ప్రయాణికుల సౌకర్యార్థం అనేక వసతులను కల్పిస్తున్న భారతీయ రైల్వే విభాగం తాజాగా మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. రైళ్లలో ప్రయాణించే వారికి మసాజ్ సేవలు అందించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతానికి ఈ సేవల్ని ఇండోర్ నుంచి ప్రారంభమయ్యే 39 రైళ్లలో అందుబాటులో ఉంచనున్నట్లు రైల్వే ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. పశ్చిమ రైల్వే విభాగంలోని రత్లాం డివిజన్ నుంచి ఈ ప్రతిపాదన వచ్చినట్లు తెలిపారు. అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంలో భాగంగానే ఈ సేవల్ని ప్రారంభిస్తున్నారు. దీని ద్వారా సంవత్సరానికి దాదాపు రూ.90లక్షల ఆదాయం అదనంగా సమకూరే అవకాశం ఉందన్నారు. మసాజ్ సేవల్ని అందించే వారి రూపంలో రైల్వే శాఖకు మరో 20 వేల టికెట్లు అదనంగా అమ్ముడయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదనపు ఆదాయ మార్గాల్లో భాగంగా ప్రవేశపెడుతున్న ఈ సేవలపై ఇతర రైల్వే విభాగాలు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని రైల్వే శాఖ కోరింది. అలాగే అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో భాగంగా ఇలాంటి వినూత్న ప్రతిపాదనలతో ముందుకు రావాలని పిలుపునిచ్చింది.
ఇక భారతీయ రైళ్లల్లో మాలీష్ మర్దనలు
Related tags :