించాడు.
1958: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు స్వీడన్లోప్రారంభమయ్యాయి.
1990: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు ఇటలీలోప్రారంభమయ్యాయి.
**జననాలు
1921: సుహార్తో, ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు. (మ.2008)
1924: డి.రామలింగం, ప్రముఖ రచయిత. (మ.1993)
1946: గిరి బాబు, ప్రముఖ తెలుగు సినీ నటుడు, దర్శకుడు మరియు నిర్మాత.
1957: డింపుల్ కపాడియా, భారత సినిమా నటి.
1959: మాడుగుల నాగఫణి శర్మ, అవధాని
1965: లక్ష్మణ్ ఏలె, ప్రసిద్ధ భారతీయ చిత్రకారుడు.
1975: శిల్పా శెట్టి, భారత సినిమా నటి
** మరణాలు
1845: ఆండ్రూ జాక్సన్, అమెరికా మాజీ అధ్యక్షుడు (జ.1767).
1938: బారు రాజారావు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, అఖిల భారత జాతీయ కాంగ్రేసు కార్యాలయ కార్యదర్శి. (జ.1888)
1981: చివటం అచ్చమ్మ, అవధూత మరియు యోగిని.
2002: భూపతిరాజు విస్సంరాజు, ప్రముఖ సంఘ సేవకుడు, పద్మభూషణ అవార్డు గ్రహీత. (జ.1920)
2012: కె.ఎస్.ఆర్.దాస్, తెలుగు మరియు కన్నడ సినిమా దర్శకుడు. (జ.1936)
2015: దాశరథి రంగాచార్య, ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. (జ.1928)
2017: ఇందారపు కిషన్ రావు ప్రముఖ అవధాని, కవి మరియు బహుభాషా కోవిదుడు. (జ.1941)
2018: ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, మొదటి లోక్‌సభ సభ్యుడు కందాళ సుబ్రహ్మణ్య తిలక్‌మరణం (జ.1920).
పండుగలు మరియు జాతీయ దినాలు
ప్రపంచ సముద్ర దినోత్సవం .
అంతర్జాతీయ బ్రెయిన్ ట్యూమర్ దినం.
8. శుభమస్తు
తేది : 8, జూన్ 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్ఠమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : శనివారం
పక్షం : శుక్లపక్షం
తిథి : షష్టి
(ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 17 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 2 గం॥ 55 ని॥ వరకు)
నక్షత్రం : ఆశ్లేష
(నిన్న రాత్రి 6 గం॥ 57 ని॥ నుంచి
ఈరోజు సాయంత్రం 5 గం॥ 22 ని॥ వరకు)
యోగ : వ్యాఘాతము
కరణం : బాలవ
వర్జ్యం : (ఈరోజు ఉదయం 6 గం॥ 54 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 23 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 52 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 21 ని॥ వరకు)
దుర్ముహూ : (ఈరోజు ఉదయం 7 గం॥ 25 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 17 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 8 గం॥ 56 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 34 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 40 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 18 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 52 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 30 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 40 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 48 ని॥ లకు
సూర్యరాశి : వృషభము
చంద్రరాశి : కర్కాటకము
9. విశాఖ శారద పీఠాధిపతిగా కిరణ్‌శాస్త్రి-ఈ నెల 15,16,17 తేదీల్లో ఉత్తరాధికారిగా స్వీకార మహోత్సవం
విశాఖ శారదా పీఠం అధిపతిగా ప్రస్తుత పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి శిష్యుడు కిరణ్‌శాస్త్రి నియమితులవుతున్నట్లు ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ తెలిపింది. ఇందుకు సంబంధించి ఈ నెల 15,16,17 తేదీల్లో విజయవాడ కృష్ణా కరకట్టపై ఉత్తరాధికారి శిష్య తురీయాశ్రమ దీక్షా స్వీకార మహోత్సవంను నిర్వహిస్తున్నట్లు అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ స్టేట్ అడిషనల్ సెక్రటరీ రఘురామయ్య చెరుకుచర్ల తెలిపారు.ఈ మేరకు ఈ స్వీకార మహోత్సవానికి సంబంధించిన వాల్‌పోస్టర్లను బుధవారం హైదరాబాద్‌లోని కుబేరా ప్యాలెస్‌లో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, అధికార ప్రతినిధి కె.వేణుగోపాలచారి, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రఘురామయ్య మాట్లాడుతూ..స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి పదవి ముగుస్తున్న కారణంగా ఆయన స్థానంలో తన శిష్యుడు కిరణ్ శాస్త్రిని విశాఖ పీఠాధిపతిగా నియమిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావులతో పాటు దేశంలో పలువురు రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు హాజరవుతున్నట్లు తెలిపారు.
10. గురువాయుర్ ఆలయంలో ప్రధాని మోదీ తులాభారం
కేరళలోని ప్రముఖ గురువాయుర్ ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు సందర్శించారు. కేరళ సాంప్రదాయ దుస్తులు ధరించి ప్రధాని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోచీ నుంచి నేవీ ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రధాని బయల్దేరి ఆలయానికి చేరుకున్నారు. ప్రధాని వెంట ఆ రాష్ట్ర గవర్నర్ పి.సాదాశివం, కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి వీ.మురళీధరన్, కేరళ దేవాదాయశాఖ మంత్రి సురేంద్రన్ ఉన్నారు. ఆలయంలో ప్రధాని తులాభారం నిర్వహించారు. మోదీ తన బరువుకు సమానంగా 100 కిలోల కమల పువ్వులతో తులాభారం వేసి ఆలయానికి సమర్పించారు. అదేవిధంగా నెయ్యి, ఎర్రటి అరటిపండ్లను ఆలయానికి సమర్పించారు.
11. ధర్మపురి దేవస్థానంలో భక్తుల రద్దీ
ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో దూర ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ప్రధాన ఆలయంలో ఉదయం వేళ పంచోపనిషత్తు పూర్వకంగా అభిషేకాలను, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారికి విశేష పూజలు జరిపారు. అనంతరం నిర్వహించిన స్వామివారి నిత్య కల్యాణోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాన ఆలయంతో పాటు అన్ని అనుబంధ ఆలయాల్లోనూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే తీరుగా భక్తుల రద్దీ నెలకొంది. దేవస్థానం ఈఓ అమరేందర్ ఆధ్వర్యంలో సిబ్బంది, అర్చకులు ఏర్పాట్లు చేశారు.
12. జూన్ 11న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 11వ తేదీ మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో జూన్ 13 నుండి 21వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.ఈ సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 8.00 నుండి 10.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 11.30 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతిస్తారు.
**బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం సాయంత్రం
13-06-2019(గురువారం) ధ్వజారోహణం(కర్కాటక లగ్నం) పెద్దశేష వాహనం
14-06-2019(శుక్రవారం) చిన్నశేష వాహనం హంస వాహనం
15-06-2019(శనివారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
16-06-2019(ఆదివారం కల్పవృక్ష వాహనం కల్యాణోత్సవం,సర్వభూపాల వాహనం
17-06-2019(సోమవారం) మోహినీ అవతారం గరుడ వాహనం
18-06-2019(మంగళవారం) హనుమంత వాహనం గజ వాహనం
19-06-2019(బుధవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
20-06-2019(గురువారం) రథోత్సవం అశ్వవాహనం
21-06-2019(శుక్రవారం) చక్రస్నానం ధ్వజావరోహణం
బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు, రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. జూన్ 16వ తేదీ సాయంత్రం 5.00 నుండి రాత్రి 7.30 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక అప్పం, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు.ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.