మృగశిర కార్తెను పురస్కరించుకొని బత్తిన మృగశిర ట్రస్ట్ చేప ప్రసాద వితరణ ప్రశాంతంగా ముగిసింది. గత ఏడాది 86 వేల మందికి పంపిణీచేయగా.. ఈసారి 90,500 మందికి చేప ప్రసాదం అందజేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన ప్రసాదం పంపిణీ.. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. శుక్రవారం నుంచే చేప ప్రసాదం తీసుకొనేందుకు జనం రావడంతో ఎగ్జిబిషన్ మైదానం ప్రాంతాలు ఉబ్బసం వ్యాధిగ్రస్థులతో నిండిపోయాయి. రెండురోజులపాటు కొనసాగిన ప్రసాద వితరణలో 90,500 మంది కొర్రమీను చేప ప్రసాదం స్వీకరించినట్టు మత్స్యశాఖ అధికారులు వెల్లడించారు. ఈ సంఖ్య గతేడాది కన్నా 4,500 అదనం. చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లల్లో అన్నీ తానై వ్యవహరించిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆదివారం కూడా ఎగ్జిబిషన్ మైదానానికి వచ్చి చేప ప్రసాద వితరణ కొనసాగుతున్న తీరును పర్యవేక్షించారు. ప్రభుత్వ యంత్రాంగాల చొరవతో చేప ప్రసాదం పంపిణీ విజయవంతం కావడంతో.. మంత్రి వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, పాతబస్తీ దూద్‌బౌలిలోని తమ నివాసంతోపాటు, తమ కుటుంబసభ్యులు నివాసించే కవాడిగూడ (కల్పన థియేటర్ సమీపం), వనస్థలిపురం (వాటర్‌ట్యాంక్ సమీపం), కూకట్‌పల్లి (బాలాజీనగర్)లో సోమవారం ఒక్కరోజు చేప ప్రసాదం అందజేయనున్నట్టు బత్తిని హరినాథ్‌గౌడ్ తెలిపారు.
90వేల మందికి చేపమందు ఇచ్చారు
Related tags :