నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు కేరళను తాకాయి.
ఆదివారం ఉదయం కేరళను తాకినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
మాల్దీవులు, కోమోరిన్ ప్రాంతాలు పూర్తిగా, దక్షిణ అరేబియా సముద్రంలో కొన్ని ప్రాంతాలు, లక్ష దీవుల్లో చాలా ప్రాంతాలు, కేరళ, దక్షిణ తమిళనాడుల్లో కొన్ని ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతం, తూర్పుమధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతాల్లో కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి, సీనియర్ అధికారి రాజారావు వెల్లడించారు.
అక్కడినుంచి ఈ నెల 11 లేదా 12 తేదీల్లో రాయలసీమలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయన్నారు.
అనంతరం 13న తెలంగాణలోకి ప్రవేశిస్తాయని తెలిపారు.
ఆ తర్వాత ఈ నెల 15వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాయని పేర్కొన్నారు.
వాస్తవంగా రుతుపవనాలు ముందు ప్రకటించినట్లుగా ఈ నెల 6న కేరళలోకి, 11న తెలంగాణలోకి ప్రవేశించాలి.
రెండ్రోజులు ఆలస్యంగా కేరళలోకి ప్రవే శించాయి. భూమి వేడి తగ్గితేనే రుతుపవనాలు వేగం గా ప్రవేశిస్తాయని, వాటికి అనుకూల పరిస్థితులు ఏర్పడాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.