పరికిణీ – ఓణీ… అమ్మాయిలకే అనే రోజులు కావివి. వారితో పాటు పెళ్లయినవారూ ఎంచుకోవచ్చు. అయితే కొన్ని జాగ్రత్తలు తెలిసుండాలి. తెలుగు సంవత్సరాదిన సంప్రదాయానికి ప్రాధాన్యం ఇవ్వాలనుకునేవారికి ఈ వస్త్రశ్రేణి సరైన ఎంపిక కూడా. ప్రయత్నించి చూడండి అంటూ కొన్ని సూచనలు చేస్తున్నారు డిజైనర్ సుప్రజాదేవి చలసాని. పండగల్లో పట్టు పావడాతో ప్రత్యేకంగా కనిపించాలంటే కంచిపట్టుకి మించింది లేదు. జర్దోసీ మెరుపులు, అదనపు హంగులు వీటికి అవసరం లేదు. వీటి అంచు, నేత పనితనమే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. గళ్లు, ఆలయాల స్ఫూర్తితో రూపొందించిన ఏనుగులు, గుడి గోపురాలు వంటి డిజైన్లు ఇప్పుడు ఆదరణలో ఉన్నాయి. అయితే నెట్టెడ్, జార్జెట్ వంటి జాలువారే వస్త్రాలను ఎంచుకునేందుకు ప్రయత్నించాలి. * ప్రతిసారీ పట్టుకట్టాలన్నా, కొనాలన్నా ఇబ్బంది అనుకుంటే ఓ పనిచేయండి. తెలుగు నేత పనితనాలైన ఇకత్, గద్వాల్, నారాయణ్‌పేట్ రకాల్ని ఎంచుకోండి. చిన్నంచుల్లో, కొత్త రంగుల్లో ఇప్పుడు అవి అన్నివర్గాలను ఆకట్టుకుంటున్నాయి. రెండు చేనేత రకాలను మ్యాచింగ్ చేసుకుని కూడా ఈ పరికిణీ ఓణీలను డిజైన్ చేయించుకోవచ్చు. అయితే ఎలాంటివి ఎంచుకున్నా వాటికి చక్కటి ప్యాటర్న్ బ్లవుజు ఉండాల్సిందే. బుట్ట చేతులు, మోచేతి వరకూ ఉండే డిజైన్లు, అంచుల్లో కుచ్చిళ్లు వంటివి ప్రయత్నిస్తే ఆధునికంగా కనిపిస్తారు. * ఆకాశనీలం, పీచ్, గులాబీ, పసుపు, నీలం వంటి రంగులను ఎంచుకుంటే పండగకళ అంతా మీ దగ్గరే ఉంటుంది. పరికిణీలకే కాకుండా వాటిమీదకు జతచేసే ఓణీలూ ప్రత్యేకంగా కనిపిస్తేనే నిండుదనం. ఏదో ఒకటి మ్యాచింగ్ అయ్యిందని అనుకోకుండా కాస్త భిన్నంగా ఉండేలా ఎంచుకోవాలి. ఆడంబరంగా కనిపించాలనుకున్నప్పుడు బుటీ పరికిణీకి జతగా కంచిపట్టు పెద్ద అంచు ఓణీ ప్రయత్నించండి. లేదంటే బెనారస్, బాందినీ, జార్జెట్ దుపట్టాలు బాగుంటాయి. వాటిపై కట్‌వర్క్ పనితనం, బాందినీకి జతగా అద్దాలు, కుందన్లు ఉండేలా చూసుకోవాలి. అదే జార్జెట్ మీదకు చిన్నగా చేసే మగ్గంవర్క్ మెరిపిస్తుంది. సిల్క్ దుపట్టాని డబుల్ షేడ్లలో కూడా ఎంచుకోవచ్చు. పరికిణీ ఓణీ వేసుకున్నప్పుడు చేతికి నిండుగా గాజులు, చెవులకు పెద్ద జుంకాలు బాగుంటాయి. సిల్వర్ హారాలు, లోలాకులు కూడా నప్పుతాయి.
వయ్యరిభామ ఓణీ వేసుకోమ్మా!
Related tags :